56 చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం
న్యూఢిల్లీ: భారత్‌లో మళ్లీ పెద్దయెత్తున చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలానికి రంగం సిద్ధమైంది. కొత్త అన్వేషణ లెసైన్సింగ్ విధానం పదో విడత(నెల్ప్-10)లో కనీసం 56 బ్లాక్‌లను వేలం వేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రే సోమవారమిక్కడ వెల్లడించారు. వచ్చే వారంలో జరగనున్న పెట్రోటెక్ సదస్సులో ఈ క్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నామని చెప్పారు. అయితే, వేలంలో బిడ్‌లకు ఆహ్వాన నోటీసులను ఫిబ్రవరి నెలలో జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకే...
చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టుల విషయంలో సమూలంగా మార్పులు చేసిన నిబంధనలతో ఈ నెల్ప్-10 వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు వివేక్ తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచే సంబంధిత చమురు-గ్యాస్ బ్లాక్‌ల నుంచి ఎంతపరిమాణంలో ప్రభుత్వానికి ఉత్పత్తిలో ఎంత వాటాను ఆఫర్ చేయనున్నారనేది వేలంలో పాల్గొనే కంపెనీలు తమ బిడ్డింగ్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అత్యధిక మొత్తంలో చమురు-గ్యాస్ ఉత్పత్తి వాటాను ఆఫర్ చేసే కంపెనీకే బిడ్డింగ్‌లో బ్లాక్‌లు దక్కుతాయని వివేక్ రే వివరించారు. భవిష్యత్తులో చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన మొత్తం 9 విడతల నెల్ప్ బిడ్డింగ్‌లలో 254 బ్లాక్‌లను వివిధ కంపెనీలకు కేంద్రం కేటాయించింది.
కాగ్ అక్షింతల ప్రభావం...
ప్రస్తుత నిబంధనల ప్రకారం చమురు కంపెనీలు ప్రభుత్వంతో లాభాలను పంచుకోవడానికి ముందే తమ అన్వేషణ, ఉత్పాదక వ్యయాలను రికవరీ చేసుకునే వీలుంది. అయితే ఈ నిబంధనల వల్ల కంపెనీలు తమ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచుకునేలా దారితీస్తోందని, ప్రభుత్వానికి రావాల్సిన లాభాల పంపకంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లో ఆడిటింగ్ సందర్భంగా పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచిచూపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కాగ్ తేల్చిచెప్పింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులకు పెట్రోలియం శాఖ నడుం బిగించింది.
పారదర్శకత పెరుగుతుంది...
‘ఇక నుంచి ఉత్పత్తి పంపకం విధానాన్ని కాకుండా ఆదాయాల పంపకం విధానాన్ని అవలంభించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. దీనివల్ల ఆదాయాలను ముందే రికవరీ చేసుకోవడం, పెట్టుబడులను పెంచిచూపడం వంటి అంశాలకు ఇక తావుండదు. నెల్ప్-10 నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో కేబినెట్ ఆమోదముద్ర కోసం మేం కసరత్తు మొదలుపెట్టాం’ అని వివేక్ వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల విధానం వల్ల మరింత పారదర్శకతతో పాటు కంపెనీల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాల్లో తమ జోక్యం కూడా తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కొత్త నిబంధనల ఖరారుపై కేబినెట్‌దే తుది నిర్ణయమని వివేక్ పేర్కొన్నారు.