ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం..
కారణాలివీ..
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్‌నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు.
డీల్స్ వెనకడుగు
ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రణాళికలున్నాయి.
మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment