bad debts
-
FICCI-IBA Bankers survey: ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్పీఏలు ఉన్నాయి. ► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ► రాబోయే ఆరు నెలల్లో ఎన్పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి. ► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది. -
తొమ్మిదేళ్లలో ఖాతాల్లోంచి రూ.14.56 లక్షల కోట్ల రద్దు!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2014–15 నుంచి గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో భారీ పరిశ్రమలు, సేవల రంగం వాటా రూ. 7,40,968 కోట్లని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఒక లోక్‌సభలో ఇచి్చన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రైటాఫ్ అంటే ఖాతాలు, లెక్కల నుంచి మొండిబకాయిలను తొలగించడం. అయితే అటువంటి ఖాతాదారులపై చట్టబద్ధమైన, రికవరీకి సంబంధించిన చర్యలు కొనసాగుతాయి. ఆయా అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అందిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, కరాద్ లోక్‌సభలో చేసిన లిఖితపూర్వక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు.. ► 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర రైటాఫ్ రుణాలు రూ.73,803 కోట్లు. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో నికర రైటాఫ్‌లు 1.25 శాతం. 2022–23లో ఇది 1.57 శాతంగా ఉంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల విషయంలో ఈ అంకెలు వరుసగా 2 %, 1.12 శాతాలుగా ఉన్నాయి. ► మొండిబకాయిలు దిగిరావడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి 31వ తేదీ నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గింది. గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ. 10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. పటిష్ట రికవరీ చర్యలు... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడింది. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కరాద్ వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రో త్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. పీఎంఎంవై దేశ వ్యాప్త అమలు ఇదిలావుండగా, 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజనను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మరో సమాధానంలో మంత్రి కరాద్ పేర్కొన్నారు. 2023 జూన్ 30 నాటికి ఈ పథకం కింద రుణగ్రహీతలకు దాదాపు రూ. 24.34 లక్షల కోట్ల రుణాల మంజూరు జరిగినట్లు వివరించారు. -
తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండి బకాయిలను (ఎన్పీఏ) తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత తొమ్మిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయి. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ.10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. ► 2018–19 చివరి నాటికి మొండి బకాయిలు రూ.7,09,907 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ విలువ రూ.6,32,619 కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి ఈ విలువ మరింతగా రూ.2,66,491 కోట్లకు తగింది. ► 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎన్పీఏల విలువ రూ.10,36,187 కోట్లు. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏల నిష్పత్తి 11.18 శాతం. 2023 నాటికి విలువ రూ.5,71,515 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏ నిష్పత్తి 3.87 శాతం. కీలక చర్యల ఫలితం... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడినట్లు ఇటీవలి ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ ఖరాద్ లోక్‌సభకు తెలిపారు. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు/డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. -
డిజిటలైజేషన్, మొండిబకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులు డిజిటలైజేషన్‌పై దృష్టి సారించాలని అలాగే ఒత్తిడితో కూడిన రుణాలపై (మొండిబకాయిలకు దారితీసే అవకాశమున్న ఖాతాలు) నిఘా ఉంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, అన్ని వర్గాలను ఫైనాన్షియల్ చట్రంలోకి తీసుకురావడంపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్యాంకులు నిరర్థక ఆస్తులను సకాలంలో గుర్తించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మొండిబకాయిలకు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) చేయాలి. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయి దృష్టి సారింపు అవసరం. భవిష్యత్తు అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. -
ఎన్పీఏల తగ్గింపునకు ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు
న్యూఢిల్లీ: నిరర్థక రుణాలను (వసూలు కానివి/ఎన్పీఏలు) కట్టడి చేయడంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) తీసుకున్న చర్యలు, పని తీరును పార్లమెంటరీ ప్యానెల్ అభినందించింది. ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు ఎన్పీఏలను నియంత్రిస్తాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా తన సేవలను అందించడానికి వీలు పడుతుందని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది. ఐఐఎఫ్‌సీఎల్ అనేది మౌలిక రంగానికి రుణ వితరణ కోసం 2006 జనవరిలో కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఇటీవలే పార్లమెంట్‌కు సమర్పించింది. ఐఐఎఫ్‌సీఎల్ తీసుకున్న చర్యలు దీర్ఘకాలంలో సంస్థ బలోపేతానికి సాయపడతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎన్పీఏల పరిష్కారానికి బోర్డు ఆమోదిత మేనేజ్మెంట్ పాలసీని అమల్లో పెట్టడాన్ని ప్రస్తావించింది. -
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభాల పంట
న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్‌బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్‌ను చేరుకుంటాయని అంచనా. బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్‌బీలను ఆర్బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్‌బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్‌లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి. ఐదేళ్లలో భారీ నష్టాలు పీఎస్‌బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి. సంస్కరణల ఫలితం ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్‌లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్‌బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్‌లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్‌బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్‌బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది. ఇతర చర్యలు మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్‌బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది. గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్‌లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్‌ను సైతం ఆర్బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం గట్టెక్కించింది. టర్న్ అరౌండ్ ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్‌బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్‌లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్‌బీలు వాటాదారులకు డివిడెండ్లను సైతం పంపిణీ చేశాయి. ఎస్బీఐ సహా తొమ్మిది పీఎస్‌బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్‌బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్‌బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్‌కుమార్ మెహతా సైతం చెప్పారు. -
దివాలా ప్రక్రియతో రూ. 2.43 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: ఎన్సీఎల్టీ పర్యవేక్షణలో దివాలా పరిష్కార ప్రక్రియల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బాకీలను గణనీయంగా రికవరీ చేసుకోగలుగుతున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి రూ. 2.43 లక్షల కోట్లు రాబట్టుకోగలిగాయి. నిర్దిష్ట తేదీ నాటికి సంక్షోభంలో కూరుకున్న కంపెనీల నుండి మొత్తం రూ. 7.91 లక్షల కోట్లు బ్యాంకులకు రావాల్సి ఉంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తమ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం కొనసాగుతున్న సీఐఆర్పీల్లో (కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ) 64 శాతం కేసుల పరిశీలనకు 270 రోజుల పైగా జాప్యం జరుగుతోందని తెలిపింది. సీఐఆర్పీలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటం సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దివాలా కోడ్ (ఐబీసీ) ప్రకారం పిటిషన్ స్వీకరించిన తేదీ నుండి 180 రోజుల్లోగా సీఐఆర్‌పీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార నిపుణుడి (ఆర్పీ) అభ్యర్థన మేరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీన్ని మరో 90 రోజుల వరకూ పొడిగించవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ 330 రోజుల్లోగా ముగియాలి. లిటిగేషన్లు, ఎన్సీఎల్టీ బెంచీల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు, కోవిడ్‌పరమైన అవాంతరాలు మొదలైనవి పరిష్కార ప్రక్రియల జాప్యానికి కారణమవుతున్నాయి. -
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే...
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే మాఫీ చేస్తారట మావా! -
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆర్బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్ఫ్రా ఇంజినీరింగ్ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. 46% తగ్గిన ఎయిడ్స్ 2021 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 24.01 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు కేంద్రం రాజ్యసభకు తెలిపింది. వీరిలో 45% మంది అంటే 10.83 లక్షల మంది మహిళలు కాగా 2% మంది 12 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 51 వేల మంది ఉన్నట్లు పేర్కొంది. అయితే, అత్యధికంగా మహారాష్ట్రలో 3.94 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షల కేసులుండగా తెలంగాణలో 1.56 లక్షల కేసులు నమోదైనట్లు వివరించింది. మొత్తమ్మీద చూస్తే 2010 నుంచి ఎయిడ్స్ కేసుల్లో తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 32%, దేశంలో 46% నమోదైందని తెలిపింది. -
ఇక ముద్రా ‘మొండి’ భారం..!
ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ‘ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం నుంచి బైటపడి ఉండవచ్చు. అయితే, ఈ రుణాల్లో మొండిబాకీలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించేదిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే రుణాలు తీసుకోబోయే వారి చెల్లింపు సామర్ధ్యాలను బ్యాంకులు మరింత మెరుగ్గా మదింపు చేయాలి. సదరు ఖాతాలను చివరిదాకా పరిశీలిస్తూనే ఉండాలి‘ అని సూక్ష్మ రుణాలపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంత సులువుగా అప్పు దొరకని చిన్న వ్యాపార సంస్థలకు .. రుణ లభ్యత పెరిగేలా చూసేందుకు 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముద్రా స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, స్కీమ్ ప్రారంభించిన ఏడాదిలోనే .. ముద్రా రుణాల్లో మొండి బాకీల సమస్య గురించి అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని తోసిపుచ్చారు. ఈ ఏడాది జూలై నాటి గణాంకాల ప్రకారం ముద్రా స్కీమ్ కింద ఇచ్చిన రుణాలు రూ. 3.21 లక్షల కోట్లకు చే రాయి. ఇందులో మొండి బాకీలు 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో 2.52 శాతం నుంచి 2.68 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది జూన్ దాకా మొత్తం 19 కోట్ల రుణాలు మంజూరు కాగా .. సుమారు 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు సమాచార హక్కు చట్టం కింద బైటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,277 కోట్లుగా ఉన్న మొండి బాకీలు ఏకంగా 126 శాతం ఎగిసి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,481 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎకానమీపై జీఎస్టీ దెబ్బ.. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని జైన్ చెప్పారు. డిజిటల్ సాంకేతికత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి.. చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఎంఎస్ఎంఈలకు రుణాలపై అధిక వడ్డీ భారం తప్పుతుందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు.. ప్రధానంగా డిజిటల్ ఫైనాన్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని.. అదే సమయంలో డేటా భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
విజయ బ్యాంక్ లాభం 43% డౌన్
న్యూఢిల్లీ: మొండిబాకీల పరిస్థితి మెరుగుపడినప్పటికీ... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్ నికర లాభం 43 శాతం మేర క్షీణించింది. క్యూ1లో రూ.144.34 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ1లో ఇది రూ.254.69 కోట్లు. తాజాగా తొలి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 3,510 కోట్ల నుంచి రూ. 3,936 కోట్లకు పెరిగింది. మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ ఏకంగా రూ. 423 కోట్ల నుంచి రూ. 659 కోట్లకు పెరిగింది. ఇందులో నికార్సుగా ఎన్పీఏల కోసం కేటాయించినది రూ.548 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వీటికి ప్రొవిజనింగ్ రూ.411 కోట్లు. మరోవైపు, జూన్ త్రైమాసికంలో స్థూల మొండిబాకీలు 7.3 శాతం నుంచి 6.19 శాతానికి, నికర ఎన్పీఏలు 5.24 శాతం నుంచి 4.10 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో విజయా బ్యాంకు షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 52.15 వద్ద ముగిసింది. -
ఇక ఎల్ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు!
న్యూఢిల్లీ: మొండిబాకీల భారంతో కుంగుతున్న ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను (51 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సీ గర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 7– 7.5 శాతం మేర వాటాలున్నాయని, మెజారిటీ హోల్డింగ్ కోసం మరిన్ని వాటాలను కొనుగోలు చేయనుందని ఆయన తెలియజేశారు. ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఐడీబీఐ బ్యాంకు ఈ నిధులు సమకూర్చుకోవచ్చని గర్గ్ వివరించారు. ఎల్ఐసీ బోర్డులో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. ‘ప్రభుత్వం నుంచి నేరుగా వాటాలు కొనుగోలు చేయడం ఒక మార్గమైతే... ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకు ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించడం మరో మార్గం. అయితే మొదటి దాని వల్ల ఐడీబీఐ బ్యాంకుకు నేరుగా మూలధనం లభించదు. ప్రస్తుతం బ్యాంకుకు మరింత మూలధనం కావాలి. కాబట్టి.. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ రూపంలోనే డీల్ ఉండే అవకాశం ఉంది‘ అని గర్గ్ వ్యాఖ్యానించారు. సెబీ అనుమతులు తీసుకోనున్న ఎల్ఐసీ.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ వాటాలు పెంచుకునే ప్రతిపాదనకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, ఐడీబీఐ బ్యాంకు లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా ఎల్ఐసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు వాటాల విక్రయానికి ఐడీబీఐ బ్యాంకు కూడా తమ సంస్థ బోర్డు నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్యాంకులో పబ్లిక్ వాటాలు తక్కువే ఉండటం వల్ల ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చని గర్గ్ పేర్కొన్నారు. అయితే, సందర్భాన్ని బట్టి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందన్నారు. రూ. 13,000 కోట్ల డీల్? వాటాల విక్రయంతో ఐడీబీఐ బ్యాంకుకు ఎంత మేర నిధులు లభించవచ్చన్నది గర్గ్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ కుదిరితే సుమారు రూ. 10,000– 13,000 కోట్ల మేర లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పుడు ఐడీబీఐ బ్యాంక్ బోర్డులో కనీసం నలుగురు సభ్యులను నామినేట్ చేసేందుకు ఎల్ఐసీకి అవకాశం దక్కుతుంది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి కూడా ప్రవేశించినట్లవుతుంది. బ్యాంకుకు చెందిన 2,000 పై చిలుకు శాఖల్లో ఎల్ఐసీ తమ పథకాలను విక్రయించుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే, ఎల్ఐసీ దగ్గర భారీగా ఉన్న నిధులు ఐడీబీఐ బ్యాంకుకు అందివస్తాయి. 22 కోట్ల పైచిలుకు పాలసీ హోల్డర్ల అకౌంట్లు కూడా ఈ బ్యాంకుకు దక్కవచ్చు. ప్రస్తుతం రూ.55,600 కోట్ల పైచిలుకు మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకుకు ఈ డీల్ బూస్ట్‌లా పనిచేస్తుంది. రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ బోర్డు భేటీ వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై చర్చించేందుకు ఒకటి, రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలోగా అనుమతినివ్వొచ్చని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సంస్థలు.. ఇటు సెబీ, అటు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతులు కోరనున్నాయి. -
విద్యా రుణం.. పెరిగిన పరిమాణం
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. చదువుల వ్యయాలు భారీగా పెరుగుతున్నాయనడానికి సూచనగా రుణ పరిమాణం పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్ రూపొందించిన నివేదిక ప్రకారం గత సంవత్సరంలో విద్యా రుణం పరిమాణం సగటున రూ. 6.8 లక్షలే ఉండగా.. ఈసారి ఏకంగా రూ. 9.6 లక్షలకు చేరింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రుణ వితరణ 9.25 శాతం పెరిగి విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ. 82,600 కోట్లకు చేరింది. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం 7 శాతం తగ్గి 2.5 లక్షలకు పరిమితమైంది. ఉన్నత విద్యా వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎడ్యుకేషనల్ లోన్ పరిమాణం కూడా పెరుగుతోందని సీఆర్ఐఎఫ్ హైమార్క్ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. గతంతో పోలిస్తే మరింత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెడుతుండటం, ఐఐఎంలు..ఐఎస్బీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో గత కొన్నాళ్లుగా ఫీజులు భారీగా పెరగడం మొదలైన అంశాలు ఇందుకు కారణమని వివరించాయి. రూ. 20 లక్షల పైబడిన విద్యా రుణాల విభాగం గడిచిన అయిదేళ్లలో ఏకంగా ఆరు రెట్లు పెరిగిందని పేర్కొన్నాయి. రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందంజ.. విద్యా రుణాల విభాగంలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఉంటోంది. గతేడాది నమోదైన 90 శాతంతో పోలిస్తే కొంత తగ్గి 83 శాతానికి చేరినా మార్కెట్వాటాపరంగా పీఎస్‌బీలే ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి దాదాపు 30 శాతం మార్కెట్ వాటా ఉంది. విద్యారుణాల పరిమాణం, మంజూరు గణనీయంగానే పెరుగుతోందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. అయితే, లోన్ పరిమాణం పెరుగుతున్నప్పటికీ, అయిదారేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే రుణాల సంఖ్య మాత్రం తగ్గుతోందని పేర్కొన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయన్న అంచనాలతో గతంలో చాలా మంది విద్యార్థులు ఐటీని ఎంచుకునేవారని, ప్రస్తుతం క్రమంగా ప్యూర్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాలవైపు మళ్లుతున్నారని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. విద్యా రుణాల వితరణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాల్లో 95 శాతం పైనే సాధిస్తోంది. రుణ మంజూరులో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) చాలా కీలకంగా ఉంటోందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ స్కీము కింద రూ. 7.5 లక్షల దాకా రుణాల్లో 75 శాతం దాకా హామీ లభిస్తుంది. అయితే, ఇది 2015 సెప్టెంబర్ నుంచే అమల్లోకి వచ్చింది. దీనికింద తీసుకున్న రుణాల చెల్లింపు ప్రక్రియ ఇంకాపూర్తి స్థాయిలో మొదలు కాలేదు. చాలామందికి ఇంకా అందని ద్రాక్షే.. విద్యా రుణాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ.. చాలా మంది విద్యార్థుల్లో ఇలాంటి వాటి గురించి అవగాహన లేదని సీఆర్ఐఎఫ్ వీపీ పారిజాత్ గర్గ్ పేర్కొన్నారు. విద్యా రుణాల మంజూరు ప్రక్రియ ఇంకా సంక్లిష్టంగానే, బోలెడంత సమయం తీసుకునేదిగానే ఉంటోందని తెలిపారు. సాదారణంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎడ్యుకేషనల్ లోన్స్ జారీ చేయడానికి 10–15 రోజులు తీసుకుంటున్నాయని.. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దీనికి 15–21 రోజుల పైగా పట్టేస్తోందని వివరించారు. అడ్మిషన్ల విషయంలో సమయం చాలా విలువైనది కావడంతో విద్యార్థులకు ఇలాంటి అంశాలు కొంత సమస్యాత్మకంగా ఉంటున్నాయి. మొండిబాకీలు అధికమే.. విద్యా రుణాల విభాగంలో దాదాపు సగభాగం లోన్స్ పరిమాణం రూ. 4 లక్షల దాకా ఉంటోంది. అయితే, అత్యధిక స్థాయిలో మొండిబాకీలు (ఎన్పీఏ) పేరుకుపోయిన రుణ విభాగం కూడా ఇదే కావడం గమనార్హం. రూ. 4 లక్షల దాకా ఎడ్యుకేషనల్ లోన్ని ప్రాధాన్యతా రంగ రుణంగా పరిగణించడం జరుగుతోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలోనే అత్యధిక ఎన్‌పీఏలూ ఉంటున్నాయని వివరించాయి. విద్యా రుణాలకు సంబంధించిన మొత్తం ఎన్‌పీఏల్లో దాదాపు 85 శాతం .. ఈ విభాగానిదే ఉంటోందని పేర్కొన్నాయి. సుమారు రూ. 2 లక్షల దాకా రుణాల విభాగంలో 11.61 శాతం పైగా ఎన్పీఏలు ఉన్నాయి. కోర్సు ముగిసి, మారటోరియం వ్యవధి కూడా తీరిపోయిన తర్వాత రుణం తీసుకున్న విద్యార్థులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవడం తమకు పెద్ద సమస్యగా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విభాగం కింద రుణాలివ్వడానికి కూడా ఎక్కువగా బ్యాంకులు ముందుకు రావడం లేదని వివరించాయి. -
మరిన్ని అధికారాలు ఇవ్వండి..
న్యూఢిల్లీ: మొండిబాకీలు, స్కామ్‌లు, నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) సమర్ధంగా నియంత్రించాలంటే తమకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉంటుందని పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పీఎస్‌బీల చైర్మన్, డైరెక్టర్, సీఈవోలను తొలగించడం మొదలు ఆయా బ్యాంకుల బోర్డుల్లో డైరెక్టర్లపై ఆంక్షలు విధించడం దాకా దాదాపు పదికి పైగా కీలక అంశాల్లో తమకు పూర్తి అధికారాలు లేవని ఆయన చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక)తో మంగళవారం భేటీ అయిన సందర్భంగా పటేల్ ఈ విషయాలు పేర్కొన్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. మొండిబాకీలు, బ్యాంకుల్లో మోసాలు, నగదు కొరత వంటి పలు అంశాలపై స్థాయీ సంఘం నుంచి పటేల్‌కు కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మరోవైపు, దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మొండిబాకీల రికవరీ మెరుగుపడుతోందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. బోర్డుల్లో ఆర్బీఐ నామినీలు ఉండకూడదు.. బ్యాంకులను సమర్ధంగా నియంత్రించాలంటే వాటి బోర్డుల్లో రిజర్వ్ బ్యాంక్ నామినీ డైరెక్టర్లు ఉండకూడదని స్థాయీ సంఘానికి పటేల్ తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల పనితీరును మెరుగుపర్చేందుకు నాయక్ కమిటీ సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బోర్డు స్వతంత్ర హోదాను మరింత పటిష్టం చేసేందుకు, మేనేజ్మెంట్పై పర్యవేక్షణను పెంచేందుకే చైర్మన్.. సీఈవో/ఎండీ పదవులను విడగొట్టినట్లు పటేల్ తెలిపారు. మోసాల నియంత్రణ బాధ్యత బోర్డులదే.. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ. 13,000 కోట్ల కుంభకోణం గురించి కూడా పటేల్ వివరణ ఇచ్చారు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో గవర్నెన్స్ లోపాలపైనా స్థాయీ సంఘం ప్రశ్నించింది. ప్రతి బ్యాంకు శాఖను ఆర్బీఐ ఆడిట్ చేయడం అసాధ్యమని స్పష్టం చేసిన పటేల్.. మోసాలకు తావులేకుండా బ్యాంకులు సమర్ధంగా నడిచేలా చూడటమనేది వాటి బోర్డుల్లోని డైరెక్టర్ల ప్రాథమిక, సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. అటు డీమోనిటైజేషన్, ఆ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి మళ్లీ ఎంత మొత్తం నగదు తిరిగి వచ్చిం దన్న ప్రశ్నలకు పటేల్ నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని సమచారం. -
దేనా బ్యాంక్‌పై ఆంక్షలు ఎత్తివేయండి
వడోదరా: భారీ మొండిబాకీల కారణంగా తదుపరి రుణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వ రంగ దేనా బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అభ్యర్థించింది. ఆంక్షల మూలంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దేనా బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేర్చడం తెలిసిందే. దీనివల్ల కొత్తగా రుణాలు మంజూరు చేయటం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి అంశాల్లో బ్యాంకు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల బ్యాంకు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జూన్ 10న ఉర్జిత్ పటేల్‌కు రాసిన లేఖలో ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులను ఇది అనవసర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాపార పరిమాణం ప్రకారం భారీ బ్యాంకు కాకపోయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిలో దేనా బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని వెంకటాచలం వివరించారు. 2018 మార్చి 31 నాటికి దేనా బ్యాంకులో స్థూల మొండిబాకీలు 16.27% నుంచి 22.4 శాతానికి ఎగిశాయి. విలువపరంగా చూస్తే రూ. 12,619 కోట్ల నుంచి రూ.16,361 కోట్లకు చేరాయి. నికర ఎన్పీఏలు 10.66% (రూ.7,735 కోట్లు) నుంచి 11.95 శాతానికి (రూ.7,839 కోట్లు) చేరాయి. దేనా బ్యాంక్‌తో పాటు అలహాబాద్ బ్యాంక్, ఐడీబీఐ, యూకో తదితర బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. ఎన్సీఎల్టీ ముందుకు 65 మొండిపద్దులు: అలహాబాద్ బ్యాంక్ కోల్‌కతా: గత ఆర్థిక సంవత్సరం(2017–18) సుమారు రూ.12,566 కోట్ల మొండిబాకీలకు సంబంధించిన 65 ఖాతాదారులపై దివాలా చట్టం కింద చర్యల కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. -
డిటెక్టివ్‌లతో డిఫాల్టర్ల వేట!
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన మొండి బాకీలను రికవర్ చేసుకునేందుకు ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పత్తా లేకుండా పోయిన డిఫాల్టర్లను వెతికి పట్టుకునేందుకు డిటెక్టివ్‌ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వీసులు అందించేందుకు డిటెక్టివ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మే 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొండి బాకీలను రాబట్టుకునే క్రమంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి గణనీయంగా తోడ్పాటు అందించేలా డిటెక్టివ్ ఏజెన్సీలను నియమించుకోవాలని నిర్ణయించినట్లు పీఎన్బీ పేర్కొంది. పత్తా లేకుండా పోయిన లేదా బ్యాంకు రికార్డుల్లోని చిరునామాల్లో లేని రుణగ్రహీతలు, గ్యారంటార్లతో పాటు వారి వారసుల ఆచూకీని దొరకపుచ్చుకునేందుకు ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. డిఫాల్టర్ల ప్రస్తుత చిరునామా, ఉద్యోగం, వృత్తి, ఆదాయ మార్గాలు, ఆస్తుల వివరాలు మొదలైన సమాచారాన్ని డిటెక్టివ్లు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. నివేదిక సమర్పించేందుకు ఏజెన్సీలకు గరిష్టంగా 60 రోజుల వ్యవధి ఉంటుంది. కేసు సంక్లిష్టతను బట్టి అవసరమైతే 90 రోజుల దాకా దీన్ని పొడిగించే అవకాశం ఉంది. రూ.13,000 కోట్ల నీరవ్ మోడీ స్కామ్‌తో సతమతమవుతున్న పీఎన్బీ నికర నిరర్థక ఆస్తులు 2017 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 57,519 కోట్ల మేర ఉన్నాయి. స్థూల రుణాల్లో ఇది 12.11 శాతం. వీటిని రికవర్ చేసుకునేందుకు బ్యాంకు ఇప్పటికే గాంధీగిరీ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీని ద్వారా ప్రతి నెలా రూ. 150 కోట్లు రికవరీ కాగలవని ఆశిస్తోంది. -
‘మిషన్ గాంధీగిరీ’తో రూ. 1,800 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండిబాకీలను రాబట్టుకునేందుకు దాదాపు ఏడాదికాలంగా కొనసాగిస్తున్న మిషన్ గాంధీగిరీ ద్వారా .. రూ. 1,800 కోట్లు రికవరీ కాగలవని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అంచనా వేస్తోంది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో సానుకూల ఫలితాలనిస్తోందని, సగటున నెలకు రూ. 150 కోట్ల మేర వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. మొండిబాకీదారుల పేర్లను బైటపెట్టడం ద్వారా వారిపై సామాజికంగా ఒత్తిడి పెంచి, బాకీలు రాబట్టుకోవాలన్నది మిషన్ గాంధీగిరీ ఉద్దేశమని పేర్కొన్నాయి. బ్యాంకు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా రికవరీ టీమ్ కూడా ఏర్పాటు చేసినట్లు పీఎన్బీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొండిబాకీలపై పీఎన్బీ తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత కొన్ని నెలల్లో 150 పైచిలుకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాస్‌పోర్టులను జప్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో డిఫాల్టర్లపై 37 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్లు చెప్పారు. -
వేగంగా మొండిబాకీల పరిష్కారం
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. వారంవారీ నివేదికలు.. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకం, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం (ఎస్డీఆర్) తదితర స్కీమ్‌లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించింది. ఈ స్కీములు ఇంకా అమల్లోకి రాని మొండిబాకీల ఖాతాలన్నింటికీ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) విధానాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులన్నీ ప్రతి నెలా సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)కి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రుణగ్రహీతల డిఫాల్ట్‌ల వివరాలను బ్యాంకులు ప్రతి శుక్రవారం తెలియజేయాలి. ఒకవేళ శుక్రవారం సెలవైతే అంతకు ముందు రోజు పంపాలి. వారం వారీ నివేదికల నిబంధన ఫిబ్రవరి 23 నుంచే అమల్లోకి వస్తుంది. ఒక్క దెబ్బతో ప్రక్షాళన..: కొత్త నిబంధనలు డిఫాల్టర్లకు ‘మేల్కొలుపు’ లాంటివని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మొండిబాకీల సమస్య పరిష్కారాన్ని పదే పదే వాయిదా వేయకుండా, ఒక్క దెబ్బతో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బ్యాంకుల ప్రొవిజనింగ్ నిబంధనలపై ఆర్బీఐ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపబోదని రాజీవ్ కుమార్ తెలిపారు. మొండిబాకీలుగా మారే అవకాశమున్న పద్దులను బ్యాంకులు మరింత ముందుగా గుర్తించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కార ప్రణాళికలను అమలు చేసేలా కొత్త మార్గదర్శకాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. 2017 సెప్టెంబర్ 30 నాటికి స్థూలంగా ఎన్పీఏలు ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 7,33,974 కోట్ల మేర, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ. 1,02,808 కోట్ల మేర పేరుకుపోయిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్‌కు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. జీఎస్టీతో త్వరలో పన్నుల పంట! పటిష్ట చర్యలతో నెలకు రూ. లక్ష కోట్లపైన వసూళ్ల అంచనా న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పన్నుల వసూళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19) చివరికల్లా గణనీయంగా పెరుగుతాయన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేతల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలన్నీ త్వరలోనే ఫలించబోతున్నాయని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా జీఎస్టీ వసూళ్లు నెలకు సగటున లక్ష కోట్ల రూపాయలు దాటడం ఖాయమని వారు అంచనావేస్తున్నారు. పన్ను డేటాను అన్ని కోణాల్లో సరిచూసుకోవడం, ఈ–వే బిల్ వంటి పన్ను ఎగవేత నిరోధక చర్యలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఒకసారి పూర్తిగా స్థిరీకరణ జరిగితే, దాఖలైన ఆదాయపు పన్ను రిట ర్న్స్తో జీఎస్టీ ఫైలింగ్ డేటాబేస్ మొత్తాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (డీజీఏఆర్ఎం) మదింపుచేయగలుగుతుందని, దీనితో ఎగవేతలకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి అంచనాలు ఇలా... 2018–19తో జీఎస్టీ ద్వారా దాదాపు రూ.7.44 లక్షల కోట్లు వసూలు కావాలని బడ్జెట్ నిర్దేశించుకుంది. జూలైలో జీఎస్టీ ప్రారంభమైననాటి నుంచీ ఇప్పటి వరకూ (దాదాపు ఎనిమిది నెలలు) జీఎస్టీ వసూళ్ల అంచనా రూ.4.44 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ పరిమాణం మరింత పెరగడం ఖాయమన్నది నిపుణుల విశ్లేషణ. 2017 డిసెంబర్ నాటికి దేశంలోని 98 లక్షల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్ అయ్యాయి. బంగారంపై దృష్టి... పసిడి, ఆభరణాల పరిశ్రమలో పన్నుల వసూళ్లకు సంబంధించి చోటుచేసుకుంటున్న లోపాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘10% కస్టమ్స్ సుంకం ఉన్నప్పటికీ, పసిడి దిగుమతులు ప్రతినెలా పెరుగుతున్నాయి. అయితే దిగుమతి అయి న ఈ బంగారం ఎటు పోతోంది? తుది సరఫరాదారు ఎవరన్న విషయాన్ని జీఎస్టీ వల్ల గుర్తించగలుగుతాం’’అని ఉన్నతాధికారి తెలిపారు. -
బ్యాంకులకు సానుకూల రేటింగ్
ముంబై: మొండి బాకీల సమస్య నుంచి గట్టెక్కే దిశగా అదనపు మూలధనం లభించనున్న 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రేటింగ్‌పై క్రిసిల్ సంస్థ సానుకూలంగా స్పందించింది. వాటి అంచనాలను నెగటివ్ నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి పెంచింది. ఆయా బ్యాంకులు పటిష్టంగా మారడానికి అదనపు మూలధనం ఉపయోగపడగలదని క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. రుణాలకు డిమాండ్ కూడా పుంజుకుంటే బ్యాంకుల మొత్తం పనితీరు కూడా మెరుగుపడగలదని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎస్‌బీల అంచనాలపై క్రిసిల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర 18 బ్యాంకుల అంచనాలను స్థిర స్థాయికి క్రిసిల్ పెంచింది. అయితే, ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. 8,800 కోట్లు అందుకోనున్న దిగ్గజం ఎస్బీఐ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆంధ్రా బ్యాంక్, బీవోబీ సహా తొమ్మిది పీఎస్‌బీల బాసెల్ త్రీ టైర్ 1 బాండ్ల రేటింగ్స్‌ను, అంచనాలను (నెగటివ్) యధాతథంగా కొనసాగిస్తున్నట్లు క్రిసిల్ తెలిపింది. రీక్యాపిటలైజేషన్ ప్రక్రియ.. ప్రభుత్వ మద్దతును సూచించడంతో పాటు పీఎస్‌బీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది కూడా గుర్తు చేస్తుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. -
అప్పు తీర్చమన్నందుకు కత్తితో దాడి..
హైదరాబాద్ : అప్పు తీర్చమన్నందుకు ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నయాబజార్ స్కూలు వద్ద అన్వర్ అనే వ్యక్తి తన మిత్రుడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు బాధితుడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన వద్ద తీసుకున్న అప్పును తీర్చకుండా అన్వర్ తప్పించుకుంటున్నాడని, గట్టిగా అడిగినందుకు దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోటీశ్వరులు పారిపోతుంటే.. రైతులకు శిక్షా?
వేలాది కోట్లు మూటగట్టుకున్నవాళ్లు విదేశాలకు పారిపోతుంటే, రైతులకు మాత్రం జరిమానాలు వేస్తున్నారంటూ రిజర్వు బ్యాంకుపై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రుణాలు బాకీపడిన రైతుల ఇళ్లకు బ్యాంకులు సిబ్బందిని పంపి ట్రాక్టర్లు సీజ్ చేయిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రిజర్వు బ్యాంకు ఎప్పుడూ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని చెప్పింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంతభూషణ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం, అవన్నీ చావుబాకీలుగా మారిన నేపథ్యంలో దానికి బాధ్యులైనవారిని గుర్తించి శిక్షించాలని ప్రశాంత భూషణ్ తన పిటిషన్లో కోరారు. అంతకుముందు రూ. 500 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో బాకీలున్న వ్యక్తులు, సంస్థల జాబితాను కోర్టుకు సమర్పించి, ఆ పేర్లను రహస్యంగా ఉంచాలని కోరింది. ఆ మొత్తం ఎంతో బయటపెట్టొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్బీఐ తెలిపింది. రూ. 500 కోట్ల క్లబ్బులో ఉన్నవాళ్ల పేర్లు బయటపెట్టాలని ప్రశాంతభూషణ్ కోరారు. అలా బయటపెడి తే ప్రస్తుతమున్న నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందా అని ఆర్థిక మంత్రిత్వశాఖ, బ్యాంకులు వివరించాలని సుప్రీం తెలిపింది. 2013-2015 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో 28 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 1.14 లక్షల కోట్లను చావుబాకీలుగా నిర్ధారించి రద్దుచేశాయి. -
అప్పు కొంత తీరుస్తా.. ఏమంటారు?
పేరుకుపోయిన చావుబాకీలను తీర్చే విషయంలో బ్యాంకులతో తాము చర్చలు సాగిస్తున్నట్లు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు అప్పులు ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. దాంతో బ్యాంకుల కన్సార్షియం ఈ ప్రతిపాదనకు స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు వ్యాపారాలతో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తర్వాత పూర్తిగా అప్పులపాలై వ్యాపారాలన్నింటినీ దాదాపు వదులుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్ యాజమాన్యాన్ని కూడా వేరే విదేశీ సంస్థకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ప్రతిపాదన చేశాడు.