
న్యూఢిల్లీ: ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జోరుగా పెరుగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో 3.5 శాతం లాభంతో ఆల్ టైమ్ హై, రూ.1,190ను తాకిన ఈ షేర్ చివరకు 3.1 శాతం లాభంతో రూ.1,186 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,51,550 కోట్లకు పెరిగింది. దీంతో అతి పెద్ద మార్కెట్ క్యాప్ కంపెనీ అనే ఘనతను మళ్లీ సొంతం చేసుకుంది. రూ.7,43,222 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న టీసీఎస్‌ను అధిగమించి అగ్రస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగబాకింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ.5,75,185 కోట్లు), హిందుస్తాన్ యూనిలీవర్ (రూ.3,74,828 కోట్లు), ఐటీసీ(రూ.3,63,150 కోట్లు)లు నిలిచాయి.
జూలైలో 21 శాతం పెరిగిన షేర్...
ఐదేళ్ల క్రితం అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానాన్ని టీసీఎస్ ఎగరేసుకుపోయింది. తాజాగా ఈ స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ చేజిక్కించుకుంది. ఈ నెల ఆరంభంలోనే 100 బిలియన్ డాలర్ల కంపెనీగా రిలయన్స్ నిలిచింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ టీసీఎస్ షేరు విలువ 28 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 29 శాతం లాభçపడింది. ఇక ఈ నెలలో బీఎస్‌ఈ సెన్సెక్స్6 శాతం లాభపడగా, టీసీఎస్ 4.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్21 శాతం చొప్పున ఎగబాకాయి.