రిలయన్స్‌పై చమురు ప్రభావం
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పతన ప్రభావం కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) పై పడింది. ఆర్‌ఐఎల్ నికరలాభం 2014 డిసెంబర్ క్వార్టర్లో 4.5 శాతం క్షీణించి రూ. 5,256 కోట్లకు తగ్గింది. తొమ్మిది త్రైమాసికాల తర్వాత ఈ కంపెనీ లాభం తగ్గడం ఇదే ప్రథమం. 2013 డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ. 5,502 కోట్ల నికరలాభం సంపాదించింది. 2014 సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆర్జించిన రూ. 5,972 కోట్ల నికరలాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో మరింత క్షీణించింది.
కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 7.3 డాలర్లకు పడిపోవడంతో ఆర్‌ఐఎల్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్ క్రూడ్‌ను పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రో ఉత్పత్తుల రూపంలో రిఫైన్ చేసినందుకు వచ్చే లాభాన్ని రిఫైనింగ్ మార్జిన్లుగా వ్యవహరిస్తారు. ఈ మార్జిన్ 2013 డిసెంబర్ క్వార్టర్లో 7.6 డాలర్లు కాగా, 2014 సెప్టెంబర్ క్వార్టర్లో 8.3 డాలర్లు. ముడి చమురు ధరలు పతనం కావడంతో పెట్రో ఉత్పత్తుల కొనుగోలు సెంటిమెంట్ దెబ్బతిందని కంపెనీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ 20.4 శాతం క్షీణించి రూ. 96,330 కోట్లకు తగ్గగా, ఎగుమతులు 21.5 శాతం క్షీణతతో రూ. 58,507 కోట్లకు పడిపోయాయి. 2014 సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే కంపెనీ రుణం రూ. 1,42,084 కోట్ల నుంచి రూ. 1,50,007 కోట్లకు పెరిగింది. కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ. 83,456 కోట్ల నుంచి రూ. 78,691 కోట్లకు తగ్గాయి.
కేజీ డీ-6 క్షేత్రంలో పడిపోయిన ఉత్పత్తి...
సాంకేతిక కారణాలతో కృష్ణాగోదావరి (కేజీ) డీ-6 క్షేత్రంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తి తాజా త్రైమాసికంలో తగ్గింది. 2014 అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ క్షేత్రంలో 5 లక్షల బ్యారళ్ల ముడి చమురు, 38.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువుల ఉత్పత్తి జరిగింది. అయితే కొత్త బావి అయిన ఎంఏ 08లో ఉత్పత్తి పెరగడంతో డీ-6 క్షీణత లోటు కొంతమేర తీరినట్లు కంపెనీ తెలిపింది.
షేల్‌గ్యాస్ వ్యాపారానికి దెబ్బ...
ముడి చమురు ధర ముగిసిన త్రైమాసికంలో 90 డాలర్ల నుంచి 53 డాలర్లకు 40 శాతం క్షీణించిన ఫలితంగా తమ షేల్‌గ్యాస్ వ్యాపారానికి విఘాతం కలిగిందని కంపెనీ పేర్కొంది. షేల్‌గ్యాస్ వ్యాపారంలో 26.4 కోట్ల డాలర్లు పెట్టుబడి చేసినట్లు ఆర్‌ఐఎల్ వివరించింది. కంపెనీ షేల్‌గ్యాస్ వ్యాపారాన్ని అమెరికాలో నిర్వహిస్తోంది.
శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆర్‌ఐఎల్ షేరు ధర 0.5 శాతం పెరుగుదలతో రూ. 869 వద్ద ముగిసింది. కంపెనీ ప్రకటించిన ఫలితాలు వివిధ విశ్లేషణ సంస్థల అంచనాలకు అనుగుణంగానే వున్నాయి.
ముడి చమురు, ఫీడ్‌స్టాక్ ధరలు తగ్గినా, మా నిర్వహణా సామర్థ్యంతో రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు సాధించ గలిగాం. వీటి ప్రభావం వచ్చే 4-6 త్రైమాసికాల్లో కనిపిస్తుంది. - ముకేశ్ అంబానీ
పెరిగిన రిటైల్ ఆదాయం...
అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆదాయం 2014 డిసెంబర్ క్వార్టర్లో అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 18.9 శాతం పెరిగి రూ. 4,686 కోట్లకు చేరింది. ఈ వ్యాపారంలో మార్జిన్లు, లాభదాయకత పెరగడంతో ఆదాయం కూడా వృద్ధిచెందిందని కంపెనీ తెలిపింది. రిటైల్ సబ్సిడరీ లాభం రికార్డుస్థాయిలో 114 శాతం వృద్ధిచెంది రూ. 227 కోట్లకు ఎగిసింది. తాజా త్రైమాసికంలో మరో 15 రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లను ప్రారంభించామని, 100 నగరాలకు రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లను విస్తరించామని కంపెనీ తెలియజేసింది. దేశవ్యాప్తంగా 2,285 రిలయన్స్ రిటైల్ స్టోర్లున్నాయి.