ఒడిదుడుకుల బాటలో
ఆర్‌బీఐ విధాన సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు పలుమార్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు డీలాపడటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు నష్టపోయి 26,597 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 7,959 వద్ద నిలిచింది. కాగా, రోజు మొత్తంలో సెన్సెక్స్ 26,715-26,518 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లు వెలుగులో నిలవగా, మెటల్స్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ నీరసించాయి.
అమెరికా గణాంకాల ఎఫెక్ట్
అమెరికా ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా వెలువడటంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 1-3% మధ్య పుంజుకున్నాయి. వీటికితోడు సన్‌ఫార్మా 3.4% ఎగసింది. అయితే మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఓఎన్‌జీసీ, సెసాస్టెరిలైట్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరోమోటో, కోల్ ఇండియా తదితరాలు 1%పైగా నష్టపోవడంతో మార్కెట్లు బలహీనపడ్డాయి. సెంటిమెంట్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది.