రిలయన్స్ ర్యాలీ
⇒ 103 పాయింట్ల లాభంతో 28,865కు సెన్సెక్స్
⇒ 19 పాయింట్ల లాభంతో 8,927కు నిఫ్టీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు నేడు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 28,865 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,927 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్ 709 పాయింట్లు లాభపడింది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతుండడం సానుకూల ప్రభావం చూపుతోంది.
ఇంట్రాడేలో 202 పాయింట్లు లాభం...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,822 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. ఇంట్రాడేలో 28,964 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 202 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ చివరకు 103 పాయింట్ల లాభంతో 28,865 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర ప్రపంచ మార్కెట్లలాగానే మన మార్కెట్ కూడా లాభపడుతోందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనజర్(ఈక్విటీస్)కార్తీక్ రాజ్ లక్ష్మణన్ పేర్కొన్నారు. ఐటీ, మీడియా, లోహ, ఫార్మా షేర్లు నష్టపోయాయని, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.
11 షేర్లకు లాభాలు
30 సెన్సెక్స్ షేర్లలో 11 షేర్లు లాభాల్లో, 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం పెరిగింది. ఈ బ్యాంక్ షేర్ 3.9 శాతం లాభపడింది. వొడాఫోన్‌తో విలీనమైన తర్వాత ఏర్పడే కంపెనీలో 15–20 శాతం వాటాను ఆర్థిక సంస్థలకు విక్రయించనున్నారన్న వార్తల కారణంగా ఐడియా సెల్యులర్ 4 శాతం లాభంతో రూ.112 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్ 2.9 శాతం, కోల్ ఇండియా 2.6 శాతం, హీరో మోటొకార్ప్1.1 శాతం, ఎస్‌బీఐ 0.4 శాతం, టాటా మోటార్స్0.2 శాతం లాభపడ్డాయి.
9 ఏళ్ల గరిష్ట స్థాయికి రిలయన్స్
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డేటా సర్వీసులకు చార్జీలు వసూలు చేయడం ప్రారంభించనున్నామని రిలయన్స్ జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రివ్వున దూసుకుపోయింది. 11 శాతం లాభంతో రూ.1,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 11.3 శాతం ఎగసి రూ.1,212ను తాకింది. రిలయన్స్ షేర్ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడడం ఎనిమిదేళ్లలో ఇదే మొదటిసారి. 2009, మే 18న ఈ షేర్ 21 శాతం లాభపడింది. ఎన్నికల్లో యూపీఏ విజ యం సాధించడంతో ఆ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నిమిషానికే 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో ఆ రోజుకు ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపేశారు.
ఆ రోజే మిగిలిన హెవీవెయిట్ షేర్లతో పాటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 21 శాతం లాభపడింది. బుధవారం ఈ షేర్ ధర దాదాపు 9 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ముగిసింది. 2008, మే 29 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. 2008, మే 29న ఈ షేర్ రూ.1,233(సవరించిన ధర–2009, నవంబర్‌లో 26న 1:1 బోనస్ ఇచ్చింది)కు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే.
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే రూ.38,761 కోట్లు పెరిగింది. ఇది మరో టెలికం కంపెనీ ఐడియా సెల్యులర్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దాదాపు సమానం. మొత్తం రూ.3,91,745 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో అతి పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న భారత కంపెనీగా అవతరించింది. మొదటి కంపెనీ టీసీఎస్. ఇక డెరివేటివ్స్ సెగ్మెంట్లో కూడా రిలయన్స్ లాభాల బాట పండించింది.
రూ. 4.3 ధర ఉన్న రూ.1,100 రిలయన్స్ కాల్ ఆప్షన్(ఫిబ్రవరి సిరీస్) రూ.99 లాభంతో రూ.103.40కు ముగిసింది. అంటే రూ.2,050 పెట్టుబడికి రూ.49,450 లాభం వచ్చినట్లు లెక్క. కానీ ఆ కాల్ ఆప్షన్ విక్రయించిన ట్రేడరు అంతే మొత్తాన్ని నష్టపోతారు. కాగా కోటి మంది వినియోగదారులను 170 రోజుల్లోనే సాధించిన రిలయన్స్ జియో వారిలో కనీసం సగం మందినైనా ఏడాది పాటు అట్టిపెట్టుకోగలిగినా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇబిటా బ్రేక్‌ఈవెన్‌కు రాగలదని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.