దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌ | British travel agency Thomas Cook in talks with UK government | Sakshi
Sakshi News home page

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

Published Mon, Sep 23 2019 2:25 AM | Last Updated on Mon, Sep 23 2019 4:44 AM

British travel agency Thomas Cook in talks with UK government - Sakshi

లండన్‌: బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది.  ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్‌ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్‌ కుక్‌కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది.  

తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం...
కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్‌ కుక్‌ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్‌ కుక్‌ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్‌ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల  సంఘం, టీఎస్‌ఎస్‌ఏ(ట్రాన్స్‌పోర్ట్‌ శాలరీడ్‌ స్టాఫ్స్‌ అసోసియేషన్‌) కోరుతోంది.  

మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ మునిగిపోయినప్పుడు..
ప్రస్తుతం థామస్‌ కుక్‌ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్‌ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి.  

బ్రెగ్జిట్, ఆన్‌లైన్‌ పోటీతో భారీగా నష్టాలు...
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది. బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా సమ్మర్‌ హాలిడే బుకింగ్స్‌ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement