
‘ఎంఅండ్‌ఈ’ మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటా
2024పై ఫిక్కీ–ఈవై నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్‌ఈ) అతి పెద్ద సెగ్మెంట్‌గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్‌ఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్‌ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్‌ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది.
వినూత్న వ్యాపార విధానాల దన్ను..
ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్‌ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయాలు తగ్గడం, భారత్‌కి యానిమేషన్.. వీఎఫ్‌ఎక్స్ ఔట్‌సోర్సింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్ వెబ్‌సైట్లు సహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్ అవుటాఫ్ హోమ్ (ఓఓహెచ్) మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి.
డిజిటల్ మీడియా (17 శాతం) లైవ్ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ (మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీ) కెవిన్ వాజ్ చెప్పారు. దీనితో కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.