ఆరు నెలలుగా భారీ వెనుకడుగు
ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్‌పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్‌పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి.
ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్‌పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్‌పీఏలు ఉన్నాయి.
► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
► రాబోయే ఆరు నెలల్లో ఎన్‌పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి.
► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది.
► ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment