రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు | Reliance Industries Q4 PAT up 2.3% at Rs 5630 crore, in line with estimates | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు

Published Sat, Apr 19 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు

Reliance Industries Q4 PAT up 2.3% at Rs 5630 crore, in line with estimates

గత ఆర్థిక సంవత్సరం రిలయన్స్‌కు కు చాలా సంతృప్తికరంగా సాగింది. జీఆర్‌ఎంలు భారీగా పుంజుకోవడంతో రిఫైనింగ్ వ్యాపారంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయి లాభాలను ఆర్జించగలిగాం. పాలిమర్స్, వీటి ఉత్పత్తుల అమ్మకం మార్జిన్లు పెరగడంతో పెట్రోకెమికల్స్‌లో లాభాలు కూడా భారీగా వృద్ధిచెందాయి. దేశీయంగా చమురు-గ్యాస్ ఉత్పత్తిలో కొన్ని సాంకేతికపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదుచేసుకుంది. రిటైల్ వ్యాపారం విషయానికొస్తే దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించాం. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతోకూడిన 4జీ టెలికం సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తును వేగవంతం చేశాం. - ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ సీఎండీ
 
 న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) గడచిన రెండేళ్లకు పైగా కాలంలో అత్యధిక స్థాయిలో త్రైమాసిక లాభాన్ని ఆర్జించింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2013-14, జనవరి-మార్చి-క్యూ4)లో రూ.5,631 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,589 కోట్లతో పోలిస్తే లాభం నామమాత్రంగానే(0.8 శాతం) వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో 13 శాతం పెరుగుదలతో రూ.97,807 కోట్లకు ఎగసింది. కాగా, 2012-13 క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ 54.2 స్థాయిలో ఉండగా.. 2013-14 క్యూ4లో రూపాయి సగటు విలువ 61.8గా ఉంది. రూపాయి భారీ క్షీణత కూడా కంపెనీ రాబడులు పుంజుకోవడానికి దోహదం చేసింది.

 జీఆర్‌ఎంల జోరు...
 మార్చి క్వార్టర్‌లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం-ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేయడం ద్వారా వచ్చే రాబడి) మెరుగైన రీతిలో 9.3 డాలర్లుగా నమోదైంది. అంతక్రితం క్వార్టర్(క్యూ3)లో 7.6 డాలర్లతో పోలిస్తే 1.7 డాలర్లు(22 శాతం) ఎగబాకింది. అయితే, క్రితం ఏడాది క్యూ4లో నమోదైన 10.1 డాలర్లతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం.

 సీక్వెన్షియల్‌గా చూస్తే...
 2013-14 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,511 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో లాభం 2.2 శాతం మేర పెరిగింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.1.03 లక్షలతో పోలిస్తే 8 శాతం తగ్గింది.
 పూర్తి ఏడాదికి ఇలా...: గతేడాది(2013-14) రిలయన్స్ నికర లాభం రూ.21,984 కోట్లుగా నమోదైంది. దేశంలోని ఒక ప్రైవేటు రంగ కంపెనీ ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక లాభంగా నిలిచింది. 2012-13 ఏడాదిలో ఆర్జించిన రూ.21,003 కోట్లతో పోలిస్తే 4.7% పెరిగింది. మొత్తం ఆదాయం కూడా పూర్తి ఏడాదికి 8.1% పెరుగుదలతో రూ.4,01,302 కోట్లకు వృద్ధి చెందింది. ఇది కూడా రికార్డు గరిష్టస్థాయి. అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.3,71,119 కోట్లు.
 
 అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భావం..
 రిలయన్స్ రిటైల్... దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించిందని ఆర్‌ఐఎల్ ప్రకటించింది. 2013-14 పూర్తి ఏడాదికి రిటైల్ వ్యాపార విభాగం రూ.363 కోట్ల పన్ను ముందు(ఎబిటా) లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.14,496 కోట్లకు ఎగబాకింది. గతేడాది అన్ని విభాగాల్లో కలిపి కొత్తగా 225 రిటైల్ సోర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతో మార్చి చివరినాటికి రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 146 నగరాల్లో 1,691కి చేరింది. కాగా, మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో సంస్థ ఆదాయం 19.27% వృద్ధితో రూ.3,051 కోట్ల నుంచి రూ.3,639 కోట్లకు పెరిగింది.
 
 ఇతర ముఖ్యాంశాలివీ...
 పెట్రో కెమికల్స్ వ్యాపార విభాగం లాభం క్యూ4లో రూ.2,096 కోట్లకు పెరిగింది. అంతక్రిత ఏడాది ఇదే కాలంలో రూ.1,895 కోట్లతో పోలిస్తే 10.6 శాతం ఎగసింది.

 చమురుశుద్ధి(రిఫైనింగ్) విభాగం లాభం రూ.3,520 కోట్ల నుంచి రూ.3,954 కోట్లకు చేరింది. 12.3 శాతం పెరిగింది.

 అయితే, చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం లాభం మాత్రం 17.8 శాతం దిగజారి రూ.460 కోట్ల నుంచి రూ.378 కోట్లకు పడిపోయింది.

ఆదాయం కూడా రూ.1,597 కోట్ల నుంచి రూ.1,417 కోట్లకు క్షీణించింది. అంటే 11.2 శాతం తగ్గింది. ప్రధానంగా కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి భారీగా దిగజారడమే దీనికి కారణంగా నిలిచింది. భౌగోళికపరమైన అడ్డంకులతోపాటు అంచనాకంటే బావుల్లోకి అధికంగా నీరుచేరడం ఇతరత్రా సమస్యలు గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయేలా చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

క్యూ4లో షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.17.3 నుంచి స్వల్పంగా రూ.17.4కు చేరింది. పూర్తి ఏడాదికి చూస్తే... రూ.65.8 నుంచి రూ.68కి వృద్ధి చెందింది.

 ఇతర ఆదాయం క్యూ4లో రూ.2,040 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇది రూ.2,240 కోట్లుగా ఉంది.

 గత ఆర్థిక సంవత్సరంలో జామ్‌నగర్‌లోని జంట రిఫైనరీల నుంచి 41.1 బిలియన్ డాలర్ల పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది ఇది 39.3 బిలియన్ డాలర్లు.

మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.89,968 కోట్లకు పెరిగిపోయింది. క్రితం ఏడాది మార్చి ఆఖరికి రూ. 72,427 కోట్లు మాత్రమే రుణభారం ఉండటం గమనార్హం.

 ఇక మార్చి చివరికల్లా రిలయన్స్ వద్ద మొత్తం రూ.88,190 కోట్ల నగదు తత్సంబంధ నిల్వలు ఉన్నాయి.

 ఒక్కో షేరుకి రూ.9.50 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.

 కంపెనీ షేరు ధర గురువారం(శుక్రవారం స్టాక్ మార్కెట్ టేడ్రింగ్ సెలవు) 1.88 శాతం పెరిగి రూ.959 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement