ఫలితాలు, ద్రవ్యోల్బణంపై దృష్టి..
ఫలితాలు, ద్రవ్యోల్బణంపై దృష్టి..
Published Mon, Oct 14 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారంలో అనేక అంశాలు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ల రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి పెంపు వంటివన్నీ మన మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ వంటి బ్లూచిప్ దిగ్గజాల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే ఉన్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ కాస్త సానుకూల ఫలితాలతో మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. దిగ్గజాల ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని, దీంతో నిర్దిష్టంగా షేరువారీ కదలికలు మార్కెట్లో ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. మరోపక్క ఈ వారంలో నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితం కానుంది. బక్రీద్ సందర్భంగా ఈ నెల 17న (బుధవారం) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. గత వారంలో 613 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,529 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ద్రవ్యోల్బణం డేటా...
సెప్టెంబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయి. ఈ నెల 29న ఆర్‌బీఐ రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం డేటా చాలా కీలకం కానుంది. ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(6.1%) ఎగబాకడం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా నిత్యావసర సరుకుల ధరలు దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణం. దీనిప్రభావంతో ఆర్‌బీఐ మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్ష(సెప్టెంబర్ 20న)లో వడ్డీరేట్లను(రెపో రేటు) అనూహ్యంగా పావు శాతం పెంచడం తెలిసిందే. రానున్న పాలసీ సమీక్షకూ ద్రవ్యోల్బణం గణాంకాలే ముఖ్యమని, ధరలను మరింత కట్టడిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.
డెట్ మార్కెట్ నుంచి ఎఫ్‌ఐఐలు వెనక్కి...
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ డెట్ మార్కెట్ నుంచి నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా షట్‌డౌన్ ఆందోళనలే దీనికి కారణంగా నిలుస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ.7,800 కోట్లకుపైగా(1.2 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని ఎఫ్‌ఐఐలు ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 1-11 మధ్య రూ.5,541 కోట్ల విలువైన డెట్ సెక్యూరిటీ(బాండ్)లను ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేయగా... రూ.13,365 కోట్ల విలువైన బాండ్‌లను విక్రయించినట్లు సెబీ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క స్టాక్ మార్కెట్లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.3,230 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా కొనుగోలు చేశారు.
రుణ పరిమితి టెన్షన్...
అమెరికా ప్రభుత్వ రుణ పరిమితి పెంపునకు డెడ్‌లైన్ దగ్గరపడుతున్నకొద్దీ.. ప్రపంచ మార్కెట్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రతిపక్ష రిపబ్లికన్లు, ప్రభుత్వ పార్టీ డెమోక్రాట్‌లకు మధ్య పొరపొచ్చాల కారణంగా బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్) కొనసాగుతుండటం తెలిసిందే. ఇప్పుడు రుణ పరిమితి పెంపునకు గడువు ఈ నెల 17తో ముగియనుంది. ప్రస్తుతం 16.7 లక్షల కోట్ల(ట్రిలియన్) డాలర్లుగా ఉన్న రుణ పరిమితిని పెంచడం అమెరికాకు తక్షణావసరం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య బీమా పథకం(ఒబామాకేర్)పై గుర్రుగాఉన్న రిపబ్లికన్‌లు రుణపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం పొందకుండా పావులు కదుపుతున్నారు.
ఇదేగనుక జరిగితే అమెరికాకు తీవ్ర నిధుల కొరత తప్పదని, చెల్లింపుల్లో చేతులెత్తేసే పరిస్థితి(డీఫాల్ట్)కి దారితీస్తుందని ప్రపంచబ్యాంక్ కూడా ఇప్పటికే హెచ్చరిం చింది. రుణ పరిమితి పెంచకపోతే.. అమెరికా ట్రెజరీ విభాగం నిధుల కోసం మరిన్ని బాండ్‌లను జారీచేయడానికి అవకాశం ఉండదు. దీంతో చెల్లింపులను నిలిపేయడం లేదంటే వ్యయాల్లో కోతకు దారితీస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉంది. గడువులోగా అమెరికా రుణ పరిమితి పెంపునకు డెమోక్రాట్లు, రిపబ్లికన్‌ల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేదానిపై అటు విదేశీ, ఇటు దేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నారు.
బ్లూచిప్స్ ఫలితాల వారం..
కంపెనీ ఫలితాల తేదీ
ఆర్‌ఐఎల్ 14న
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15న
టీసీఎస్ 15న
బజాజ్ ఆటో 16న
హెచ్‌సీఎల్ టెక్ 17న
ఎల్‌అండ్‌టీ 18న
Advertisement