న్యూఢిల్లీ: దేశంలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల నుంచి గోదాములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంత్సరంలో (2022–23) ఎనిమిది ప్రధాన పట్టణాల్లో రికార్డు స్థాయిలో గోదాముల లీజు పరిమాణం 51.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా భారత వేర్ హౌసింగ్ (గోదాములు) మార్కెట్‌పై మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.
ఎనిమిది పట్టణాలకు గాను ఏడుపట్టణాల్లో గోదాముల అద్దె 3–8 శాతం మధ్య పెరిగింది. తయారీ/అసెంబ్లింగ్ కోసం పారిశ్రామిక రంగం నుంచి కూడా గిడ్డంగులకు డిమాండ్‌ను పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం 2022–23లో గోదాముల మొత్తం లీజు పరిమాణం 5,13,24,201 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2021–22లో ఇది 5,12,94,933 చదరపు అడుగులుగానే ఉండడం గమనార్హం. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో గోదాముల లీజు డిమండ్ పెరగ్గా, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మార్కెట్లలో తగ్గింది.
హైదరాబాద్‌లో డౌన్
హైదరాబాద్‌లో గోదాముల లీజు పరిమాణం 2022–23లో 7 శాతం తగ్గి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో అత్యధికంగా 25 శాతం మేర లీజు పరిమాణం పెరిగింది. 7.4 మిలియన్ దరపు అడుగులకు చేరింది. ఆ తర్వాత కోల్‌కతాలో 18 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 5 శాతం తగ్గి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా, పుణెలో 2 శాతం తక్కువగా 74 మిలియన్ చదరపు అడుగులుగా, చెన్నైలో 11 శాతం క్షీణించి 4.5 మిలియన్ చదరపు అడుగులుగా, అహ్మదాబాద్‌లో 29 శాతం పడిపోయి 3.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
అత్యధికంగా లాజిస్టిక్స్ రంగం 39 శాతం లీజుకు తీసుకుంది. రిటైల్ రంగం వాటా 13 శాతంగా ఉంటే, తయారీ, ఇతర రంగాల వాటా 30 శాతంగా ఉంది. ఈ కామర్స్ సంస్థల వేర్‌హౌసింగ్ లీజు పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. కరోనా సంక్షోభ సమయంలో ఎక్కువ సామర్థ్యాలను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2021–22లో గోదాముల్లో ఈ కామర్స్ రంగం లీజు వాటా 23 శాతంగా ఉంటే, 2022–23లో 7 శాతానికి పరిమితమైంది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మొత్తం 412 మిలియన్ చదరపు అడుగుల వేర్ హౌసింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఇందులో 12 శాతం ఖాళీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment