ఆదాయం ఓకే.. మార్జిన్లు డీలా!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఐటీ కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. దేశీయంగా, అభివృద్ధి చెందిన మార్కెట్లలోనూ సాఫ్ట్‌వేర్ సేవలకు కనిపిస్తున్న డిమాండ్ ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే సిబ్బంది జీతాల పెంపు నేపథ్యంలో లాభదాయకత(మార్జిన్లు) తగ్గవచ్చునని అభిప్రాయపడ్డారు.
తొలి క్వార్టర్ కీలకం...
సాధారణంగా ఐటీ, బీపీవో రంగానికి తొలి క్వార్టర్(క్యూ1) కీలకంగా నిలుస్తుంది. క్లయింట్ల బడ్జెట్లు మొదలయ్యే కారణంగా సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీల ఆదాయాలు మెరుగ్గా నమోదవుతాయి. దేశీ ఐటీ, బీపీవో పరిశ్రమ విలువ 118 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన నేపథ్యంలో కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ దీపేన్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో డాలర్ల రూపేణా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుందని అంచనా వేశారు.
క్రాస్ కరెన్సీ ప్రయోజనాలవల్ల 30-40 బేసిస్ పాయింట్లమేర అధిక ఆదాయం నమోదుకాగలదని చెప్పారు. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చాలావరకూ కంపెనీల మార్జిన్లు ఒత్తిడిలో పడే అవకాశముందన్నారు. ఇందుకు సిబ్బంది జీతాల పెంపు, అధిక వీసా వ్యయాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలను పేర్కొన్నారు. ఈ మూడు అంశాల వల్ల నిర్వహణ లాభాలు 1.3-2.3% మధ్య మార్జిన్లు క్షీణించే అవకాశముందని ఎంకే తెలిపింది.
11న ఇన్ఫీతో షురూ: ఇన్ఫోసిస్‌తో ఐటీ కంపెనీల ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఈ నెల 11న ఇన్ఫోసిస్ క్యూ1 పనితీరును వెల్లడించనుంది. 17న టీసీఎస్, 24న విప్రో ఫలితాలు ప్రకటించనున్నాయి. మొత్తంగా యూఎస్, యూరప్‌లలో సాఫ్ట్‌వేర్ సేవలకు పటిష్ట డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని కంపెనీలు ప్రకటించనున్న అంచనాల(గెడైన్స్) ద్వారా వెల్లడికానుందని ఆనంద్ రాఠీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన డాలర్ల రూపంలో ఐటీ కంపెనీల ఆదాయం సగటున 3.4% వృద్ధిని సాధించవచ్చునని నోమురా అంచనా వేసింది.