స్వల్ప లాభాలతో రికవరీ
బ్లూచిప్ షేర్ల పెరుగుదలతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు పెరిగి 28,386 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,476 వద్ద ముగిసింది. ఢిల్లీలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని ప్రభుత్వం పెంచిన సానుకూల పరిణామంతో డీఎల్‌ఎఫ్ తదితర రియల్టీ స్టాక్స్ ఎగిశాయి. అటు వచ్చే నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెలవారీ ముగింపు ముందు రోజున షార్ట్‌కవరింగ్ కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు.
బీఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 4% పెరగ్గా.. విద్యుత్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రియల్టీలో అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, యూనిటెక్ మొదలైన షేర్లు 4-10 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజున 5 శాతం క్షీణించిన ఐటీసీ బుధవారం 2 శాతం మేర పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.