Insurance protection
-
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!
అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి. ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్ కవరేజీ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు. కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. టీపీఏ, నెట్వర్క్ ఆసుపత్రులు బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆమోదించే నెట్వర్క్ హాస్పిటల్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు. అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఊహించని అవరోధాలు.. ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్ ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
మీ డిపాజిట్లు భద్రంగా ‘ఫిక్స్’
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పట్ల ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. ఎందుకంటే భద్రత ఎక్కువ. లిక్విడిటీ కూడా ఎక్కువే. అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుని సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకు పెద్దగా విషయ పరిజ్ఞానం, టెక్నాలజీ తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా దాదాపుగా ఇంతే. ఈ సంప్రదాయ పెట్టుబడి సాధనాలు ఇప్పటికీ ఎంతో మంది ఆదరణకు నోచుకోవడానికి ఇవే కారణాలు. అయితే, ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు సంక్షోభాల పాలైనట్టు వార్తలు వినే ఉంటారు. దీంతో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల భద్రతపై భయాలు కలగొచ్చు. కానీ, బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా రక్షణ ఉంటుందన్న విషయం తెలిసిన వారు కొద్ది మందే. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ కల్పిస్తున్న డిపాజిట్ బీమా రక్షణ గురించి.. డిపాజిట్లపై రక్షణను పెంచుకునే మార్గాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం రండి.. ∙ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది చూసేది వడ్డీ రేటు. ఆ తర్వాత తమ డిపాజిట్‌కు రక్షణ ఎంత మేరకు అని. ఇవి కాకుండా డిపాజిట్లపై పన్ను భారం గురించి ఆలోచించే వారూ ఉంటారు. బ్యాంకులు దుకాణాన్ని రాత్రికి రాత్రి ఎత్తేయవులేనన్న నమ్మకమే అందరిలోనూ కనిపిస్తుంది. ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్లో ఓ ముఖ్య ప్రకటన చేశారు. బ్యాంకు ఒకవేళ విఫలం చెందితే, లేదా ఆ బ్యాంకు నుంచి డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు విధించినట్టయితే.. కస్టమర్లు డీఐసీజీసీ కింద రూ.5లక్షలను వెంటనే పొందొచ్చంటూ ఆమె ప్రకటించారు. ఫిక్స్డ్ డిపాజిట్లనే నమ్ముకున్న వారికి ఇది మరింత ఆనందం కలిగించే వార్తే అవుతుంది. పెట్టుబడికి భద్రత ఎంత..? పెట్టుబడికి, రాబడులకు ఉన్న భరోసానే బ్యాంకు డిపాజిట్ల వైపు మొగ్గు చూపించేలా చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో డిపాజిటర్ల డబ్బులు చెల్లించకుండా బ్యాంకులు చేతులెత్తేసిన ఘటనలు దాదాపుగా లేవు. ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కింద పనిచేస్తుంటాయి కనుక బ్యాంకులు అరుదుగానే వైఫల్య స్థితికి చేరుతుంటాయి. బ్యాంకులపై నిరంతరం పర్యవేక్షణతోపాటు.. అదనంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూపంలో డిపాజిటర్ల డబ్బులకు ఆర్బీఐ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. డీఐసీజీసీ అన్నది ఆర్బీఐ అనుబంధ సంస్థ. ఒక్క కస్టమర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్లకు బీమా రక్షణ ఉంటుంది. ఒక్కో కస్టమర్ తరఫున బీమా రక్షణ కోసం అయ్యే ప్రీమియాన్ని బ్యాంకులే చెల్లిస్తాయి తప్పితే కస్టమర్ల నుంచి తీసుకోవు. మొట్టమొదటిగా 1962లో డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో గరిష్టంగా రూ.1,500 డిపాజిట్‌కు ఇన్సూరెన్స్ ఉండేది. తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చి రూ.5 లక్షలకు చేరింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ పెరిగిన తీరు రూ.5లక్షల బీమా అన్నది.. కరెంటు ఖాతా, సేవింగ్స్ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇలా ఏ రూపాల్లో ఉన్నా కానీ.. అసలు, వడ్డీ కలుపుకుని గరిష్టంగా రూ.5లక్షలకే బీమా కవరేజీ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక బ్యాంకు పరిధిలో భిన్న శాఖల్లో డిపాజిట్లు ఉన్నప్పటికీ అన్నింటికీ కలిపి ఇది అమలవుతుంది. అంటే ఒక కస్టమర్‌కు ఒక బ్యాంకు పరిధిలోనే రూ.5లక్షల పరిమితి అమలవుతుంది. ఇంతకు మించి ఎంత మొత్తం ఉన్నాకానీ, ఒకవేళ బ్యాంకు మునిగిపోతే రూ.5లక్షల వరకే తిరిగి డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కాకపోతే డిపాజిట్ చేస్తున్న బ్యాంకు ‘డీఐసీజీసీ’ కిందకు వస్తుందా? రాదా? అన్నది ముందే విచారించుకోవాలని పైసా బజార్ డాట్ కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా సూచించారు. డీఐసీజీసీ పరిధిలో ఉన్నవి.. కమర్షియల్ బ్యాంకులు: అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకుల శాఖలు, లోకల్ ఏరియా బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు కోపరేటివ్ బ్యాంకులు: అన్ని రాష్ట్రాల, కేంద్ర, ప్రైమరీ కోపరేటివ్ బ్యాంకులు.. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు. అన్ని కోపరేటివ్ బ్యాంకులు. వీటికి బీమా రక్షణ సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు వీటికి లేదు రక్షణ విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్రాల డిపాజిట్లు, ఇంటర్ బ్యాంకు డిపాజిట్లు, స్టేట్ కోపరేటివ్ బ్యాంకుల వద్దనున్న స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంకుల డిపాజిట్లు తక్షణమే రూ. 5లక్షలు బ్యాంకు సంక్షోభంలో చిక్కుకుంటే డిపాజిటర్లు డీఐసీజీసీ కింద వెంటనే రూ.5 లక్షల వరకు పొందే విధంగా తాము ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సవరణలను తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిపాజిటర్లు తమ తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇటీవలి కాలంలో పీఎమ్‌సీ బ్యాంకు, యస్ బ్యాంకు డిపాజిటర్లకు చేదు అనుభవాలు ఎదురైన విషయం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు) డిపాజిటర్లు అయితే తమ డిపాజిట్లను పొందలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాకపోతే యస్ బ్యాంకు యాజమాన్యంలో తక్షణమే మార్పులు చేసి, కొత్త ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి దాన్ని పట్టాలెక్కేలా చేయడంతో కస్టమర్లకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ పరిణామాల అనుభవం తో ఆర్థిక మంత్రి ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు అర్థం అవుతోంది. నిజానికి ఇప్పటి వరకు బ్యాంకు సంక్షోభం పాలైతే డీఐసీజీసీ కింద బీమా పరిహారం వెంటనే వచ్చే అవకాశం లేదు. బ్యాంకుకు సంబంధించి తుది పరిష్కారం లభించే వరకు.. అంటే అది నెలలు, సంవత్సరాలు అయినా వేచి చూడాల్సిందే. మంత్రి పేర్కొన్నట్టు సవరణల తర్వాత బ్యాంకుల్లో ఎఫ్‌డీల విషయమై డిపాజిటర్లకు మరింత వెసులుబాటు లభించినట్టే అవుతుంది. మరింత కవరేజీ కోసం.. డీఐసీజీసీ కింద గరిష్ట బీమా రూ.5 లక్షలు అన్నది ఒక కస్టమర్‌కు ఒక బ్యాంకుకే పరిమితం. ఒక బ్యాంకుకు చెందిన భిన్న శాఖల్లో డిపాజిట్లు ఉన్నప్పటికీ ఇదే అమలవుతుంది. కనుక ఒక డిపాజిటర్ ఒక్కో బ్యాంకులో రూ.5లక్షల చొప్పున ఒకటికి మించిన బ్యాంకుల్లో డిపాజిట్లు కలిగి ఉంటే, అప్పుడు విడిగా ప్రతీ బ్యాంకు పరిధిలో రూ.5 లక్షలను పొందేందుకు అర్హులు అవుతారు. కనుక ఎక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేయాలనుకునే వారు తమ పేరిట ఒకే బ్యాంకులో కాకుండా ఒకటికి మించిన బ్యాంకుల్లో లేదా కుటుంబ సభ్యుల పేరిట కొంత మొత్తాలను వేరు చేసి డిపాజిట్ చేసుకోవడం ద్వారా బీమా రక్షణ పెంచుకోవచ్చు. ఒకే వ్యక్తి ఒక బ్యాంకులోనే డిపాజిట్ చేసుకునేట్టు అయితే, కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురి పేరిట డిపాజిట్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అసలు, వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలే పరిమితి కనుక డిపాజిట్‌ను రూ.4 లక్షలకు పరిమితం చేసుకోవడం మంచి ఐడియా అవుతుంది. ఇందులో ఉన్న మరో అనుకూల అంశం.. బ్యాంకుల మధ్య వడ్డీ రే ట్లు మారుతుంటాయి. కనుక ఒకటికి మించిన బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం వల్ల సగటు వడ్డీ రేటు కాస్త అధికంగా పొందవచ్చు. ఇవి వేరు.. ఈ కేసుల్లో డిపాజిట్లు కలిగి ఉండడాన్ని వ్యక్తిగతం కా కుండా భిన్నమైన హక్కుల కింద చట్టం పరిగణిస్తోంది. ► ఓ సంస్థ భాగస్వామి హోదాలో ► డిపాజిట్ కలిగి ఉండడం ► గార్డియన్‌గా డిపాజిట్ కలిగి ఉండడం ► కంపెనీ డైరెక్టర్ హోదాలో డిపాజిట్ ఉండడం ► ట్రస్టీగా డిపాజిట్ కలిగి ఉంటే బీమా రక్షణ వేర్వేరుగా అమలవుతుంది. అంటే ‘ఎక్స్’ అనే వ్యక్తి వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా పొందడమే కాదు.. ఇక్కడ పేర్కొన్న మిగిలిన కేసుల్లోనూ ఎక్స్ డిపాజిట్లు కలిగి ఉంటే విడిగా ఒక్కో కేసులో రూ.5 లక్షల చొప్పున బీమాకు అర్హులు అవుతారు. ఎవరు చెల్లిస్తారు..? ప్రస్తుతమున్న విధానంలో బ్యాంకు లిక్విడేషన్‌కు వెళితే అప్పుడు లిక్విడేటర్‌కు డీఐసీజీసీ బీమా చెల్లింపులు చేస్తుంది. లిక్విడేటర్ నుంచి క్లెయిమ్ రసీదు అందుకున్న రెండు నెలల్లోగా చెల్లింపులు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అప్పుడు ప్రతీ డిపాజిటర్‌కు చట్టబద్ధంగా డిపాజిట్ చెల్లింపులను లిక్విడేటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు విలీనానికి వెళితే, విలీనం చేసుకున్న బ్యాం కు నుంచి క్లెయిమ్ రసీదు అందుకున్న రెండు నెలల్లోగా డీఐసీజీసీ ఈ చెల్లింపులు చేస్తుంది. అప్పుడు విలీనం చేసుకున్న బ్యాంకు డిపాజిటర్ల వారీగా చె ల్లింపులు పూర్తి చేస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ డీఐసీజీసీ నేరుగా డిపాజిటర్లకు చెల్లింపులు చేయదు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే బ్యాంకులు స్వీకరించే ప్రతీ డిపాజిట్‌కు సంబంధించి ప్రీమియాన్ని డీఐసీజీసీకి చెల్లించాలి. అప్పుడే డిపాజిటర్‌కు బీమా రక్షణ లభిస్తుంది. మరి బ్యాంకు సకాలంలో ఈ ప్రీమియాన్ని చెల్లించిందా లేదా అన్నది కస్టమర్లు బ్యాంకు సిబ్బందిని అడిగితే కానీ తెలియదు. ఆర్బీఐ నియంత్రణలు, పర్యవేక్షణ కింద ఉన్న అన్ని బ్యాంకులు డీఐసీజీసీ కింద తప్పనిసరిగా ఉండాలి. ఇదేమీ స్వచ్ఛందం కాదు. కనుక భరోసా ఎక్కువే. అయినా కానీ, ఈ విషయంలో రిస్క్ విషయమై ఆందోళనతో ఉండేవారు.. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిశీలించొచ్చు. వీటికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది కనుక అధిక రక్షణ ఉంటుందని భావించొచ్చు. అనంతరం ప్రైవేటు రంగంలో బలమైన బ్యాంకులు, పారదర్శకత కలిగిన, మంచి పేరున్న బ్యాంకులను డిపాజిట్లకు ఎంచుకోవడం వల్ల సంక్షోభాల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మన దేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. అధిక రాబడి కోసం వీటినీ పరిశీలించొచ్చు. కాకపోతే తమ దగ్గరున్న మొత్తాన్ని ఒక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోనే డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. కనుక డిపాజిట్లను ఒకటికి మించిన బ్యాంకుల్లో భిన్న మొత్తాలుగా డిపాజిట్ చేసుకోవాలి. ఆర్బీఐ లైసెన్స్ కలిగిన ఏ బ్యాంకు అయినా, పూర్తి నియంత్రణ, నిబంధనల చట్రంలోనే పనిచేస్తుంది కనుక.. విఫలమై డిపాజిటర్ల డబ్బులు పోయే పరిస్థితి రావడం అసాధ్యమనే భావించొచ్చు. జాయింట్ అకౌంట్లు సింగిల్ జాయింట్ అకౌంట్లు డీఐసీజీసీ కింద విడిగా కవరేజీ పొందుతాయి. అంటే కిరణ్ అనే వ్యక్తి తన పేరిట సేవింగ్స్ ఖాతా ఒకటి నిర్వహిస్తూ.. తన శ్రీమతి వాణితో మరో జాయింట్ అకౌంట్ కలిగి ఉన్నాడనుకుంటే.. బ్యాంకు సంక్షోభం పాలైతే అప్పుడు కిరణ్‌కు రెండు ఖాతాల నుంచి విడి విడిగా బీమా కవరేజీ లభిస్తుంది. అయితే, జాయింట్ అకౌంట్ల విషయంలో పన్ను బాధ్యత మొదటి అకౌంట్ హోల్డర్‌పైనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!
జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి. ఓ ఇన్వెస్టర్‌గా వాటిని దూరం పెట్టడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా కొనసాగేలా చూసుకోవచ్చు. ఎక్కువ పొదుపు, తక్కువ ఖర్చు, అనవసర రుణాలకు దూరంగా ఉండడం అన్నవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వ్యక్తిని ఆరి్థకంగా సౌకర్యంగా ఉంచుతాయి. ఆర్థికపరమైన విజ్ఞానం ఉన్నవారు సైతం కొన్ని తప్పిదాల వల్ల ఆరి్థకంగా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థికంగా దూరంగా ఉంచాల్సిన అలవాట్లపై అవగాహన కలి్పంచడమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి అలవాటే. కానీ, షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వీరిలో తగినంత పరిశోధన, అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేసే వారు చాలా చాలా తక్కువ. ఇటీవలి మార్కెట్ పతనం చాలా మంది చిన్న ఇన్వెస్టర్లను కుదిపేసిందనే చెప్పుకోవాలి. చాలా స్టాక్స్ ఇటీవలి బడ్జెట్ తర్వాత నూతన 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ ఏడాది క్రితం రూ.600పైన పలికింది. ప్రస్తుత ధర రూ.48.65. అంటే దాదాపు 92 శాతం మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ స్థాయి నష్టాలేమీ లేవు. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ కూడా క్షీణించడం సహజమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించడం వల్ల నష్టాలు పరిమితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ చెత్త పనితీరు చూపించిన పథకాలు కూడా... బీఎస్ఈ 100లోని ఎక్కువగా నష్టపోయిన షేర్ల కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, కొంత మేర మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఫండ్స్‌లో ఆయనకు సగటు రాబడులు 8 శాతంగా ఉంటే, స్టాక్స్‌లో ఆయన నష్టాలు భారీగా పేరుకుపోయాయి. 50 శాతంపైన నష్టాల పాలయ్యాడు. అందుకే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎంతో అవగాహన, అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరం. ఈ విషయాన్నే చాలా మంది ఇన్వెస్టర్లు విస్మరిస్తుంటారు. ఎంచుకునే కంపెనీల విషయంలో తాము సొంతంగా అధ్యయనం చేసి నిర్ధారించుకోలేని వారు, నిపుణుల సలహాలను పొందొచ్చు. లేదంటే మంచి ట్రాక్ రికార్డు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం నయం. అధ్యయనం లేకుండా ముందడుగు మన దేశంలో చిగురిస్తున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా ప్రారంభించిన ఐదేళ్లలోపే మూతపడుతున్నాయని ఐబీఎం నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. సావన్ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో ఓ వెంచర్‌ను ఆరంభించాడు. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. క్రమంగా దాన్ని విస్తరించాలన్నది ప్రణాళిక. కానీ న్యాయపరమైన, నియంత్రణపరమైన అవరోధాలతో 2014లోనే దాన్ని ఆపేయాల్సి వచి్చంది. అయితే, ఇది అతడి జీవన ప్రణాళికలపైనా పడింది. వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా, ఇంటి రుణం, పర్సనల్ లోన్, పిల్లల విద్య అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడుల ప్రణాళికలకు విఘాతం కలిగింది. తిరిగి మరలా ఉద్యోగంలో చేరేందుకు ఏడాది సమయం పట్టింది. తన సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉండొచ్చు. తానో ఎంట్రప్రెన్యూర్‌గా మారాలన్న అభిలాష ఉండొచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు సమగ్ర సన్నద్ధత అవసరం. ఇలా సొంత ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుగానే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. పన్ను ఆదా కోసం బీమా మన దేశంలో ఏటా కోట్లాది రూపాయలను అవసరం లేని బీమా ప్లాన్లపై వెచి్చస్తున్న విషయం తెలుసా..? బీమాలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు, జీవితానికి బీమా రక్షణ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను లేకపోవడం... ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ట్రిపుల్ బెనిఫిట్. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో పన్ను ఆదా ఒక్క ప్రయోజనం తప్పించి... నిజానికి సరిపడా బీమా రక్షణను అవి ఇవ్వలేవు. అంతేకాదు సరైన రాబడులను కూడా ఇవ్వవు. మీరు చెల్లించే ప్రీమియంలో సగ భాగం బీమా రక్షణ ఖర్చులకే పోతుంది. మిగిలిన పెట్టుబడులపై వచ్చే రాబడి చూసుకుంటే మొత్తంమీద రాబడి రేటు 5 శాతం దాటదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన యులిప్‌లు రాబడుల విషయంలో కొంచెం మెరుగైనవే. కానీ వీటిల్లో చార్జీలు, ఫీజులు, రాబడుల విషయంలో పారదర్శకత తక్కువ. బీమా పాలసీల్లో ప్రధానమైనది దురదృష్టవశాత్తూ మరణం చోటు చేసుకుంటే, ఆ కుటుంబ ఆర్థిక అవసరాను గట్టె క్కించేది అయి ఉండాలి. కానీ, సంప్రదాయ పాలసీల్లో ఇదే ఆఖరు ప్రాధాన్యంగా ఉంటుందన్న నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది చూస్తున్నది పన్ను ఆదానే. ఇదే పాలసీలను మార్కెట్ చేసే వారికి ఆయుధంగా మారుతోంది. 63 ఏళ్ల రాజారావు ఓ పెన్షనర్. మూడేళ్ల క్రితం ఆయనొక యులిప్ పాలసీ తీసుకున్నారు. రాజారావు పదవీ విరమణ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే, బ్యాంకు ఉద్యోగి ఆయనకు యులిప్ పాలసీ అంటగడ్డాడు. దీనివల్ల పన్ను ఆదా చేసుకోవచ్చన్న బ్యాంకు ఉద్యోగి మాటలను నమ్మి యులిప్ పాలసీని రాజారావు తీసుకున్నాడు. మూడేళ్లలో ఇందులో రూ.4.5 లక్షలు పెడితే, మూడేళ్ల తర్వాత ఆయన పెట్టుబడి విలువ రూ.4 లక్షలుగానే కనిపిస్తోంది. ఫండ్ విలువ కోలుకునే వరకూ వేచి చూడాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారంటూ రాజారావు పేర్కొన్నారు. నిజానికి సీనియర్ సిటిజన్ అయిన రాజారావుకు యులిప్ పాలసీ అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లింక్డ్ పాలసీ అది. దీనికి బదులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనుకూలం. వైవిధ్యం ఎక్కువైతే... పెట్టుబడులకు వైవిధ్యం అన్నది ప్రాణం అవుతుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ నూరు శాతం ఉంటుంది. కానీ, ఈ పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య డెవర్సిఫై చేయడం వల్ల రిస్‌్కను వేరు చేసినట్టు అవుతుంది. కానీ, వైవిధ్యం శ్రుతిమించకూడదు. ఆప్పుడే ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రిస్క్ తగ్గించుకోవాలని లెక్కకు మించిన చోట ఇన్వెస్ట్ చేయడం అనుకున్న ప్రయోజనాలను ఇవ్వదు. మోడల్ పోర్ట్‌ఫోలియో అంటే... వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ 15–20 మించకుండా చూసుకోవడం. ఇది రిస్‌్కను తగ్గిస్తుంది. ఈ వైవిధ్యం పెట్టుబడుల రిస్‌్కను ఎన్నో సెక్యూరిటీల మధ్య పంచుతుంది. అలా అని పదుల సంఖ్యలో చాంతాడంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఇంకా తగ్గుతుందని అనుకుంటే అది నిజం కాబోదు. ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కూ అమలవుతుంది. సెక్టార్ ఫండ్స్ (థీమ్యాటిక్) మినహా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌లో వైవిధ్యం అన్నది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు, భిన్న రంగాలకు చెందిన కంపెనీలను, అలాగే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలను పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటారు. కనుక తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక సంఖ్యలో పథకాలను ఎంచుకున్నారనుకోండి... ఆయా పథకాలు ఒకే తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గకపోగా, పెరుగుతుంది. నెలకు రూ.5,000–20,000 మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే మహా అయితే నాలుగు పథకాలు సరిపోతాయి. 40 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కోసం, 30 శాతం మల్టీక్యాప్ పథకాలకు, 20 శాతం మిడ్‌క్యాప్, 10 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పుణెకు చెందిన సౌమ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అది కూడా మంచి పనితీరు చూపించే పథకాల్లోనే. కానీ, ఒక ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం మరుసటి ఏడాది కూడా టాప్‌లోనే ఉండాలని లేదు కదా. దాంతో సౌమ్య పోర్ట్‌ఫోలియోలో పథకాల సంఖ్య 30కు చేరుకుంది. దీంతో కొన్నింటిని తగ్గించుకుందామనుకున్నా... వేటిని తీసేయాలన్న సందిగ్ధం ఆమెను వేధిస్తోంది. ఒకటి రెండు పథకాలను అదనంగా ఎంచుకున్నా ఫర్వాలేదు కానీ, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అయితే, షేర్ల మాదిరిగా ఫండ్స్ పథకాలు ఎక్కువైపోతే నష్టాలు వస్తాయనేమీ లేదు. ఎందుకుంటే ఫండ్స్ ఎప్పుడూ నిపుణుల నిర్వహణలోనే కొనసాగుతుంటాయి. కాకపోతే రాబడుల రేటే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాటిని పర్యవేక్షించడం కష్టమవుతుంది. అత్యవసరాలు... జీవనశైలి ఖర్చులన్నవి నేడు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఖర్చు చేసేందుకు ఎన్నో ఆకర్షణలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే జీవితానికి కనీస అవసరాలన్నవి గతంతో పోలిస్తే అధికమయ్యాయి. రిటైర్మెంట్ అవసరాల కోసం తాము చేస్తున్న పొదుపు, మదుపులను వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిగ్నా నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పడం గమనార్హం. 40 శాతం మంది తాము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. ముంబైకి చెందిన కీర్తి నెల ఆదాయంలో వ్రస్తాలు, ఆహారం, ప్రయాణ అవసరాలకే 75 శాతం ఖర్చవుతోంది. దీంతో ఆమె పొదుపు చేసేందుకు మిగులుతున్నది కొద్ది మొత్తంగానే ఉంటోంది. అంతేకాదు, తగినంత పొదుపు లేకపోవడం వల్ల ఆమె కంటి సర్జరీని వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. ఆలస్యంగా వాస్తవాన్ని గ్రహించిన కీర్తి, ప్రతి నెలా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. అంతేకాదు హెల్త్ ప్లాన్ తీసుకోవడం, అత్యవసరాల కోసం ఓ నిధిని సమకూర్చుకోవడం కూడా ఆమె ముందున్న అవసరాలు. చాలా మంది అత్యవసర నిధి అవసరాన్ని పట్టించుకోరు. అవసరం వచ్చినప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తుంటారు. కనుక ఆర్జించే ప్రతీ వ్యక్తి కూడా 6–8 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం రూ.5 లక్షలకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెరిగే అవసరాలకు అనుగుణంగా కవరేజీని టాపప్ ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు కుటుంబానికి ఆధారంగా ఉండేవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 10–15 రెట్ల మేర టర్మ్ బీమా ప్లాన్ కూడా తీసుకోవాలి. -
కంపెనీ అధికారులకూ బీమా రక్షణ
ఏదైనా కంపెనీని లాభాల బాటలో నడిపించే వ్యూహాలను రచించడంతో పాటు దానికి మంచి పేరు తెచ్చిపెట్టడంలోనూ సంస్థ డెరైక్టర్లు, అధికారుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఇంతటి కీలక బాధ్యతలను నిర్వర్తించే అధికారులు మంచి ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నా, ప్రకటనలు చేసినా కొన్నిసార్లు అవి వివాదాలకు దారితీసి, కోర్టులకెక్కే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆయా అధికారులంటే గిట్టనివారు ఉద్దేశపూర్వకంగానే వారిని అప్రతిష్ట పాల్జేసేందుకు దావాల్లాంటివీ వేయొచ్చు. పైగా కొత్త కంపెనీల చట్టంతో డెరైక్టర్లు, అధికారుల బాధ్యతలు మరింత పెరిగాయి. ఏదైతేనేం కంపెనీ మేలు కోరి చేసినవాటికి కూడా సొంతంగా న్యాయపోరాటాలు చేసుకోవాలంటే అది వారికి కచ్చితంగా తలకు మించిన భారమే అవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే వారిని ఆదుకునేందుకు డెరైక్టర్ అండ్ ఆఫీసర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ (డీఅండ్‌ఓ) అనే బీమా పథకం అందుబాటులో ఉంది. హోదాపరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తలెత్తే న్యాయవివాదాల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కి వ్యక్తిగతంగా ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. అధికారుల తరఫున కంపెనీ ఈ పాలసీలను తీసుకుంటుంది. వారిపై కేసుల వాదనకయ్యే ఖర్చులు, నష్టపరిహారమేదైనా చెల్లించాల్సి వస్తే దానికి కూడా ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. క్రిమినల్ కేసుల్లోనూ ఈ డీఅండ్‌ఓ పాలసీ ఉపయోగపడుతుంది. కానీ ఆయా అధికారులు నిర్దోషులుగా బైటపడితేనే ఇందుకు సంబంధించిన క్లెయిము మొత్తాన్ని కంపెనీకి బీమా సంస్థ.. చెల్లిస్తుంది. ఒకవేళ అధికారి అకస్మాత్తుగా మరణించిన పక్షంలో న్యాయవివాదం ప్రభావాలు వారి వారసులపై పడకుండా కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. సంస్థలో ప్రత్యక్షంగా పనిచేసే ప్రొఫెషనల్స్‌తో పాటు అనుబంధ కంపెనీల్లోని డెరైక్టర్లు, అధికారులు, నాన్ ఎగ్జిక్యూటివ్.. స్వతంత్ర డెరైక్టర్లకు కూడా కవరేజీ ఉంటుంది. పరిమితులూ ఉంటాయి.. డీఅండ్‌ఓ పాలసీలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయా డెరైక్టర్లు, అధికారులు మోసాలకు పాల్పడ్డారని రుజువైనా, నిజాయితీపరులు కాదని తేలినా కవరేజీ రక్షణ ఉండదు. అలాగే అప్పటికే పెండింగ్ లిటిగేషన్లు ఏవైనా ఉన్నా కూడా కవరేజీ ఉండదు. ఇక, కంపెనీపరమైనవి కాకుండా వ్యక్తిగత స్థాయిలో అధికారులపై విధించే పెనాల్టీలకు సైతం ఇది పనిచేయదు. 1930 లలో తొలిసారిగా తెరపైకి వచ్చిన ఈ తరహా పాలసీల మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. దేశీయంగాను గత పదేళ్లుగా వచ్చిన మార్పులతో డీఅండ్‌ఓ ఇన్సూరెన్స్ రూపాంతరం చెందింది. లిస్టెడ్ కంపెనీలతో పాటు కొంత మేర ఇతర కంపెనీలు సైతం తమ రిస్క్ మేనేజ్మెంట్ విధానాల్లో భాగంగా వీటిని తీసుకుంటున్నాయి. -
బీమా పాలసీలు ప్రత్యేకం..
కోటికి వైద్య బీమా సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రో హెల్త్’ పేరుతో కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీలోని ప్రత్యేకత. ప్రొటెక్ట్, ప్లస్, ప్రిఫర్డ్, ప్రీమియర్ పేరుతో ఈ పాలసీ నాలుగు రకాల ఆప్షన్లు అందిస్తోంది. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది. అదే 65 ఏళ్లు దాటిన వారికి కో-పేమెంట్ తప్పనిసరి. మ్యాక్స్ లైఫ్ శిక్షా సూపర్ ప్లస్ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ పిల్లల ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ‘శిక్షా ప్లస్ సూపర్’ పేరుతో యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల ఉన్నత చదువులకు అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఈ పథకం గ్యారంటీ లాయల్టీ అడిషన్‌తో పాటు అవసరమైతే 5 ఏళ్ల తర్వాత నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తల్లిదండ్రులకు ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ మొత్తం చెల్లించడంతోపాటు, పిల్లల భవిష్యత్తు ఫీజులను కూడా బీమా కంపెనీయే భరిస్తుంది. కొటక్ ‘జిఫి’ అకౌంట్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి’ పేరుతో సోషల్ నెట్వర్క్ బ్యాంక్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ అకౌంట్‌ను రూ.5,000తో ప్రారంభించొచ్చు. కనీస నిల్వ అవసరం లేదు. సేవింగ్స్ ఖాతాపై ఎటువంటి వడ్డీ ఉండదు. అకౌంట్లో ఉన్న నగదు రూ.25,000 దాటితే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారిపోతుంది.