10.16 lakh crore of bad loans recovered in 9 years: Ministry - Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రికవరీ

Published Fri, Jul 28 2023 6:30 AM | Last Updated on Fri, Jul 28 2023 1:39 PM

10. 16 lakh crore of bad loans recovered in 9 years - Sakshi

న్యూఢిల్లీ: మొండి బకాయిలను (ఎన్‌పీఏ) తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత తొమ్మిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయి. ఆర్‌బీఐ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు..

► గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు (ఎస్‌సీబీలు)రూ.10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి.
► రుణగ్రహీతల  డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన  సెంట్రల్‌ రిపోజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్‌ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి  రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు.
► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్‌ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి.  
► షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్‌పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి.  
► 2018–19 చివరి నాటికి మొండి బకాయిలు రూ.7,09,907 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ విలువ రూ.6,32,619 కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి ఈ విలువ మరింతగా రూ.2,66,491 కోట్లకు తగింది.
► 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎన్‌పీఏల విలువ రూ.10,36,187 కోట్లు. మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 11.18 శాతం. 2023 నాటికి విలువ రూ.5,71,515 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి 3.87 శాతం.  

కీలక చర్యల ఫలితం...
రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రస్ట్‌ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది.  డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ (డీఆర్‌టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు  కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడినట్లు ఇటీవలి ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ ఖరాద్‌ లోక్‌సభకు తెలిపారు.

రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో  నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్‌ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. 

వారి యూనిట్‌ ఐదేళ్లపాటు కొత్త వెంచర్‌లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్‌ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.  వాటి ప్రమోటర్లు/డైరెక్టర్‌లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్‌బీఐ ప్రుడెన్షియల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ స్ట్రెస్డ్‌ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్‌ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement