Oil and Natural Gas
-
ఆన్‌షోర్..ఆఫ్‌షోర్..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్
కాకినాడ క్రైం: ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, ఎనీవేర్... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్, ఎస్పీఎఫ్, మైరెన్ పోలీస్ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది. సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ కమాండెంట్ ఆఫీసర్ జి.వేణుమాధవ్ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు. అటు పోలీస్‌శాఖ... కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. చమురు లీకై తే... చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్ వేణుమాధవ్ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు. రెండు విధాలుగా శుద్ది... చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్ రెక్కీ’ నిర్వహించారు. అద్భుత పనితీరు... సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్సైజ్ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్, కమాండెంట్ ఆఫీసర్, కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ చమురు చోరీల నివారణకు కార్యాచరణ చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పి, కాకినాడ జిల్లా ప్రత్యేక భద్రత ఏర్పాటు సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. – సుమంత్, మైరెన్ సీఐ -
డీజీహెచ్‌కు ఓఎన్జీసీ ‘కేజీ’ క్షేత్ర ప్రణాళిక ముసాయిదా
న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాకులో 2018-19 నాటికి చమురు, గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థ క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్డీపీ) ముసాయిదాను చమురు రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్‌కు సమర్పించింది. మొట్టమొదటిసారిగా కనుగొన్న నిక్షేపాల్లో రోజుకు 14 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను, 77,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేజీ-డీ5 బ్లాకులోని 12 చమురు, గ్యాస్ నిక్షేపాలను మూడు క్లస్టర్లుగా ఓఎన్జీసీ విడగొట్టింది. ప్రస్తుతం చమురు నిక్షేపాలున్న క్లస్టర్ 2ఏ, గ్యాస్ నిక్షేపాలు ఉన్న 2బీలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి పెట్టిందని, దానికి సంబంధించిన ఎఫ్డీపీనే డీజీహెచ్కి ఇచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. -
ఓఎన్జీసీలోని కొన్ని శక్తుల పనే ఇది: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ ఓఎన్జీసీ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఘాటుగా స్పందించింది. పదమూడేళ్లుగా కనుగొన్న నిక్షేపాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు సంస్థ సీఎండీ కె.సరాఫ్‌ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కనే ఉన్న తమ క్షేత్రం నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను ముకేశ్ అంబానీ సంస్థ చోరీ చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ ఓఎన్జీసీ ఈ నెల 15న ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ‘ఈ ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో సంస్థ సీఎండీని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇదని భావిస్తున్నాం..’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సరాఫ్‌ను తప్పుదోవ పట్టించిన శక్తుల పేర్లను రిలయన్స్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై ఓఎన్జీసీ గతేడాది ఆగస్టులో తమను సంప్రదించిన నాటి నుంచీ స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడానికి తాము యత్నిస్తున్నామని తెలిపింది. -
ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల్లో...టాటా స్టీల్, ఓఎన్జీసీ
న్యూయార్క్: ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలు-టాటా స్టీల్, ఓఎన్‌జీసీలకు చోటు లభించింది. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించింది. వరుసగా ఏడో ఏడాది కూడా యాపిల్ కంపెనీయే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా టాటా స్టీల్, ఓఎన్జీసీలు టాప్ 50లో చోటు సంపాదించలేకపోయాయి. అగ్రశ్రేణి మెటల్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో టాటా స్టీల్ నిలిచింది. గత ఏడాది జాబితాలో ఈ కంపెనీ ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మైనింగ్, ముడి చమురు ఉత్పత్తి కేటగిరిలో పదో స్థానంలో నిలిచిన ఓఎన్జీసీ ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ అగ్రశ్రేణి ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ నిలిచింది. ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 3వ స్థానం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (5వ స్థానం), కోకకోలా(6)లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర కంపెనీలు, నైక్ (13వ స్థానం), ఐబీఎం(16), మైక్రోసాఫ్ట్(24), వాల్‌మార్ట్(28), జేపీ మోర్గాన్ చేజ్(30), గోల్డ్‌మాన్ శాచ్స్(34), ఫేస్బుక్(38), పెప్సికో(42వ స్థానం). -
తక్కువ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు: కేల్కర్
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యయం పెరిగినా, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గిం చినా సంబంధిత కంపెనీలకు ఒరిగేదేమీ లేదని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ సారథ్యంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ‘పెట్రోలియం ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని 2030 నాటికి తగ్గించుకోవడానికి రోడ్‌మ్యాప్’ అనే అంశంపై కేల్కర్ ప్యానెల్ రూపొందించిన నివేదికలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు చేస్తున్న వాదనను కమిటీ సమర్థించినట్లయింది. 2009 ఏప్రిల్‌లో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగా 2010 మార్చి నాటికి ఉత్పత్తి 69.43 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గరిష్ట స్థాయికి చేరింది. బావుల్లో నీరు, బురద రావడంతో తర్వాత ఉత్పత్తి భారీగా తగ్గింది. గత నెలలో ఉత్పత్తి 11 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌పై పలు విమర్శలొచ్చాయి. -
56 చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం
న్యూఢిల్లీ: భారత్‌లో మళ్లీ పెద్దయెత్తున చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలానికి రంగం సిద్ధమైంది. కొత్త అన్వేషణ లెసైన్సింగ్ విధానం పదో విడత(నెల్ప్-10)లో కనీసం 56 బ్లాక్‌లను వేలం వేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రే సోమవారమిక్కడ వెల్లడించారు. వచ్చే వారంలో జరగనున్న పెట్రోటెక్ సదస్సులో ఈ క్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నామని చెప్పారు. అయితే, వేలంలో బిడ్లకు ఆహ్వాన నోటీసులను ఫిబ్రవరి నెలలో జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకే... చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టుల విషయంలో సమూలంగా మార్పులు చేసిన నిబంధనలతో ఈ నెల్ప్-10 వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు వివేక్ తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచే సంబంధిత చమురు-గ్యాస్ బ్లాక్‌ల నుంచి ఎంతపరిమాణంలో ప్రభుత్వానికి ఉత్పత్తిలో ఎంత వాటాను ఆఫర్ చేయనున్నారనేది వేలంలో పాల్గొనే కంపెనీలు తమ బిడ్డింగ్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అత్యధిక మొత్తంలో చమురు-గ్యాస్ ఉత్పత్తి వాటాను ఆఫర్ చేసే కంపెనీకే బిడ్డింగ్‌లో బ్లాక్‌లు దక్కుతాయని వివేక్ రే వివరించారు. భవిష్యత్తులో చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన మొత్తం 9 విడతల నెల్ప్ బిడ్డింగ్‌లలో 254 బ్లాక్‌లను వివిధ కంపెనీలకు కేంద్రం కేటాయించింది. కాగ్ అక్షింతల ప్రభావం... ప్రస్తుత నిబంధనల ప్రకారం చమురు కంపెనీలు ప్రభుత్వంతో లాభాలను పంచుకోవడానికి ముందే తమ అన్వేషణ, ఉత్పాదక వ్యయాలను రికవరీ చేసుకునే వీలుంది. అయితే ఈ నిబంధనల వల్ల కంపెనీలు తమ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచుకునేలా దారితీస్తోందని, ప్రభుత్వానికి రావాల్సిన లాభాల పంపకంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లో ఆడిటింగ్ సందర్భంగా పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచిచూపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కాగ్ తేల్చిచెప్పింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులకు పెట్రోలియం శాఖ నడుం బిగించింది. పారదర్శకత పెరుగుతుంది... ‘ఇక నుంచి ఉత్పత్తి పంపకం విధానాన్ని కాకుండా ఆదాయాల పంపకం విధానాన్ని అవలంభించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. దీనివల్ల ఆదాయాలను ముందే రికవరీ చేసుకోవడం, పెట్టుబడులను పెంచిచూపడం వంటి అంశాలకు ఇక తావుండదు. నెల్ప్-10 నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో కేబినెట్ ఆమోదముద్ర కోసం మేం కసరత్తు మొదలుపెట్టాం’ అని వివేక్ వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల విధానం వల్ల మరింత పారదర్శకతతో పాటు కంపెనీల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాల్లో తమ జోక్యం కూడా తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కొత్త నిబంధనల ఖరారుపై కేబినెట్‌దే తుది నిర్ణయమని వివేక్ పేర్కొన్నారు.