Life Insurance Corporation
-
ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ నో!!
న్యూఢిల్లీ: ఇటీవలే యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో పేరు మార్పునకు అనుమతించాలన్న ఐడీబీఐ బ్యాంకు విజ్ఞప్తిని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తోసిపుచ్చింది. దీంతో బ్యాంకు ఇకపైనా అదే పేరుతో కొనసాగనుంది. ఐడీబీఐ బ్యాంకు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయాలు తెలియజేసింది. అయితే, పేరు మార్పును ఆర్బీఐ తిరస్కరించడానికి గల కారణాలను వివరించలేదు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌తో బ్యాంకులో ప్రభుత్వ వాటా 46.46 శాతానికి తగ్గగా.. ఎల్ఐసీ వాటా 8% నుంచి 51 శాతానికి పెరిగింది. దీంతో ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకు లేదా ఎల్ఐసీ బ్యాంకుగా పేరును మార్చుకునేందుకు అనుమతించాలంటూ ఐడీబీఐ బ్యాంకు బోర్డు గత నెలలో ఆర్బీఐని కోరింది. ఈ ప్రతిపాదననే రిజర్వ్ బ్యాంక్ తాజాగా తిరస్కరించింది. -
ఇక ఎల్ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు!
న్యూఢిల్లీ: మొండిబాకీల భారంతో కుంగుతున్న ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను (51 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సీ గర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 7– 7.5 శాతం మేర వాటాలున్నాయని, మెజారిటీ హోల్డింగ్ కోసం మరిన్ని వాటాలను కొనుగోలు చేయనుందని ఆయన తెలియజేశారు. ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఐడీబీఐ బ్యాంకు ఈ నిధులు సమకూర్చుకోవచ్చని గర్గ్ వివరించారు. ఎల్ఐసీ బోర్డులో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. ‘ప్రభుత్వం నుంచి నేరుగా వాటాలు కొనుగోలు చేయడం ఒక మార్గమైతే... ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకు ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించడం మరో మార్గం. అయితే మొదటి దాని వల్ల ఐడీబీఐ బ్యాంకుకు నేరుగా మూలధనం లభించదు. ప్రస్తుతం బ్యాంకుకు మరింత మూలధనం కావాలి. కాబట్టి.. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ రూపంలోనే డీల్ ఉండే అవకాశం ఉంది‘ అని గర్గ్ వ్యాఖ్యానించారు. సెబీ అనుమతులు తీసుకోనున్న ఎల్ఐసీ.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ వాటాలు పెంచుకునే ప్రతిపాదనకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, ఐడీబీఐ బ్యాంకు లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా ఎల్ఐసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు వాటాల విక్రయానికి ఐడీబీఐ బ్యాంకు కూడా తమ సంస్థ బోర్డు నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్యాంకులో పబ్లిక్ వాటాలు తక్కువే ఉండటం వల్ల ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చని గర్గ్ పేర్కొన్నారు. అయితే, సందర్భాన్ని బట్టి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందన్నారు. రూ. 13,000 కోట్ల డీల్? వాటాల విక్రయంతో ఐడీబీఐ బ్యాంకుకు ఎంత మేర నిధులు లభించవచ్చన్నది గర్గ్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ కుదిరితే సుమారు రూ. 10,000– 13,000 కోట్ల మేర లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పుడు ఐడీబీఐ బ్యాంక్ బోర్డులో కనీసం నలుగురు సభ్యులను నామినేట్ చేసేందుకు ఎల్ఐసీకి అవకాశం దక్కుతుంది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి కూడా ప్రవేశించినట్లవుతుంది. బ్యాంకుకు చెందిన 2,000 పై చిలుకు శాఖల్లో ఎల్ఐసీ తమ పథకాలను విక్రయించుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే, ఎల్ఐసీ దగ్గర భారీగా ఉన్న నిధులు ఐడీబీఐ బ్యాంకుకు అందివస్తాయి. 22 కోట్ల పైచిలుకు పాలసీ హోల్డర్ల అకౌంట్లు కూడా ఈ బ్యాంకుకు దక్కవచ్చు. ప్రస్తుతం రూ.55,600 కోట్ల పైచిలుకు మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకుకు ఈ డీల్ బూస్ట్‌లా పనిచేస్తుంది. రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ బోర్డు భేటీ వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై చర్చించేందుకు ఒకటి, రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలోగా అనుమతినివ్వొచ్చని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సంస్థలు.. ఇటు సెబీ, అటు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతులు కోరనున్నాయి. -
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1804 కోట్ల చెక్కు
న్యూఢిల్లీ: సంస్థ మిగులుకు సంబంధించి రూ.1,804.35 కోట్ల చెక్కును ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కేంద్రానికి సమర్పించింది. 2015 మార్చి ముగింపు నాటికి వాస్తవ విలువ మిగుల్లో ఈ మేరకు కేంద్రం వాటాను సమర్పించినట్లు ఎల్ఐసీ పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ఎస్కే రాయ్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇందుకు సంబంధించి ఒక చెక్కును అందజేశారు. మిగుల్లో 95 శాతాన్ని బోనస్‌గా పాలసీ హోల్డర్లకు సంస్థ అందజేసింది. మిగిలిన ఐదు శాతం వాటా (రూ.1,804.35 కోట్లు) కేంద్రానిదని అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక కార్యదర్శి శక్తికాంతదాస్, ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి స్నేహలతా శ్రీవాస్తవ ఎల్ఐసీకి చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎల్ఐసీ నుంచి తొలి యులిప్ పాలసీ
- ‘న్యూ ఎండోమెంట్ ప్లస్’ పేరుతో పథకం విడుదల - మెచ్యూర్టీ మొత్తాన్ని వాయిదాల్లో తీసుకునే చాన్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారిన నిబంధనల తర్వాత దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలి యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్)ను ప్రవేశపెట్టింది. న్యూ ఎండోమెంట్ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యులిప్ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్, డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను పాలసీదారులకు అందిస్తారు. పథకం పేరులో ఎండోమెంట్ ప్లస్ అని ఉన్నా ఇది నష్టాల రిస్క్‌తో కూడిన యులిప్ పథకమని, ఇన్వెస్ట్ చేసే ముందు వీటి ఇన్వెస్ట్మెంట్లో ఉండే రిస్క్ గురించి తమ ఏజెంట్లు పాలసీదారులకు తెలియచేస్తారని ఎల్ఐసీ జోనల్ మేనేజర్ కె. గణేష్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలసీ కాలపరిమితి 10-20 ఏళ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. 90 రోజుల వయసు ఉన్న పిల్లల నుంచి 50 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పథకం బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్ (ఈక్విటీ) పేరుతో నాలుగు రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. కనీస వార్షిక ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 20,000. మెచ్యూర్టీ మొత్తాన్ని ఒకేసారిగా లేదా వాయిదాల్లో విడతల వారీగా తీసుకునే సౌలభ్యాన్ని ఈ పథకం కల్పిస్తోంది. దీనిలో ఇన్వెస్ట్ చేశాక ఐదేళ్ల వరకు వైదొలగడానికి ఉండదు. ఇక బీమా రక్షణ విషయానికి వస్తే వార్షిక ప్రీమియానికి 10రెట్లు లేదా చెల్లించిన ప్రీమియానికి 105%, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. -
ఎల్ఐసీలో కొలువుల మేళా..!
దేశంలో జీవిత బీమా సంస్థల్లో అతిపెద్దదైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా భారీ ఖాళీలతో ప్రకటన విడుదల చేసింది. వివిధ జోన్లలో మొత్తం 5,066 అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (ఏడీవో) ఖాళీలున్నాయి. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో 699 పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం, విజయానికి వ్యూహాలు తదితరాలపై ఫోకస్... ఖాళీల వివరాలు: వర్గం ఖాళీలు జనరల్ 339 ఎస్సీ 109 ఎస్టీ 48 ఓబీసీ 203 మొత్తం 699 డివిజన్ల వారీగా పోస్టులు కడప- 66; హైదరాబాద్- 53; కరీంనగర్- 15; మచిలీపట్నం- 49; నెల్లూరు- 45; రాజమండ్రి- 41; సికింద్రాబాద్-51; విశాఖపట్నం-41; వరంగల్- 11; బెంగళూరు-1: 67; బెంగళూరు-2: 65; బెల్గాం-34; ధార్వాడ్-34; మైసూర్-39; రాయ్‌చూర్-37; షిమోగ-22; ఉడిపి-29. వేతనాలు ఏడీఓగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటీస్ సమయంలో నెలకు రూ.23,836 స్టైఫండ్‌గా లభిస్తుంది. అప్రెంటీస్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ప్రొబేషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా నియమిస్తారు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.26,736 వరకు అందుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్స్‌లుంటాయి. అర్హతలు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్)లో మాస్టర్ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 2015, జూన్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా గరిష్ట వయోపరిమితిలో ప్రత్యేక సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు; ఓబీసీలకు 45 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లు. ఎల్ఐసీ ఏజెంట్లకు కూడా మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ ఏజెంట్లకు జనరల్ కేటగిరీ గరిష్ట వయోపరిమితి 37 ఏళ్లు; ఓబీసీ-40; ఎస్సీ, ఎస్టీ-42 ఏళ్లు. ఎంపిక విధానం ఎంపిక పక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలను ఖరారు చేస్తారు. ఏడీఓగా నియమితులైన అభ్యర్థులు కనీసం నాలుగేళ్లపాటు ఎల్ఐసీలో సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను పోస్టులో చేరేముందు రూ.25,000 బాండ్ సమర్పించాలి. పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల పాటు జరిగే పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ ప్రశ్నల సంఖ్య మార్కులు పేపర్-1 రీజనింగ్ ఎబిలిటీ 25 25 న్యూమరికల్ ఎబిలిటీ 25 25 పేపర్-2 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 25 ఇంగ్లిష్ లాంగ్వేజ్ (గ్రామర్, వొక్యాబులరీ) 25 25 పేపర్-3 ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ 50 50 (లైఫ్ ఇన్సూరెన్స్,ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) మొత్తం 150 150 ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లోనూ నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. ఈ కటాఫ్‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల్లో కోత విధిస్తారు. విధులు తమకు నిర్దేశించిన డివిజనల్లో ఎల్ఐసీ పాలసీల సేల్స్‌ను పర్యవే క్షించడం వీరి ప్రధాన విధి. ఏజెంట్లను నియమించుకుని.. వారితో ఎక్కువ సంఖ్యలో పాలసీలను విక్రయించేలా చూడాలి. తాను నియమించుకున్న ఏజెంట్లకు శిక్షణనందించడంతోపాటు ఎల్ఐసీ అందించే వివిధ ఇన్సూరెన్స్ పథకాలను వివరించడం.అవసరమైతే ఏజెంట్లు చేర్చిన పాలసీదారులతో మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తి చేయడం.తాము పనిచేసే డివిజన్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ సదుపాయం ఏడీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్షకు సిద్ధం కావడానికి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కూడా ఎల్ఐసీ అందిస్తుంది. దీనికోసం ఏ డివిజన్ పరిధిలో అయితే దరఖాస్తు చేసుకున్నారో.. ఆ ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్‌ను 2015 జులై మొదటి వారంలో సంప్రదించాలి. ప్రిపరేషన్ ప్రణాళిక రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అభ్యర్థి తార్కిక ఆలోచన శక్తిని, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు. నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్స్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలెదురవుతాయి. సంబంధిత ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో నంబర్ సిస్టమ్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, శాతాలు, స్క్వేర్ రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు,డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం మొదలైన అంశాలపై ప్రశ్నలడుగుతారు. గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పుస్తకాలను సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. ప్రతి చాప్టర్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు వీలైనన్ని మాక్ టెస్ట్‌లను సాధన చేయాలి. సంబంధిత అంశాలలో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్ జీకేలో అత్యధిక మార్కుల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు ఏవైనా తెలుగు దినపత్రికలను, ఏదైనా ఒక ఇయర్‌బుక్‌ను చదవాలి. ఈ విభాగంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, వివిధ జాతీయ ఉద్యమాలు, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్, వ్యక్తులు-బిరుదులు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-వ్యక్తులు, క్రీడలు, వ్యక్తులు-నియామకాలు, వివిధ సదస్సులు జరిగిన ప్రాంతాలు, శాస్త్రసాంకేతిక ప్రయోగాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎల్ఐసీకి చెందిన ఉద్యోగం కాబట్టి ఎల్ఐసీ, ఐఆర్డీఏ తాజా విధానాలు, రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లు, బడ్జెట్ వంటి విషయాలపై కూడా దృష్టి సారించాలి. పేపర్-2లోనే ఎదురయ్యే జనరల్ ఇంగ్లిష్‌లో ప్రధానంగా వొకాబులరీ, గ్రామర్‌పై ప్రశ్నలడుగుతారు. వాక్యాల పునరమరిక, స్పెల్లింగ్, వాక్యాల్లో తప్పులను సరిదిద్దడం, ప్రిపోజిషన్, ఆర్టికల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాన్ని సాధన చేస్తే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు. ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ (లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) 50 మార్కులు కేటాయించారు కాబట్టి విజయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన వర్తమాన సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలి. బీమా సంస్థలు, జాయింట్ వెంచర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కొత్త చట్టాలు, సంప్రదాయ, ఆధునిక పాలసీలు, రిటర్నులు వంటి వాటిపై అవగాహన అవసరం. -
మార్కెట్ మరింత ముందుకే
వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో ఈ వారం కూడా మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశమున్నదని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఇకపై ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని తెలిపారు. అయితే సెలవుల కారణంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. మంగళవారం(4న) మొహర్రం సందర్భంగా, గురువారం(6న) గురునానక్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు. జపాన్ సహాయ ప్యాకేజీ పెంపు, అంచనాలను మించిన అమెరికా జీడీపీ వృద్ధి, మోదీ ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలతో గత వారం మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పడం తెలిసిందే. సెన్సెక్స్ 1,015 పాయింట్లు(3.5%) ఎగసి 27,866 వద్ద నిలవగా, నిఫ్టీ 8,322 వద్ద స్థిరపడింది. అక్టోబర్ నెలకు వెల్లడవుతున్న సిమెంట్, ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటితోపాటు ఈ వారంలో హెచ్ఎస్బీసీ పీఎంఐ తయారీ రంగం, సర్వీసుల రంగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. బ్యాంకింగ్, ఆటో హవా మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అప్‌ట్రెండ్ మరింత విస్తరిస్తుందని నమ్ముతున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించే అవకాశముందని పేర్కొన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ఢకన్ సైతం వెల్లడించారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని హీరేన్ అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టినిలుపుతారని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, జీఎస్టీ, భూసంస్కరణలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనున్నాయి. ఎల్అండ్టీ ఫలితాలు ఈ వారం క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్, మిడ్ క్యాప్ కంపెనీలలో ఎల్అండ్టీ, ఇంజనీర్స్ ఇండియా, అరబిందో ఫార్మా, కెనరా బ్యాంక్, జెట్ ఎయిర్వేస్, జిందాల్ స్టీల్, థెర్మాక్స్, డాబర్, మ్యారికో, సిండికేట్ బ్యాంక్, హెక్సావేర్, ఎంఎంటీసీ, నోవర్టిస్, సన్ టీవీ, యూకో బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడులు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ధోరణి, చమురు ధరలు వంటి అంశాలు కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఎల్ఐసీ రూ. 7,700 కోట్ల షేర్ల అమ్మకాలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలంలో రూ. 7,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించింది. ఈ వాటాలు 14 బ్లూచిప్ కంపెనీలకు చెందినవి. మరోవైపు ఇదే కాలంలో సెన్సెక్స్ కంపెనీలలో రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. విప్రో, గెయిల్, భెల్, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్లోగల వాటాలను మాత్రం యథాతథంగా కొనసాగించింది. గత కొన్ని క్వార్టర్లుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌లో ఎలాంటి వాటానూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. సెన్సెక్స్లోకెల్లా ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీలో అత్యధికంగా 16.97% వాటా ఎల్ఐసీకి ఉంది. కాగా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్‌లతోపాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కోలలో వాటాలను కొంతమేర విక్రయించింది. ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ఆటోలో వాటాను పెంచుకుంది.