private equity investments
-
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం.. కారణాలివీ.. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు. డీల్స్ వెనకడుగు ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రణాళికలున్నాయి. మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్‌హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్‌హౌసింగ్‌కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్‌హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి. 2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్‌లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి. -
రియల్టీలోకి తగ్గిన పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల రాక తగ్గింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు (రూ.32,000 కోట్లు) పెట్టుబడులుగా వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో పీఈ పెట్టుబడులు 6.3బిలియన్ డాలర్లతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. ఈ మేరకు అనరాక్ క్యాపిటల్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2019–20లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు 5.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2018–19లో రూ.5.6 బిలియన్ డాలర్లు, 2017–18లో 5.4 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. కరోనా రెండో విడత వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో పీఈ పెట్టుబడులు తగ్గడానికి కారణమని ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ టీకాలను విస్తృతం గా ఇవ్వడానికితోడు, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతో రియల్టీలోకి పీఈ పెట్టుబడుల రాక పుంజుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోకి ఎక్కువ.. ‘‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మొత్తం పీఈ పెట్టుబడుల్లో 80 శాతం ఈక్విటీయే. 2021–22లో అత్యధికంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ పరిశ్రమ పీఈ పెట్టుబడులను ఆకర్షించింది. 38 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోకే వెళ్లాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 22 శాతం, నివాస గృహ ప్రాజెక్టులు 14 శాతం చొప్పున పెట్టుబడులు ఆకర్షించాయి. దేశీయ ఫండ్స్ పెట్టుబడులు 2020–21లో 290 మిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021–22లో 600 మిలియన్ డాలర్లకు పెరిగాయి. కరోనా ఇబ్బందుల తర్వాత నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ఫండ్స్ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి’’అని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. -
అమ్మకానికి ఏఐజీ హాస్పిటల్.. రంగంలోకి గోల్డ్‌మన్ శాక్స్
దేశంలోనే అతి పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హస్పిటల్గా పేరొందిన ఏషియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో వాటాల విక్రయానికి ప్రమోటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు వాటాల విక్రయం పనులు నిర్వహించేందుకు అంతర్జాతీయ సంస్థ గోల్డ్మన్శాక్స్కు అప్పగించారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ వార్తా కథనం ప్రచురించింది. వాటాల విక్రయానికి రెడీ ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డి ఏఐజీ ఆస్పత్రికి ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో సోమాజిగూడలో 300 పడకలు గచ్చిబౌలిలో 800 పడకలతో రెండు ఆస్పత్రులు ఉన్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో క్వాడ్రియా క్యాపిటల్ సంస్థకి 30 శాతం వాటాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రమోటర్లు తమ వంతు వాటాల విక్రయానికి సిద్ధమైనట్ట్టు సమాచారం. రూ.5,000 కోట్లు ప్రమెటర్లు తమ వాటాల్లో 60 నుంచి 70 శాతం వరకు విక్రయించి 30 నుంచి 40 శాతం వాటాలు అట్టి పెట్టుకోవచ్చని ఈటీ కథనంలో పేర్కొంది. ఈ వాటాల విక్రయం డీల్ విలువ రూ. 5000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఆసక్తి చూపిస్తున్నారు ఏఐజీ ఆస్పత్రిలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థలు కార్లే, టీపీజీ, టెమాసెక్, బేరింగ్ పీఈ ఏషియా సంస్థలు రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వాటాల అమ్మకానికి సంబంధించి ఇటు ప్రమోటర్లు కానీ అటు ప్రైవేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మౌలిక సదుపాయాలు వైద్యపరంగా మౌలిక వసతులకు సంబంధించి ఇండియా చాలా వెనుకబడి ఉంది. ప్రతీ పది వేల మందికి 5 బెడ్లు 8 మంది డాక్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా 155వ స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఆర్బీఐ సైతం ఆస్పత్రులకు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వాలంటూ సూచించింది. సమాంతరంగా ప్రైవటే ఈక్విటీ సంస్థలు నిధులు గుమ్మరించేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆస్పత్రుల ప్రమోటర్లు సైతం విస్తరణ బాట పట్టారు. అందులో భాగంగా వాటా విక్రయాలు చేస్తున్నారు. చదవండి: Wipro: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..! -
రియల్ ఎస్టేట్ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో(క్యూ1) హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్ రంగంలోకి 143 మిలియన్ డాలర్లు(రూ.1,000 కోట్లు), నివాస విభాగంలోకి 11 (రూ.80 కోట్లు) మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్సీఆర్ నగరాల్లో 3.15 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. మన నగరంలో 18 లక్షల చ.అ. రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2011 జనవరి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో హైదరాబాద్ రియల్టీలోకి 16 డీల్స్ ద్వారా 2,866 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2021 క్యూ1లో దేశవ్యాప్తంగా 19 డీల్స్ ద్వారా డెట్, ఈక్విటీ రూపంలో 3,241 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇందులో 71 శాతం ఆఫీస్ స్పేస్‌లోకి, 15 శాతం రిటైల్, 7 శాతం నివాసం, 7 శాతం గిడ్డంగుల విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. 2020 క్యూ1లో దేశీయ రియల్టీలోకి 199 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏడాదిలో 16 రెట్లు ఎక్కువ. విలువల పరంగా చూస్తే.. 2021 క్యూ1 పీఈ పెట్టుబడులు గతేడాదిలో 80 శాతం, అంతకుక్రితం సంవత్సరంలో 48 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ1లో రెసిడెన్షియల్లో 7 డీల్స్ ద్వారా 234 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఆఫీస్ స్పేస్‌లోకి 6 డీల్స్ ద్వారా 2,148, రిటైల్‌లో ఒక్క డీల్‌తో 484, వేర్‌హౌస్‌లో 4 డీల్స్ ద్వారా 216 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. క్యూ1లో వచ్చిన పెట్టుబడులను దేశాల వారీగా చూస్తే.. కెనడా నుంచి అత్యధికంగా 915 మిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 830, సింగపూర్ నుంచి 341, మన దేశం నుంచి 62 మిలియన్ డాలర్లు వచ్చాయి. -
ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు
సాక్షి, బెంగళూరు : ఇయర్ ఫోన్స్, స్పీకర్లు తదితర ఉత్పత్తులను విక్రయించే కన్జూమర్ బ్రాండ్ బోట్(బీవోఏటీ) తాజాగా 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) నిధులను అందుకుంది. గ్లోబల్ పీఈ కంపెనీ వార్బర్గ్ పింకస్ తాజాగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఆన్లైన్ బ్రాండ్ కంపెనీ బోట్ విలువ 30 కోట్ల డాలర్లను(రూ. 2,200 కోట్లు) తాకినట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. కన్జూమర్ బ్రాండ్లను విక్రయించే బోట్ ప్రధానంగా చైనా తదితర విదేశీ కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా లభించిన నిధులతో దేశీయంగా తయారీని పటిష్ట పరచుకోవడంతోపాటు.. వృద్ధి అవకాశాలను పెంచుకునేందుకు వినియోగించనున్నట్లు బోట్ ప్రమోటర్లు అమన్ గుప్తా, సమీర్ మెహతా వెల్లడించారు. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాభాల ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకానికి అనుగుణంగా ప్రొడక్టులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు బోట్ ప్రమోటర్లు తెలియజేశారు. దేశీయంగా స్మార్ట్ వేరబుల్స్ ప్రొడక్టులను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దేశీ తయారుదారులకు పీఎల్ఐ పథకం పోటీ నుంచి రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉన్నామని, రెండు.. మూడు త్రైమాసికాలలోగా మేడిన్ ఇండియా ప్రొడక్టులను విడుదల చేయగలమని వెల్లడించారు. ఔట్సోర్సింగ్, సొంత తయారీ ద్వారా 50-60 శాతం ప్రొడక్టులను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. కోవిడ్-19, సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా నుంచి ప్రొడక్టుల దిగుమతులకు విఘాతం ఏర్పడినట్లు తెలియజేశారు. కాగా.. ఇవే ప్రతికూలతలతో ఇటీవల ఐవేర్ ప్రొడక్టుల సంస్థ లెన్స్‌కార్ట్ సైతం దేశీ తయారీవైపు దృష్టి సారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్) రూ. 1,000 కోట్లు 2020 మార్చితో ముగిసిన గతేడాదిలో బోట్ రూ. 700 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేయగలదని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియాలో ఆన్లైన్ బ్రాండుగా ప్రారంభమైన బోట్ నాణ్యతగల ఉత్పత్తులతో వేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. వినియోగదారులకు చేరువయ్యే బాటలో సొంత ప్లాట్‌ఫామ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా 20 శాతం అమ్మకాలను సాధిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ తొలినాళ్లలో 30 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఫైర్‌సైడ్ వెంచర్స్ కొంతమేర వాటాను వార్‌బర్గ్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడుల భారీ క్షీణత
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్‌లో 2020 జనవరి–ఆగస్టు మధ్య ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీగా పడిపోయాయి. 2019 ఇదే కాలంతో పోల్చిచూస్తే ఈ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ 85 శాతం పడిపోయి 866 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు)గా నమోదయ్యింది. 2019 ఇదే కాలంలో ఈ పెట్టుబడుల విలువ 5,795 మిలియన్ డాలర్లు. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలు మరింత దెబ్బతీశాయి. కోలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ నివేదిక ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ‘భవిష్యత్ భారత్: ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు, వ్యూహాత్మక చర్యలు’ అన్న పేరుతో రూపొందిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతాన్ని డేటా సెంటర్స్ విభాగం ఆకర్షించింది. ► ఆఫీస్ సెగ్మెంట్ విషయంలో ఇది 24 శాతంగా ఉంది. విలువలో దాదాపు రూ.1,500 కోట్లు. ► ఇండస్ట్రియల్ విభాగం వాటా 12 శాతం. ► ఆతిధ్య రంగం వాటా 9 శాతం. ► హౌసింగ్, రెంటల్ హౌసింగ్ విభాగానిది 8 శాతం అయితే, కో–లివింగ్ వాటా ఒకశాతం. ► కోవిడ్–19 నేపథ్యంలో ఇటు దేశీయ, అటు విదేశీ ఇన్వెస్టర్లు భారత్ రియల్టీలో పెట్టుబడుల పట్ల అత్యంత జాగరూకతను ప్రదర్శిస్తున్నారు. ► పారిశ్రామిక, రవాణా విభాగాలకు సంబంధించి రియల్టీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న వినియోగ డిమాండ్ ఆయా విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ► క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారిస్తే, ప్రతిఫలాలు ఉంటాయి. ► చౌక ధరలు, ఒక మోస్తరు ఖర్చుతో నిర్మిస్తున్న నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ► ఆతిధ్య రంగం, రిటైల్ రియల్ ఎస్టేట్ విభాగాల్లో అవకాశాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. ► రియల్టీలో మందగమనం ఉన్నప్పటికీ, మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. -
దివాలా అంచుల్లో థామస్ కుక్
లండన్: బ్రిటిష్ పర్యాటక సంస్థ, థామస్ కుక్ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్ కుక్కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం... కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్ కుక్ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్ కుక్ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్ఎస్ఏ(ట్రాన్స్పోర్ట్ శాలరీడ్ స్టాఫ్స్ అసోసియేషన్) కోరుతోంది. మోనార్క్ ఎయిర్‌లైన్స్ మునిగిపోయినప్పుడు.. ప్రస్తుతం థామస్ కుక్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. బ్రెగ్జిట్, ఆన్లైన్ పోటీతో భారీగా నష్టాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. -
కేర్ గ్రూప్‌లోకి నిధుల జోరు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ సేవల రంగంలో అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ తర్వాత దేశంలోనే మూడో స్థానంలో ఉన్న క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్(కేర్ హాస్పిటల్స్) సంస్థ విలీనాలు, కొనుగోళ్ల మార్గం ద్వారా విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కొత్త హాస్పిటళ్ల ఏర్పాటు కోసం ఆయా ప్రాంతాల్లో స్థానికంగా బలంగా ఉండే సంస్థలతో కలిసి కేర్ హాస్పిటల్స్ విస్తరించనుంది. ఇనార్గానిక్ గ్రోత్ అంటే కొత్త సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవటం ద్వారా వృద్ధి సాధించాలన్నది సంస్థ వ్యూహం. అడ్వెంట్ ఇండియా పీఈ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేర్ హాస్పిటల్స్‌కు 15-20 మిలియన్ డాలర్ల మేర (రూ.90-120 కోట్లు) విస్తరణ నిధులను సమకూర్చేందుకు తాజాగా పచ్చ జండా ఊపినట్లు తెలిసింది. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నారనే అంశాన్ని వెల్లడించేందుకు అడ్వెంట్ సంస్థ నిరాకరించింది. సాక్షి ప్రతినిధి ప్రశ్నకు ఈ మెయిల్ ద్వారా సమాధానమిస్తూ ‘‘ఈ విషయంపై మేం వ్యాఖ్యానించదలచుకోలేదు’’అని అడ్వెంట్ ఇండియా పీఈ అడ్వైజర్స్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో అడ్వెంట్ సంస్థ 30 హెల్త్‌కేర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. 2012లో అడ్వెంట్ సంస్థ కేర్ హాస్పిటల్స్‌లో 110 మిలియన్ డాలర్లు (రూ. 560 కోట్లు) ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదనపు పెట్టుబడుల కోసం పీఈ ఫండ్స్‌తో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు తుది దశలో వున్నాయని కేర్ సంస్థల గ్రూప్ సీఈఓ దిలీప్ జోస్ సాక్షికి తెలిపారు. కొత్త హాస్పిటల్స్ టేకోవర్లు, విలీనాల ద్వారా వేగంగా కేర్‌ను విస్తరించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేర్ హాస్పిటల్స్ ప్రస్తుతం వైజాగ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, నాగపూర్, సూరత్, పుణె, హైదరాబాద్‌లలో మొత్తం 12 హాస్పిటళ్లను నిర్వహిస్తోంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా నాలుగు హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో గచ్చిబౌలి ప్రాంతంలో 250 పడకల హాస్పిటల్ నిర్మాణంతో పాటు భువనేశ్వర్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ నెలకొల్పనున్నారు. కేర్ హాస్పిటల్స్‌లో మొత్తం 2200 పడకల సామర్ధ్యం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. వచ్చే మూడేళ్లలో దీన్ని 3500 పడకల సామర్థ్యానికి తీసుకుపోవాలన్నది సంస్థ లక్ష్యం. స్టెంట్ల తయారీ యూనిట్ కోసం...: హృద్రోగ చికిత్సలో పేరుగాంచిన కేర్ హాస్పిటల్స్ స్వంతంగా స్టెంట్ల తయారీ కోసం రెలిసెస్ మెడికల్ డివెసైస్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. రెండో దశలో ఈ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేట్ ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత కేటాయిస్తారు. ఈ యూనిట్కోసం మొదటి దశలో కేర్ యాజమాన్యం రూ. 40 కోట్లు ఈక్విటీగానూ, రూ. 30 కోట్లు రుణాల రూపేణ సమకూర్చారు. పేషంట్లకు అమర్చే స్టెంట్ల తయారీలో రెలిసెస్ మెడికల్ డివెసైస్ నాణ్యతా పరంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండటంతో దేశీయంగా ఫోర్టిస్, మ్యాక్స్, జయదేవ్ సంస్థలు ఈ ఉత్పత్తిని వినియోగిస్తున్నాయి. టర్కీతోపాటు మరికొన్ని దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. -
రియల్టీలో పీఈ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఓవైపు ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ రియల్టీ రంగానికి సంబంధించి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు పుంజుకున్నాయి. ఈ ఏడాది(2013) తొలి తొమ్మిది నెలల కాలం(జనవరి-సెప్టెంబర్’13)లో 26% అధికంగా రూ. 4,716 కోట్ల(75.5 కోట్ల డాలర్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. ఆఫీస్ బిల్డింగ్‌ల ద్వారా లభిస్తున్న లీజు సంబంధిత ఆదాయం ఇందుకు కారణంగా నిలిచినట్లు రియల్టీ గ్లోబల్ కన్సల్టెంట్ సంస్థ కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ పేర్కొంది. దీంతో దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పుంజుకున్నాయని వివరించింది. కాగా, గతేడాది అంటే 2012 తొలి మూడు క్వార్టర్లలో ఈ పెట్టుబడులు రూ. 3,750 కోట్లు(70.4 కోట్ల డాలర్లు) మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ లభించిన పెట్టుబడుల్లో 65% అంటే రూ. 3,078 కోట్లు(49.3 కోట్ల డాలర్లు) కేవలం మూడో క్వార్టర్(జూలై-సెప్టెంబర్’13)లోనే లభించినట్లు వెల్లడిం చింది. వీటిలో ఆఫీస్ విభాగంలో పెట్టుబడులు రెట్టింపై రూ. 2,476 కోట్లకు చేరగా, గృహ విభాగంలో 11% క్షీణించి రూ. 2,240 కోట్లకు పరిమిత మయ్యాయి.