న్యూఢిల్లీ: మొండిబాకీల భారంతో కుంగుతున్న ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను (51 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌సీ గర్గ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7– 7.5 శాతం మేర వాటాలున్నాయని, మెజారిటీ హోల్డింగ్ కోసం మరిన్ని వాటాలను కొనుగోలు చేయనుందని ఆయన తెలియజేశారు. ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఐడీబీఐ బ్యాంకు ఈ నిధులు సమకూర్చుకోవచ్చని గర్గ్ వివరించారు. ఎల్‌ఐసీ బోర్డులో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.
‘ప్రభుత్వం నుంచి నేరుగా వాటాలు కొనుగోలు చేయడం ఒక మార్గమైతే... ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకు ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించడం మరో మార్గం. అయితే మొదటి దాని వల్ల ఐడీబీఐ బ్యాంకుకు నేరుగా మూలధనం లభించదు. ప్రస్తుతం బ్యాంకుకు మరింత మూలధనం కావాలి. కాబట్టి.. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్‌మెంట్ రూపంలోనే డీల్ ఉండే అవకాశం ఉంది‘ అని గర్గ్ వ్యాఖ్యానించారు.
సెబీ అనుమతులు తీసుకోనున్న ఎల్‌ఐసీ..
ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకునే ప్రతిపాదనకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, ఐడీబీఐ బ్యాంకు లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా ఎల్‌ఐసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అటు వాటాల విక్రయానికి ఐడీబీఐ బ్యాంకు కూడా తమ సంస్థ బోర్డు నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్యాంకులో పబ్లిక్ వాటాలు తక్కువే ఉండటం వల్ల ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చని గర్గ్ పేర్కొన్నారు. అయితే, సందర్భాన్ని బట్టి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందన్నారు.
రూ. 13,000 కోట్ల డీల్?
వాటాల విక్రయంతో ఐడీబీఐ బ్యాంకుకు ఎంత మేర నిధులు లభించవచ్చన్నది గర్గ్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ కుదిరితే సుమారు రూ. 10,000– 13,000 కోట్ల మేర లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పుడు ఐడీబీఐ బ్యాంక్ బోర్డులో కనీసం నలుగురు సభ్యులను నామినేట్ చేసేందుకు ఎల్‌ఐసీకి అవకాశం దక్కుతుంది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి కూడా ప్రవేశించినట్లవుతుంది.
బ్యాంకుకు చెందిన 2,000 పై చిలుకు శాఖల్లో ఎల్‌ఐసీ తమ పథకాలను విక్రయించుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే, ఎల్‌ఐసీ దగ్గర భారీగా ఉన్న నిధులు ఐడీబీఐ బ్యాంకుకు అందివస్తాయి. 22 కోట్ల పైచిలుకు పాలసీ హోల్డర్ల అకౌంట్లు కూడా ఈ బ్యాంకుకు దక్కవచ్చు. ప్రస్తుతం రూ.55,600 కోట్ల పైచిలుకు మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకుకు ఈ డీల్ బూస్ట్‌లా పనిచేస్తుంది.
రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ బోర్డు భేటీ
వాటాల విక్రయానికి సంబంధించి ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై చర్చించేందుకు ఒకటి, రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలోగా అనుమతినివ్వొచ్చని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సంస్థలు.. ఇటు సెబీ, అటు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతులు కోరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment