ర్యాలీకి బ్రేక్-108 పాయింట్లు నష్టం
వరుసగా ఐదురోజులపాటు జరిగిన ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 22,000 స్థాయిని దాటినపుడు, గరిష్టస్థాయిలో ట్రేడవుతున్న షేర్లలో దేశీయ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారు. దాంతో సెన్సెక్స్ 108 పాయింట్లు క్షీణించి 21,826 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో ఈ సూచి 988 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 6,512 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తొలుత బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో నిఫ్టీ 6,562 పాయింట్ల కొత్త గరిష్టస్థాయిని తాకింది.
ఫిబ్రవరి నెలలో ఎగుమతులు తగ్గాయన్న వార్త ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చడంతో హఠాత్తుగా లాభాల స్వీకరణ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మెటల్, ఫార్మా, ఆటో షేర్లు లాభాల ఒత్తిడికి లోనయ్యాయి. చైనా వృద్ధి బలహీనపడిందన్న వార్తలతో ప్రత్యేకించి మెటల్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. టాటా స్టీల్, హిందాల్కో, సేసా స్టెరిలైట్, జిందాల్ స్టీల్ 5.5-2.5 శాతం మధ్య పడిపోయాయి. మారుతి, మహీంద్రా షేర్లు 2-3 శాతం మధ్య క్షీణించగా, సన్‌ఫార్మా 2.5 శాతం తగ్గింది. డీఎల్‌ఎఫ్, టాటా పవర్, గ్రాసిమ్, ఐడీఎఫ్‌సీలు 2-4 శాతం మధ్య పెరిగాయి. బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ 3.44 శాతం క్షీణించగా, రియల్టీ ఇండెక్స్ 2.26 శాతం ఎగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు వారి కొనుగోళ్ల జోరు కొనసాగించి, మరో రూ. 1,471 కోట్లు పెట్టుబడి చేసారు. దేశీయ సంస్థలు ఇందుకు భిన్నంగా 1,331 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.
టాటా స్టీల్‌లో షార్టింగ్, హిందాల్కోలో కవరింగ్....
ప్రధాన మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కోలు రెండూ 4-6 శాతం మధ్య తగ్గినప్పటికీ, ఆ ఫ్యూచర్ కౌంటర్లలో భిన్నమైన ట్రెండ్ కొనసాగింది. టాటా స్టీల్ ఫ్యూచర్‌లో భారీ షార్టింగ్ ఫలితంగా ఆ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో ఒక్కసారిగా 17.96 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 1.67 కోట్ల షేర్లకు పెరిగింది. రూ. 360, రూ. 370 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ రెండు కాల్ ఆప్షన్లలోనూ 6 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. రూ. 350 స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్ కారణంగా ఈ ఆప్షన్ నుంచి 1.14 లక్షల షేర్లు కట్ అయ్యాయి. సమీప భవిష్యత్తులో టాటా స్టీల్ రూ. 360 సమీపంలో తీవ్ర నిరోధాన్ని చవిచూడవచ్చని, రూ. 350 దిగువన ట్రేడ్‌అవుతూవుంటే క్రమేపీ క్షీణించవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.
ఇందుకు భిన్నంగా హిందాల్కో ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్ జరగడంతో 13.72 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.42 కోట్ల షేర్లకు తగ్గింది. రూ. 110 స్ట్రయిక్ వద్ద భారీగా పుట్ రైటింగ్ జరగడంతో 18.72 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ పుట్ ఆప్షన్లో బిల్డప్ 45 లక్షల షేర్లకు చేరగా, రూ. 120 కాల్ ఆప్షన్లో బిల్డప్ స్వల్పంగా 14.46 లక్షల షేర్లకు పెరిగింది. రానున్న రోజుల్లో హిందాల్కో రూ. 110 స్థాయి వద్ద మద్దతు లభించవచ్చని, రూ. 120పైన స్థిరపడితే క్రమేపీ పెరగవచ్చని ఈ డేటా వెల్లడిస్తున్నది.