ఎల్‌ఐసీ నుంచి తొలి యులిప్ పాలసీ
- ‘న్యూ ఎండోమెంట్ ప్లస్’ పేరుతో పథకం విడుదల
- మెచ్యూర్టీ మొత్తాన్ని వాయిదాల్లో తీసుకునే చాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారిన నిబంధనల తర్వాత దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తొలి యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్)ను ప్రవేశపెట్టింది. న్యూ ఎండోమెంట్ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యులిప్ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్, డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను పాలసీదారులకు అందిస్తారు. పథకం పేరులో ఎండోమెంట్ ప్లస్ అని ఉన్నా ఇది నష్టాల రిస్క్‌తో కూడిన యులిప్ పథకమని, ఇన్వెస్ట్ చేసే ముందు వీటి ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉండే రిస్క్ గురించి తమ ఏజెంట్లు పాలసీదారులకు తెలియచేస్తారని ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ కె. గణేష్ స్పష్టం చేశారు.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలసీ కాలపరిమితి 10-20 ఏళ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. 90 రోజుల వయసు ఉన్న పిల్లల నుంచి 50 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పథకం బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్‌డ్ ఫండ్, గ్రోత్ ఫండ్ (ఈక్విటీ) పేరుతో నాలుగు రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. కనీస వార్షిక ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 20,000. మెచ్యూర్టీ మొత్తాన్ని ఒకేసారిగా లేదా వాయిదాల్లో విడతల వారీగా తీసుకునే సౌలభ్యాన్ని ఈ పథకం కల్పిస్తోంది. దీనిలో ఇన్వెస్ట్ చేశాక ఐదేళ్ల వరకు వైదొలగడానికి ఉండదు. ఇక బీమా రక్షణ విషయానికి వస్తే వార్షిక ప్రీమియానికి 10రెట్లు లేదా చెల్లించిన ప్రీమియానికి 105%, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది.