బుల్‌.. కొత్త రికార్డుల్‌ Nifty hits 24000 for the first time: Sensex at record high | Sakshi
Sakshi News home page

బుల్‌.. కొత్త రికార్డుల్‌

Published Fri, Jun 28 2024 5:12 AM | Last Updated on Fri, Jun 28 2024 8:01 AM

Nifty hits 24000 for the first time: Sensex at record high

ర్యాలీకి అధిక  వెయిటేజీ షేర్ల దన్ను 

ఐటీ, ఇంధన షేర్లకు భారీ డిమాండ్‌ 

జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద

ముంబై: ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు వరుసగా మూడో రోజూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. తొలిసారి సెన్సెక్స్‌ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1%, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ 2%, అ్రల్టాటెక్‌ సిమెంట్‌ 5%, ఎన్‌టీపీసీ 3% పెరిగి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు, కాసేపటికే పుంజుకొని తాజా రికార్డులు నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ఇరు సూచీలు సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి.

ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 721 పాయింట్లు ఎగసి 79,396 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి  569 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 219 పాయింట్లు బలపడి 24,087 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 176 పాయింట్లు బలపడి 24,044 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ ఫైనాన్స్, పారిశ్రామిక, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.17 % లాభపడగా, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 83.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్‌ సూచీలు బలహీనంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.  

‘‘జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయి. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి’’ రిలిగేర్‌ బ్రోకింగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.

జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద  
స్టాక్‌ మార్కెట్‌ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. సెన్సెక్స్‌ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆల్‌టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది.  

ర్యాలీ ఇలా
నిఫ్టీ         చేరేందుకు పట్టిన కాలం 
20,000    51 రోజులు 
21,000    60 రోజులు 
22,000    25 రోజులు 
23,000    88 రోజులు 
24,000    25 రోజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement