
ముంబై: మొండిపద్దుల నుంచి బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకునేందుకు వీలు కల్పించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతలు, మోసపూరిత ఖాతాల విషయంలో రాజీ కుదుర్చుకుని, మొండిబాకీలను సెటిల్ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాజీ సెటిల్మెంట్లను చేపట్టే క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతలు, సాంకేతిక రైటాఫ్‌ల అంశాల్లో పాటించాల్సిన ప్రక్రియలకు సంబంధించి బోర్డు ఆమోదిత పాలసీలను నియంత్రిత సంస్థలన్నీ (ఆర్‌ఈ) అమలు చేయాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో రాజీ యత్నాలు చేయవచ్చనేది వాటిలో నిర్దిష్టంగా పేర్కొనాలి. కనీస బాకీ వ్యవధి, తనఖా పెట్టిన ఆస్తుల విలువ కరిగిపోవడం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.
నోటిఫికేషన్ అంశాలు..
► ఇలాంటి కేసుల్లో ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పర్యవేక్షించేందుకు తగు వ్యవస్థ ఉండాలి. బాకీ పరిమాణం, కాలపరిమితులు మొదలైనవి బోర్డు నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరిత ఖాతాలంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో, రుణదాతలపై క్రిమినల్ చర్యలతో సంబంధం లేకుండా, ఆర్‌ఈలు రాజీ సెటిల్మెంట్ చేసుకోవచ్చు.
► రాజీ సెటిల్మెంట్ విషయంలో తనఖా ఉంచిన ఆస్తి (ఏదైనా ఉంటే) నుంచి ప్రస్తుతం రాబట్టుకోగలిగే మొత్తాన్ని సముచిత రీతిలో మదింపు చేసి, ఎంత మొత్తం వదులుకోవచ్చు, ఎంతకు సెటిల్ చేసుకోవచ్చు అనే నిబంధనలను పాలసీలో పొందుప ర్చాలి. తనఖా పెట్టిన వాటి నుంచి రాబట్టుకోగలికే విలువను లెక్కించే విధానాన్ని కూడా నిర్దేశించాలి.
► ఆర్‌ఈకి ప్రయోజనం చేకూర్చేలా మొండిబాకీల నుంచి తక్కువ ఖర్చులో, అత్యధికంగా రాబట్టాల నేది లక్ష్యంగా ఉండాలి.రాజీ సెటిల్మెంట్ చేసుకున్న రుణగ్రహీతలకు ఆర్‌ఈలు నిర్దిష్ట వ్యవధి తర్వాతే మళ్లీ కొత్తగా రుణాలివ్వడానికి వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment