బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల పట్ల ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. ఎందుకంటే భద్రత ఎక్కువ. లిక్విడిటీ కూడా ఎక్కువే. అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుని సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకు పెద్దగా విషయ పరిజ్ఞానం, టెక్నాలజీ తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా దాదాపుగా ఇంతే. ఈ సంప్రదాయ పెట్టుబడి సాధనాలు ఇప్పటికీ ఎంతో మంది ఆదరణకు నోచుకోవడానికి ఇవే కారణాలు. అయితే, ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు సంక్షోభాల పాలైనట్టు వార్తలు వినే ఉంటారు. దీంతో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల భద్రతపై భయాలు కలగొచ్చు. కానీ, బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా రక్షణ ఉంటుందన్న విషయం తెలిసిన వారు కొద్ది మందే. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్‌బీఐ కల్పిస్తున్న డిపాజిట్ బీమా రక్షణ గురించి.. డిపాజిట్లపై రక్షణను పెంచుకునే మార్గాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం రండి..
∙
ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది చూసేది వడ్డీ రేటు. ఆ తర్వాత తమ డిపాజిట్‌కు రక్షణ ఎంత మేరకు అని. ఇవి కాకుండా డిపాజిట్లపై పన్ను భారం గురించి ఆలోచించే వారూ ఉంటారు. బ్యాంకులు దుకాణాన్ని రాత్రికి రాత్రి ఎత్తేయవులేనన్న నమ్మకమే అందరిలోనూ కనిపిస్తుంది. ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్‌లో ఓ ముఖ్య ప్రకటన చేశారు. బ్యాంకు ఒకవేళ విఫలం చెందితే, లేదా ఆ బ్యాంకు నుంచి డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు విధించినట్టయితే.. కస్టమర్లు డీఐసీజీసీ కింద రూ.5లక్షలను వెంటనే పొందొచ్చంటూ ఆమె ప్రకటించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లనే నమ్ముకున్న వారికి ఇది మరింత ఆనందం కలిగించే వార్తే అవుతుంది.
పెట్టుబడికి భద్రత ఎంత..?
పెట్టుబడికి, రాబడులకు ఉన్న భరోసానే బ్యాంకు డిపాజిట్ల వైపు మొగ్గు చూపించేలా చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో డిపాజిటర్ల డబ్బులు చెల్లించకుండా బ్యాంకులు చేతులెత్తేసిన ఘటనలు దాదాపుగా లేవు. ఆర్‌బీఐ పటిష్ట నియంత్రణల కింద పనిచేస్తుంటాయి కనుక బ్యాంకులు అరుదుగానే వైఫల్య స్థితికి చేరుతుంటాయి. బ్యాంకులపై నిరంతరం పర్యవేక్షణతోపాటు.. అదనంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూపంలో డిపాజిటర్ల డబ్బులకు ఆర్‌బీఐ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. డీఐసీజీసీ అన్నది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ. ఒక్క కస్టమర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్లకు బీమా రక్షణ ఉంటుంది. ఒక్కో కస్టమర్ తరఫున బీమా రక్షణ కోసం అయ్యే ప్రీమియాన్ని బ్యాంకులే చెల్లిస్తాయి తప్పితే కస్టమర్ల నుంచి తీసుకోవు. మొట్టమొదటిగా 1962లో డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో గరిష్టంగా రూ.1,500 డిపాజిట్‌కు ఇన్సూరెన్స్ ఉండేది. తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చి రూ.5 లక్షలకు చేరింది.
డిపాజిట్ ఇన్సూరెన్స్ పెరిగిన తీరు
రూ.5లక్షల బీమా అన్నది.. కరెంటు ఖాతా, సేవింగ్స్‌ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇలా ఏ రూపాల్లో ఉన్నా కానీ.. అసలు, వడ్డీ కలుపుకుని గరిష్టంగా రూ.5లక్షలకే బీమా కవరేజీ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక బ్యాంకు పరిధిలో భిన్న శాఖల్లో డిపాజిట్లు ఉన్నప్పటికీ అన్నింటికీ కలిపి ఇది అమలవుతుంది. అంటే ఒక కస్టమర్‌కు ఒక బ్యాంకు పరిధిలోనే రూ.5లక్షల పరిమితి అమలవుతుంది. ఇంతకు మించి ఎంత మొత్తం ఉన్నాకానీ, ఒకవేళ బ్యాంకు మునిగిపోతే రూ.5లక్షల వరకే తిరిగి డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కాకపోతే డిపాజిట్ చేస్తున్న బ్యాంకు ‘డీఐసీజీసీ’ కిందకు వస్తుందా? రాదా? అన్నది ముందే విచారించుకోవాలని పైసా బజార్ డాట్ కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా సూచించారు.
డీఐసీజీసీ పరిధిలో ఉన్నవి..
కమర్షియల్ బ్యాంకులు: అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకుల శాఖలు, లోకల్ ఏరియా బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు
కోపరేటివ్ బ్యాంకులు: అన్ని రాష్ట్రాల, కేంద్ర, ప్రైమరీ కోపరేటివ్ బ్యాంకులు.. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు. అన్ని కోపరేటివ్ బ్యాంకులు.
వీటికి బీమా రక్షణ
సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు
వీటికి లేదు రక్షణ
విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్రాల డిపాజిట్లు, ఇంటర్ బ్యాంకు డిపాజిట్లు, స్టేట్ కోపరేటివ్ బ్యాంకుల వద్దనున్న స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంకుల డిపాజిట్లు
తక్షణమే రూ. 5లక్షలు
బ్యాంకు సంక్షోభంలో చిక్కుకుంటే డిపాజిటర్లు డీఐసీజీసీ కింద వెంటనే రూ.5 లక్షల వరకు పొందే విధంగా తాము ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సవరణలను తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిపాజిటర్లు తమ తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇటీవలి కాలంలో పీఎమ్‌సీ బ్యాంకు, యస్ బ్యాంకు డిపాజిటర్లకు చేదు అనుభవాలు ఎదురైన విషయం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు) డిపాజిటర్లు అయితే తమ డిపాజిట్లను పొందలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాకపోతే యస్ బ్యాంకు యాజమాన్యంలో తక్షణమే మార్పులు చేసి, కొత్త ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి దాన్ని పట్టాలెక్కేలా చేయడంతో కస్టమర్లకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ పరిణామాల అనుభవం తో ఆర్థిక మంత్రి ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు అర్థం అవుతోంది. నిజానికి ఇప్పటి వరకు బ్యాంకు సంక్షోభం పాలైతే డీఐసీజీసీ కింద బీమా పరిహారం వెంటనే వచ్చే అవకాశం లేదు. బ్యాంకుకు సంబంధించి తుది పరిష్కారం లభించే వరకు.. అంటే అది నెలలు, సంవత్సరాలు అయినా వేచి చూడాల్సిందే. మంత్రి పేర్కొన్నట్టు సవరణల తర్వాత బ్యాంకుల్లో ఎఫ్‌డీల విషయమై డిపాజిటర్లకు మరింత వెసులుబాటు లభించినట్టే అవుతుంది.
మరింత కవరేజీ కోసం..
డీఐసీజీసీ కింద గరిష్ట బీమా రూ.5 లక్షలు అన్నది ఒక కస్టమర్‌కు ఒక బ్యాంకుకే పరిమితం. ఒక బ్యాంకుకు చెందిన భిన్న శాఖల్లో డిపాజిట్లు ఉన్నప్పటికీ ఇదే అమలవుతుంది. కనుక ఒక డిపాజిటర్ ఒక్కో బ్యాంకులో రూ.5లక్షల చొప్పున ఒకటికి మించిన బ్యాంకుల్లో డిపాజిట్లు కలిగి ఉంటే, అప్పుడు విడిగా ప్రతీ బ్యాంకు పరిధిలో రూ.5 లక్షలను పొందేందుకు అర్హులు అవుతారు. కనుక ఎక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేయాలనుకునే వారు తమ పేరిట ఒకే బ్యాంకులో కాకుండా ఒకటికి మించిన బ్యాంకుల్లో లేదా కుటుంబ సభ్యుల పేరిట కొంత మొత్తాలను వేరు చేసి డిపాజిట్ చేసుకోవడం ద్వారా బీమా రక్షణ పెంచుకోవచ్చు. ఒకే వ్యక్తి ఒక బ్యాంకులోనే డిపాజిట్ చేసుకునేట్టు అయితే, కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురి పేరిట డిపాజిట్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అసలు, వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలే పరిమితి కనుక డిపాజిట్‌ను రూ.4 లక్షలకు పరిమితం చేసుకోవడం మంచి ఐడియా అవుతుంది. ఇందులో ఉన్న మరో అనుకూల అంశం.. బ్యాంకుల మధ్య వడ్డీ రే ట్లు మారుతుంటాయి. కనుక ఒకటికి మించిన బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం వల్ల సగటు వడ్డీ రేటు కాస్త అధికంగా పొందవచ్చు.
ఇవి వేరు..
ఈ కేసుల్లో డిపాజిట్లు కలిగి ఉండడాన్ని వ్యక్తిగతం కా కుండా భిన్నమైన హక్కుల కింద చట్టం పరిగణిస్తోంది.
► ఓ సంస్థ భాగస్వామి హోదాలో
► డిపాజిట్ కలిగి ఉండడం
► గార్డియన్‌గా డిపాజిట్ కలిగి ఉండడం
► కంపెనీ డైరెక్టర్ హోదాలో డిపాజిట్ ఉండడం
► ట్రస్టీగా డిపాజిట్ కలిగి ఉంటే బీమా రక్షణ వేర్వేరుగా అమలవుతుంది. అంటే ‘ఎక్స్’ అనే వ్యక్తి వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా పొందడమే కాదు.. ఇక్కడ పేర్కొన్న మిగిలిన కేసుల్లోనూ ఎక్స్ డిపాజిట్లు కలిగి ఉంటే విడిగా ఒక్కో కేసులో రూ.5 లక్షల చొప్పున బీమాకు అర్హులు అవుతారు.
ఎవరు చెల్లిస్తారు..?
ప్రస్తుతమున్న విధానంలో బ్యాంకు లిక్విడేషన్‌కు వెళితే అప్పుడు లిక్విడేటర్‌కు డీఐసీజీసీ బీమా చెల్లింపులు చేస్తుంది. లిక్విడేటర్ నుంచి క్లెయిమ్ రసీదు అందుకున్న రెండు నెలల్లోగా చెల్లింపులు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అప్పుడు ప్రతీ డిపాజిటర్‌కు చట్టబద్ధంగా డిపాజిట్ చెల్లింపులను లిక్విడేటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు విలీనానికి వెళితే, విలీనం చేసుకున్న బ్యాం కు నుంచి క్లెయిమ్ రసీదు అందుకున్న రెండు నెలల్లోగా డీఐసీజీసీ ఈ చెల్లింపులు చేస్తుంది. అప్పుడు విలీనం చేసుకున్న బ్యాంకు డిపాజిటర్ల వారీగా చె ల్లింపులు పూర్తి చేస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ డీఐసీజీసీ నేరుగా డిపాజిటర్లకు చెల్లింపులు చేయదు.
జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే
బ్యాంకులు స్వీకరించే ప్రతీ డిపాజిట్‌కు సంబంధించి ప్రీమియాన్ని డీఐసీజీసీకి చెల్లించాలి. అప్పుడే డిపాజిటర్‌కు బీమా రక్షణ లభిస్తుంది. మరి బ్యాంకు సకాలంలో ఈ ప్రీమియాన్ని చెల్లించిందా లేదా అన్నది కస్టమర్లు బ్యాంకు సిబ్బందిని అడిగితే కానీ తెలియదు. ఆర్‌బీఐ నియంత్రణలు, పర్యవేక్షణ కింద ఉన్న అన్ని బ్యాంకులు డీఐసీజీసీ కింద తప్పనిసరిగా ఉండాలి. ఇదేమీ స్వచ్ఛందం కాదు. కనుక భరోసా ఎక్కువే. అయినా కానీ, ఈ విషయంలో రిస్క్ విషయమై ఆందోళనతో ఉండేవారు.. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిశీలించొచ్చు. వీటికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది కనుక అధిక రక్షణ ఉంటుందని భావించొచ్చు.
అనంతరం ప్రైవేటు రంగంలో బలమైన బ్యాంకులు, పారదర్శకత కలిగిన, మంచి పేరున్న బ్యాంకులను డిపాజిట్లకు ఎంచుకోవడం వల్ల సంక్షోభాల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మన దేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. అధిక రాబడి కోసం వీటినీ పరిశీలించొచ్చు. కాకపోతే తమ దగ్గరున్న మొత్తాన్ని ఒక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోనే డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. కనుక డిపాజిట్లను ఒకటికి మించిన బ్యాంకుల్లో భిన్న మొత్తాలుగా డిపాజిట్ చేసుకోవాలి. ఆర్‌బీఐ లైసెన్స్ కలిగిన ఏ బ్యాంకు అయినా, పూర్తి నియంత్రణ, నిబంధనల చట్రంలోనే పనిచేస్తుంది కనుక.. విఫలమై డిపాజిటర్ల డబ్బులు పోయే పరిస్థితి రావడం అసాధ్యమనే భావించొచ్చు.
జాయింట్ అకౌంట్లు
సింగిల్ జాయింట్ అకౌంట్లు డీఐసీజీసీ కింద విడిగా కవరేజీ పొందుతాయి. అంటే కిరణ్ అనే వ్యక్తి తన పేరిట సేవింగ్స్ ఖాతా ఒకటి నిర్వహిస్తూ.. తన శ్రీమతి వాణితో మరో జాయింట్ అకౌంట్ కలిగి ఉన్నాడనుకుంటే.. బ్యాంకు సంక్షోభం పాలైతే అప్పుడు కిరణ్‌కు రెండు ఖాతాల నుంచి విడి విడిగా బీమా కవరేజీ లభిస్తుంది. అయితే, జాయింట్ అకౌంట్‌ల విషయంలో పన్ను బాధ్యత మొదటి అకౌంట్ హోల్డర్‌పైనే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment