న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల రాక తగ్గింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు (రూ.32,000 కోట్లు) పెట్టుబడులుగా వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో పీఈ పెట్టుబడులు 6.3బిలియన్ డాలర్లతో పోలిస్తే 32 శాతం తగ్గాయి. ఈ మేరకు అనరాక్ క్యాపిటల్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2019–20లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు 5.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
2018–19లో రూ.5.6 బిలియన్ డాలర్లు, 2017–18లో 5.4 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. కరోనా రెండో విడత వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో పీఈ పెట్టుబడులు తగ్గడానికి కారణమని ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ టీకాలను విస్తృతం గా ఇవ్వడానికితోడు, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతో రియల్టీలోకి పీఈ పెట్టుబడుల రాక పుంజుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోకి ఎక్కువ..
‘‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మొత్తం పీఈ పెట్టుబడుల్లో 80 శాతం ఈక్విటీయే. 2021–22లో అత్యధికంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ పరిశ్రమ పీఈ పెట్టుబడులను ఆకర్షించింది. 38 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోకే వెళ్లాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 22 శాతం, నివాస గృహ ప్రాజెక్టులు 14 శాతం చొప్పున పెట్టుబడులు ఆకర్షించాయి. దేశీయ ఫండ్స్ పెట్టుబడులు 2020–21లో 290 మిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021–22లో 600 మిలియన్ డాలర్లకు పెరిగాయి. కరోనా ఇబ్బందుల తర్వాత నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ఫండ్స్ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి’’అని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment