జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి. ఓ ఇన్వెస్టర్‌గా వాటిని దూరం పెట్టడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా కొనసాగేలా చూసుకోవచ్చు. ఎక్కువ పొదుపు, తక్కువ ఖర్చు, అనవసర రుణాలకు దూరంగా ఉండడం అన్నవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వ్యక్తిని ఆరి్థకంగా సౌకర్యంగా ఉంచుతాయి. ఆర్థికపరమైన విజ్ఞానం ఉన్నవారు సైతం కొన్ని తప్పిదాల వల్ల ఆరి్థకంగా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థికంగా దూరంగా ఉంచాల్సిన అలవాట్లపై అవగాహన కలి్పంచడమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం...
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి అలవాటే. కానీ, షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వీరిలో తగినంత పరిశోధన, అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేసే వారు చాలా చాలా తక్కువ. ఇటీవలి మార్కెట్ పతనం చాలా మంది చిన్న ఇన్వెస్టర్లను కుదిపేసిందనే చెప్పుకోవాలి. చాలా స్టాక్స్ ఇటీవలి బడ్జెట్ తర్వాత నూతన 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఏడాది క్రితం రూ.600పైన పలికింది. ప్రస్తుత ధర రూ.48.65. అంటే దాదాపు 92 శాతం మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది.
కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ స్థాయి నష్టాలేమీ లేవు. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ కూడా క్షీణించడం సహజమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించడం వల్ల నష్టాలు పరిమితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ చెత్త పనితీరు చూపించిన పథకాలు కూడా... బీఎస్‌ఈ 100లోని ఎక్కువగా నష్టపోయిన షేర్ల కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం.
ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, కొంత మేర మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఫండ్స్‌లో ఆయనకు సగటు రాబడులు 8 శాతంగా ఉంటే, స్టాక్స్‌లో ఆయన నష్టాలు భారీగా పేరుకుపోయాయి. 50 శాతంపైన నష్టాల పాలయ్యాడు. అందుకే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎంతో అవగాహన, అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరం. ఈ విషయాన్నే చాలా మంది ఇన్వెస్టర్లు విస్మరిస్తుంటారు. ఎంచుకునే కంపెనీల విషయంలో తాము సొంతంగా అధ్యయనం చేసి నిర్ధారించుకోలేని వారు, నిపుణుల సలహాలను పొందొచ్చు. లేదంటే మంచి ట్రాక్ రికార్డు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం నయం.
అధ్యయనం లేకుండా ముందడుగు
మన దేశంలో చిగురిస్తున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా ప్రారంభించిన ఐదేళ్లలోపే మూతపడుతున్నాయని ఐబీఎం నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. సావన్ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో ఓ వెంచర్‌ను ఆరంభించాడు. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. క్రమంగా దాన్ని విస్తరించాలన్నది ప్రణాళిక. కానీ న్యాయపరమైన, నియంత్రణపరమైన అవరోధాలతో 2014లోనే దాన్ని ఆపేయాల్సి వచి్చంది. అయితే, ఇది అతడి జీవన ప్రణాళికలపైనా పడింది.
వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా, ఇంటి రుణం, పర్సనల్ లోన్, పిల్లల విద్య అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడుల ప్రణాళికలకు విఘాతం కలిగింది. తిరిగి మరలా ఉద్యోగంలో చేరేందుకు ఏడాది సమయం పట్టింది. తన సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉండొచ్చు. తానో ఎంట్రప్రెన్యూర్‌గా మారాలన్న అభిలాష ఉండొచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు సమగ్ర సన్నద్ధత అవసరం. ఇలా సొంత ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుగానే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి.
పన్ను ఆదా కోసం బీమా
మన దేశంలో ఏటా కోట్లాది రూపాయలను అవసరం లేని బీమా ప్లాన్లపై వెచి్చస్తున్న విషయం తెలుసా..? బీమాలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు, జీవితానికి బీమా రక్షణ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను లేకపోవడం... ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ట్రిపుల్ బెనిఫిట్. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో పన్ను ఆదా ఒక్క ప్రయోజనం తప్పించి... నిజానికి సరిపడా బీమా రక్షణను అవి ఇవ్వలేవు. అంతేకాదు సరైన రాబడులను కూడా ఇవ్వవు.
మీరు చెల్లించే ప్రీమియంలో సగ భాగం బీమా రక్షణ ఖర్చులకే పోతుంది. మిగిలిన పెట్టుబడులపై వచ్చే రాబడి చూసుకుంటే మొత్తంమీద రాబడి రేటు 5 శాతం దాటదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన యులిప్‌లు రాబడుల విషయంలో కొంచెం మెరుగైనవే. కానీ వీటిల్లో చార్జీలు, ఫీజులు, రాబడుల విషయంలో పారదర్శకత తక్కువ. బీమా పాలసీల్లో ప్రధానమైనది దురదృష్టవశాత్తూ మరణం చోటు చేసుకుంటే, ఆ కుటుంబ ఆర్థిక అవసరాను గట్టె క్కించేది అయి ఉండాలి. కానీ, సంప్రదాయ పాలసీల్లో ఇదే ఆఖరు ప్రాధాన్యంగా ఉంటుందన్న నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది చూస్తున్నది పన్ను ఆదానే. ఇదే పాలసీలను మార్కెట్ చేసే వారికి ఆయుధంగా మారుతోంది. 63 ఏళ్ల రాజారావు ఓ పెన్షనర్. మూడేళ్ల క్రితం ఆయనొక యులిప్ పాలసీ తీసుకున్నారు.
రాజారావు పదవీ విరమణ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే, బ్యాంకు ఉద్యోగి ఆయనకు యులిప్ పాలసీ అంటగడ్డాడు. దీనివల్ల పన్ను ఆదా చేసుకోవచ్చన్న బ్యాంకు ఉద్యోగి మాటలను నమ్మి యులిప్ పాలసీని రాజారావు తీసుకున్నాడు. మూడేళ్లలో ఇందులో రూ.4.5 లక్షలు పెడితే, మూడేళ్ల తర్వాత ఆయన పెట్టుబడి విలువ రూ.4 లక్షలుగానే కనిపిస్తోంది. ఫండ్ విలువ కోలుకునే వరకూ వేచి చూడాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారంటూ రాజారావు పేర్కొన్నారు. నిజానికి సీనియర్ సిటిజన్ అయిన రాజారావుకు యులిప్ పాలసీ అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లింక్డ్ పాలసీ అది. దీనికి బదులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనుకూలం.
వైవిధ్యం ఎక్కువైతే...
పెట్టుబడులకు వైవిధ్యం అన్నది ప్రాణం అవుతుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ నూరు శాతం ఉంటుంది. కానీ, ఈ పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య డెవర్సిఫై చేయడం వల్ల రిస్‌్కను వేరు చేసినట్టు అవుతుంది. కానీ, వైవిధ్యం శ్రుతిమించకూడదు. ఆప్పుడే ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రిస్క్ తగ్గించుకోవాలని లెక్కకు మించిన చోట ఇన్వెస్ట్ చేయడం అనుకున్న ప్రయోజనాలను ఇవ్వదు. మోడల్ పోర్ట్‌ఫోలియో అంటే... వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ 15–20 మించకుండా చూసుకోవడం. ఇది రిస్‌్కను తగ్గిస్తుంది. ఈ వైవిధ్యం పెట్టుబడుల రిస్‌్కను ఎన్నో సెక్యూరిటీల మధ్య పంచుతుంది. అలా అని పదుల సంఖ్యలో చాంతాడంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఇంకా తగ్గుతుందని అనుకుంటే అది నిజం కాబోదు.
ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కూ అమలవుతుంది. సెక్టార్ ఫండ్స్ (థీమ్యాటిక్) మినహా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌లో వైవిధ్యం అన్నది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు, భిన్న రంగాలకు చెందిన కంపెనీలను, అలాగే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలను పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటారు. కనుక తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక సంఖ్యలో పథకాలను ఎంచుకున్నారనుకోండి... ఆయా పథకాలు ఒకే తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గకపోగా, పెరుగుతుంది. నెలకు రూ.5,000–20,000 మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే మహా అయితే నాలుగు పథకాలు సరిపోతాయి.
40 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కోసం, 30 శాతం మల్టీక్యాప్ పథకాలకు, 20 శాతం మిడ్‌క్యాప్, 10 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పుణెకు చెందిన సౌమ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అది కూడా మంచి పనితీరు చూపించే పథకాల్లోనే. కానీ, ఒక ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం మరుసటి ఏడాది కూడా టాప్‌లోనే ఉండాలని లేదు కదా. దాంతో సౌమ్య పోర్ట్‌ఫోలియోలో పథకాల సంఖ్య 30కు చేరుకుంది. దీంతో కొన్నింటిని తగ్గించుకుందామనుకున్నా... వేటిని తీసేయాలన్న సందిగ్ధం ఆమెను వేధిస్తోంది. ఒకటి రెండు పథకాలను అదనంగా ఎంచుకున్నా ఫర్వాలేదు కానీ, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అయితే, షేర్ల మాదిరిగా ఫండ్స్ పథకాలు ఎక్కువైపోతే నష్టాలు వస్తాయనేమీ లేదు. ఎందుకుంటే ఫండ్స్ ఎప్పుడూ నిపుణుల నిర్వహణలోనే కొనసాగుతుంటాయి. కాకపోతే రాబడుల రేటే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాటిని పర్యవేక్షించడం కష్టమవుతుంది.
అత్యవసరాలు...
జీవనశైలి ఖర్చులన్నవి నేడు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఖర్చు చేసేందుకు ఎన్నో ఆకర్షణలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే జీవితానికి కనీస అవసరాలన్నవి గతంతో పోలిస్తే అధికమయ్యాయి. రిటైర్మెంట్ అవసరాల కోసం తాము చేస్తున్న పొదుపు, మదుపులను వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిగ్నా నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పడం గమనార్హం. 40 శాతం మంది తాము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. ముంబైకి చెందిన కీర్తి నెల ఆదాయంలో వ్రస్తాలు, ఆహారం, ప్రయాణ అవసరాలకే 75 శాతం ఖర్చవుతోంది. దీంతో ఆమె పొదుపు చేసేందుకు మిగులుతున్నది కొద్ది మొత్తంగానే ఉంటోంది. అంతేకాదు, తగినంత పొదుపు లేకపోవడం వల్ల ఆమె కంటి సర్జరీని వాయిదా వేసుకోవాల్సి వచి్చంది.
ఆలస్యంగా వాస్తవాన్ని గ్రహించిన కీర్తి, ప్రతి నెలా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. అంతేకాదు హెల్త్ ప్లాన్ తీసుకోవడం, అత్యవసరాల కోసం ఓ నిధిని సమకూర్చుకోవడం కూడా ఆమె ముందున్న అవసరాలు. చాలా మంది అత్యవసర నిధి అవసరాన్ని పట్టించుకోరు. అవసరం వచ్చినప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తుంటారు. కనుక ఆర్జించే ప్రతీ వ్యక్తి కూడా 6–8 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం రూ.5 లక్షలకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెరిగే అవసరాలకు అనుగుణంగా కవరేజీని టాపప్ ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు కుటుంబానికి ఆధారంగా ఉండేవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 10–15 రెట్ల మేర టర్మ్ బీమా ప్లాన్ కూడా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment