ఓఎన్‌జీసీలోని కొన్ని శక్తుల పనే ఇది: ఆర్‌ఐఎల్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ ఓఎన్‌జీసీ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఘాటుగా స్పందించింది. పదమూడేళ్లుగా కనుగొన్న నిక్షేపాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఓఎన్‌జీసీలోని కొన్ని శక్తులు సంస్థ సీఎండీ కె.సరాఫ్‌ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కనే ఉన్న తమ క్షేత్రం నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను ముకేశ్ అంబానీ సంస్థ చోరీ చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ ఓఎన్‌జీసీ ఈ నెల 15న ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.
‘ఈ ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఓఎన్‌జీసీలోని కొన్ని శక్తులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో సంస్థ సీఎండీని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇదని భావిస్తున్నాం..’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సరాఫ్‌ను తప్పుదోవ పట్టించిన శక్తుల పేర్లను రిలయన్స్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై ఓఎన్‌జీసీ గతేడాది ఆగస్టులో తమను సంప్రదించిన నాటి నుంచీ స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడానికి తాము యత్నిస్తున్నామని తెలిపింది.