ద్రవ్యోల్బణం, టీసీఎస్, ఆర్‌ఐఎల్ ఫలితాలపై దృష్టి
- ఈ వారం మార్కెట్లో
- హెచ్చుతగ్గులుండవొచ్చు-నిపుణులు
- 13న రిటైల్, 14న టోకు
- ద్రవోల్బణం డేటా వెల్లడి
- 16న టీసీఎస్, 17న రిలయన్స్ ఫలితాల ప్రకటన
న్యూఢిల్లీ: నాలుగురోజులకే ట్రేడింగ్ పరిమితమయ్యే ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను ద్రవ్యోల్బణం గణాంకాలు, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఫలితాలు నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మార్కెట్‌కు సెలవు. ద్రవ్యోల్బణం డేటా, కార్పొరేట్ ఫలితాలు స్టాక్ సూచీలను హెచ్చుతగ్గులకు లోనుచేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందనతో ఈ సోమవారం మార్కెట్ మొదలవుతుందని,
తదుపరి ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఫిబ్రవరి నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి 5 శాతం వృద్ధిచెందిన సంగతి తెలిసిందే. ఇది 9 నెలల గరిష్టస్థాయి. ఇక ఏప్రిల్ 13, 14 తేదీల్లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం వరుసగా వెలువరిస్తుంది. రిజర్వుబ్యాంక్ తర్వాతి రోజుల్లో మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు ఆ ద్రవ్యోల్బణం గణాంకాల ద్వారా ఏర్పడతాయి.
ఫలితాల సీజన్‌తో స్వల్పకాలిక ట్రెండ్...
ఈ వారం ప్రారంభంకానున్న కార్పొరేట్ ఫలితాల సీజన్ , మార్కెట్ స్వల్పకాలిక దిశను నిర్దేశిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ అంచనా వేశారు. మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుంది. పెట్రోకెమికల్స్ దిగ్గజం రిల యన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు ఏప్రిల్ 17న వెల్లడవుతాయి. ఫలితాలు మందకొడిగా వుంటాయన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో నెలకొన్నాయని, ఆయా కార్పొరేట్లు ప్రకటించే భవిష్యత్ ఫలితాల గైడె న్స్ మార్కెట్‌కు కీలకమని జయంత్ మాంగ్లిక్ అన్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 81,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 81,000 కోట్లు దాటాయి. ఇంత విలువైన ఈక్విటీ, రుణపత్రాలను వారు కొనుగోలు చేసారు.
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 40,000 కోట్లు
న్యూఢిల్లీ: గత 2014-15 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రూ. 40,000 కోట్లు పెట్టుబడి చేశాయి. అంతక్రితం వరుసగా ఐదు ఆర్థిక సంవత్సరాలపాటు నికర విక్రయాలు జరిపిన మ్యూచువల్ ఫండ్స్ 2014-15లో రూ. 40,722 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేశాయి.