న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్‌హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్‌హౌసింగ్‌కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్‌హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి.
2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్‌లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్‌సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment