న్యూఢిల్లీ: మొండిబాకీల పరిస్థితి మెరుగుపడినప్పటికీ... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్ నికర లాభం 43 శాతం మేర క్షీణించింది. క్యూ1లో రూ.144.34 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ1లో ఇది రూ.254.69 కోట్లు. తాజాగా తొలి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 3,510 కోట్ల నుంచి రూ. 3,936 కోట్లకు పెరిగింది. మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ ఏకంగా రూ. 423 కోట్ల నుంచి రూ. 659 కోట్లకు పెరిగింది.
ఇందులో నికార్సుగా ఎన్‌పీఏల కోసం కేటాయించినది రూ.548 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వీటికి ప్రొవిజనింగ్ రూ.411 కోట్లు. మరోవైపు, జూన్ త్రైమాసికంలో స్థూల మొండిబాకీలు 7.3 శాతం నుంచి 6.19 శాతానికి, నికర ఎన్‌పీఏలు 5.24 శాతం నుంచి 4.10 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో విజయా బ్యాంకు షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 52.15 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment