న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్‌బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్‌ను చేరుకుంటాయని అంచనా.
బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్‌పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్‌బీలను ఆర్‌బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్‌బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్‌బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్‌లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి.
ఐదేళ్లలో భారీ నష్టాలు
పీఎస్‌బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి.
సంస్కరణల ఫలితం
ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్‌బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్‌లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్‌బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి.
రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్‌లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్‌బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్‌బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది.
ఇతర చర్యలు
మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్‌బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది.
గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్‌లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్‌ను సైతం ఆర్‌బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం
గట్టెక్కించింది.
టర్న్ అరౌండ్
ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్‌బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్‌లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్‌బీలు వాటాదారులకు డివిడెండ్‌లను సైతం పంపిణీ చేశాయి.
ఎస్‌బీఐ సహా తొమ్మిది పీఎస్‌బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్‌బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్‌బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్‌కుమార్ మెహతా సైతం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment