కంపెనీ అధికారులకూ బీమా రక్షణ | insurance safety to company officers | Sakshi
Sakshi News home page

కంపెనీ అధికారులకూ బీమా రక్షణ

Published Sun, Nov 23 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

కంపెనీ అధికారులకూ బీమా రక్షణ

కంపెనీ అధికారులకూ బీమా రక్షణ

 ఏదైనా కంపెనీని లాభాల బాటలో నడిపించే వ్యూహాలను రచించడంతో పాటు దానికి మంచి పేరు తెచ్చిపెట్టడంలోనూ సంస్థ డెరైక్టర్లు, అధికారుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఇంతటి కీలక బాధ్యతలను నిర్వర్తించే అధికారులు మంచి ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నా, ప్రకటనలు చేసినా కొన్నిసార్లు అవి వివాదాలకు దారితీసి, కోర్టులకెక్కే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆయా అధికారులంటే గిట్టనివారు ఉద్దేశపూర్వకంగానే వారిని అప్రతిష్ట పాల్జేసేందుకు దావాల్లాంటివీ వేయొచ్చు.

పైగా కొత్త కంపెనీల చట్టంతో డెరైక్టర్లు, అధికారుల బాధ్యతలు మరింత పెరిగాయి. ఏదైతేనేం కంపెనీ మేలు కోరి చేసినవాటికి కూడా సొంతంగా న్యాయపోరాటాలు చేసుకోవాలంటే అది వారికి కచ్చితంగా తలకు మించిన భారమే అవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే వారిని ఆదుకునేందుకు డెరైక్టర్ అండ్ ఆఫీసర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ (డీఅండ్‌ఓ) అనే బీమా పథకం అందుబాటులో ఉంది.

 హోదాపరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తలెత్తే న్యాయవివాదాల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కి వ్యక్తిగతంగా ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. అధికారుల తరఫున కంపెనీ ఈ పాలసీలను తీసుకుంటుంది. వారిపై కేసుల వాదనకయ్యే ఖర్చులు, నష్టపరిహారమేదైనా చెల్లించాల్సి వస్తే దానికి కూడా ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది.

 క్రిమినల్ కేసుల్లోనూ ఈ డీఅండ్‌ఓ పాలసీ ఉపయోగపడుతుంది. కానీ ఆయా అధికారులు నిర్దోషులుగా బైటపడితేనే  ఇందుకు సంబంధించిన క్లెయిము మొత్తాన్ని కంపెనీకి బీమా సంస్థ.. చెల్లిస్తుంది.  ఒకవేళ అధికారి అకస్మాత్తుగా మరణించిన పక్షంలో న్యాయవివాదం ప్రభావాలు వారి వారసులపై పడకుండా కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. సంస్థలో ప్రత్యక్షంగా పనిచేసే ప్రొఫెషనల్స్‌తో పాటు అనుబంధ కంపెనీల్లోని డెరైక్టర్లు, అధికారులు, నాన్ ఎగ్జిక్యూటివ్.. స్వతంత్ర డెరైక్టర్లకు కూడా కవరేజీ ఉంటుంది.

 పరిమితులూ ఉంటాయి..
 డీఅండ్‌ఓ పాలసీలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయా డెరైక్టర్లు, అధికారులు మోసాలకు పాల్పడ్డారని రుజువైనా, నిజాయితీపరులు కాదని తేలినా కవరేజీ రక్షణ ఉండదు. అలాగే అప్పటికే పెండింగ్ లిటిగేషన్లు ఏవైనా ఉన్నా కూడా కవరేజీ ఉండదు. ఇక, కంపెనీపరమైనవి కాకుండా వ్యక్తిగత స్థాయిలో అధికారులపై విధించే పెనాల్టీలకు సైతం ఇది పనిచేయదు.

1930 లలో తొలిసారిగా తెరపైకి వచ్చిన ఈ తరహా పాలసీల మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. దేశీయంగాను గత పదేళ్లుగా వచ్చిన మార్పులతో డీఅండ్‌ఓ ఇన్సూరెన్స్ రూపాంతరం చెందింది. లిస్టెడ్ కంపెనీలతో పాటు కొంత మేర ఇతర కంపెనీలు సైతం తమ రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాల్లో భాగంగా వీటిని తీసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement