EY survey
-
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం.. కారణాలివీ.. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు. డీల్స్ వెనకడుగు ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రణాళికలున్నాయి. మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం. -
ఎట్టకేలకు శుభవార్త: కంపెనీ బోర్డుల్లో పెరుగుతున్న మహిళలు
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో (2013-2022) 18 శాతానికి చేరుకుంది. 2013లో ఇది 6 శాతంగా ఉండేది. 4,500 మంది పైచిలుకు డైరెక్టర్లు ఉన్న నిఫ్టీ 500 కంపెనీలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కంపెనీల చట్టంలో తప్పనిసరి చేసిన ఫలితంగానే బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది. నిఫ్టీ 500లోని 95 శాతం కంపెనీల బోర్డుల్లో ఒక మహిళ ఉన్నారని వివరించింది. అయితే, మహిళా చైర్పర్సన్లు ఉన్న కంపెనీల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని పేర్కొంది. బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై కంపెనీలు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. ప్రయత్నాలు అంత వేగంగా పురోగమించడం లేదని వివరించింది. చారిత్రకంగా చూస్తే భారతీయ సంస్థల బోర్డుల్లోని మహిళలకు ఎక్కువగా ఫిర్యాదుల పరిష్కారం, కార్పొరేట్ సోషల్ రెస్పాŠిన్సబిలిటీ (సీఎస్ఆర్) కమిటీల్లోనే చోటు దక్కుతూ వస్తోందని.. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందని ఈవై తెలిపింది. వేదికలో మరిన్ని విశేషాలు.. ♦ 24 శాతం మంది మహిళలతో లైఫ్ సైన్సెస్ రంగ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. మీడియా, వినోద రంగంలో ఇది 23 శాతంగా ఉంది. ఇక కన్జూమర్ ఉత్పత్తులు.. రిటైల్ రంగ కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంగా ఉంది. అత్యధికంగా మహిళా సిబ్బంది (34 శాతం) ఉన్న టెక్నాలజీ (ఐటీ, ఐటీఈఎస్) పరిశ్రమలో కూడా ఇది 20 శాతంగానే ఉంది. ♦ ఎనర్జీ, యుటిలిటీస్ రంగ (చమురు, గ్యాస్, విద్యుత్ మొదలైనవి) కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 2017 నుంచి ఒకే స్థాయిలో 15 శాతంగా స్థిరంగా ఉంది. ఇంధన రంగంలో కేవలం 600 మంది మహిళలు మాత్రమే మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ హోదాల్లో ఉన్నారు. ♦ అంతర్జాతీయంగా చూస్తే కంపెనీల బోర్డుల్లో 44.5 శాతం మహిళల ప్రాతినిధ్యంతో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది. స్వీడన్ (40 శాతం), నార్వే (36.4 శాతం), కెనడా (35.4 శాతం), బ్రిటన్ (35.3 శాతం), ఆస్ట్రేలియా (33.5 శాతం), అమెరికా (28.1 శాతం), సింగపూర్ (20.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు.