మార్కెట్ మరింత ముందుకే
వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో ఈ వారం కూడా మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశమున్నదని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఇకపై ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని తెలిపారు. అయితే సెలవుల కారణంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. మంగళవారం(4న) మొహర్రం సందర్భంగా, గురువారం(6న) గురునానక్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు.
జపాన్ సహాయ ప్యాకేజీ పెంపు, అంచనాలను మించిన అమెరికా జీడీపీ వృద్ధి, మోదీ ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలతో గత వారం మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పడం తెలిసిందే. సెన్సెక్స్ 1,015 పాయింట్లు(3.5%) ఎగసి 27,866 వద్ద నిలవగా, నిఫ్టీ 8,322 వద్ద స్థిరపడింది. అక్టోబర్ నెలకు వెల్లడవుతున్న సిమెంట్, ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటితోపాటు ఈ వారంలో హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ తయారీ రంగం, సర్వీసుల రంగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి.
బ్యాంకింగ్, ఆటో హవా
మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అప్‌ట్రెండ్ మరింత విస్తరిస్తుందని నమ్ముతున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించే అవకాశముందని పేర్కొన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ఢకన్ సైతం వెల్లడించారు.
సమీప కాలంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని హీరేన్ అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టినిలుపుతారని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, జీఎస్‌టీ, భూసంస్కరణలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనున్నాయి.
ఎల్‌అండ్‌టీ ఫలితాలు
ఈ వారం క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్, మిడ్ క్యాప్ కంపెనీలలో ఎల్‌అండ్‌టీ, ఇంజనీర్స్ ఇండియా, అరబిందో ఫార్మా, కెనరా బ్యాంక్, జెట్ ఎయిర్‌వేస్, జిందాల్ స్టీల్, థెర్మాక్స్, డాబర్, మ్యారికో, సిండికేట్ బ్యాంక్, హెక్సావేర్, ఎంఎంటీసీ, నోవర్టిస్, సన్ టీవీ, యూకో బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ధోరణి, చమురు ధరలు వంటి అంశాలు కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు.
ఎల్‌ఐసీ రూ. 7,700 కోట్ల షేర్ల అమ్మకాలు
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలంలో రూ. 7,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించింది. ఈ వాటాలు 14 బ్లూచిప్ కంపెనీలకు చెందినవి. మరోవైపు ఇదే కాలంలో సెన్సెక్స్ కంపెనీలలో రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. విప్రో, గెయిల్, భెల్, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్‌లోగల వాటాలను మాత్రం యథాతథంగా కొనసాగించింది.
గత కొన్ని క్వార్టర్లుగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌లో ఎలాంటి వాటానూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. సెన్సెక్స్‌లోకెల్లా ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీలో అత్యధికంగా 16.97% వాటా ఎల్‌ఐసీకి ఉంది. కాగా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్‌లతోపాటు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కోలలో వాటాలను కొంతమేర విక్రయించింది. ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్, బజాజ్‌ఆటోలో వాటాను పెంచుకుంది.