Realty sector
-
ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..
దేశవ్యాప్తంగా 30 ద్వితీయ శ్రేణి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జులై–సెప్టెంబర్‌లో 41,871 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 13 శాతం తగ్గాయని ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ఈ క్షీణతకు కారణం అని వివరించింది.నివేదికలోని వివరాల ప్రకారం..కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 34 శాతం క్షీణించింది. మొత్తం విక్రయాల్లో అహ్మదాబాద్, వడోదర, గాందీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌తో కూడిన వెస్ట్ జోన్ వాటా 72 శాతం ఉంది. తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానుల్లో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్ మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు‘ద్వితీయ శ్రేణి నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి పెద్దగా అనుకూలించవు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా వృద్ధి ఉండకపోవడం, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరసి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది. -
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్‌నీత్ మునోత్ తెలిపారు. -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూరజ్ ఎస్టేట్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 285 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. గతేడాది(2022–23) రూ. 306 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్ధిక సంవత్సరం(2022–23)లో దేశీ రియల్టీ రంగంలోకి 4.2 బిలియన్ డాలర్ల(రూ. 34,440 కోట్లు) ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో 22 శాతం నిధులను దేశీ ఇన్వెస్టర్లు అందించగా.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి 75 శాతానికిపైగా లభించాయి. కాగా.. అంతక్రితం ఏడాది(2021–22)లోనూ రియల్టీలోకి 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులే ప్రవహించాయి. వెరసి గతేడాది పీఈ పెట్టుబడులు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. మార్చితో ముగిసిన గతేడాదికి ఫ్లక్స్ పేరిట రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ జోరు మొత్తం రియల్టీ పెట్టుబడుల్లో ఢిల్లీ– ఎన్సీఆర్ మార్కెట్లోకి అత్యధికంగా 32 శాతం ప్రవహించాయి. ఇవి 2021–22తో పోలిస్తే 18 శాతం అధికం. కార్యాలయ ఆస్తులకు 40 శాతం పెట్టుబడులు లభించాయి. పెట్టుబడుల్లో చెన్నై వాటా 7 శాతం ఎగసి 8 శాతానికి చేరగా.. బెంగళూరు, హైదరాబాద్ సైతం అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో ఈక్విటీ మార్గం 80 శాతం నుంచి 67 శాతానికి నీరసించింది. పెట్టుబడుల తీరిలా 2020–21లో దేశీ రియల్టీలోకి భారీగా 6.3 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు ప్రవహించాయి. అంతకుముందు అంటే 2019–20లో 6.3 బిలియన్ డాలర్లు, 2018–19లో 5.3 బిలియన్ డాలర్ల చొప్పున లభించడం గమనార్హం! గతేడాది పెట్టుబడుల్లో దేశీ ఇన్వెస్టర్ల వాటా 8% బలపడింది. 2021–22లో 14%గా నమోదుకాగా.. 2022– 23లో 22 శాతానికి ఎగసింది. రెసిడెన్షియల్ రియల్టీలో కార్యకలాపాలు వేగవంతం కావడంతో సగటు టికెట్ పరిమాణం 7.2 కోట్ల డాలర్లకు నీరసించింది. 2022లో 8.6 కోట్ల డాలర్లుగా నమోదైంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్‌హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్‌హౌసింగ్‌కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్‌హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి. 2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్‌లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి. -
లండన్‌లో మ్యాక్రోటెక్ విక్రయాలు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో లండన్‌లో రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించినట్లు వెల్లడించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రెండు ప్రాజెక్టుల నుంచి తాజా అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. దేశీయంగా లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను అభివృద్ధి చేసే కంపెనీ యూకే ప్రాజెక్టుల ద్వారా ఒక త్రైమాసికంలో తొలిసారి 19.1 కోట్ల పౌండ్ల(రూ. 1,900) అమ్మకాలు అందుకున్నట్లు వెల్లడించింది. 2013లో కెనడా ప్రభుత్వం నుంచి 30 కోట్ల పౌండ్ల(రూ. 3,100 కోట్లు)కు మ్యాక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం ద్వారా మ్యాక్రోటెక్.. లండన్ ప్రాపర్టీ మార్కెట్లో ప్రవేశించింది. లోధా డెవలపర్స్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ తదుపరి 2014లో 9 కోట్ల పౌండ్లకు న్యూ కోర్టు స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గత రెండు త్రైమాసికాల్లో సాధించిన పటిష్ట బుకింగ్స్‌తో రానున్న నాలుగు నెలల్లోగా 22.5 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి గడువు 2023 మార్చికాగా.. అంతకంటే ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. బీఎస్ఈలో మ్యాక్రోటెక్ డెవలపర్స్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,238 వద్ద ముగిసింది. -
ఫిబ్రవరి 11–13 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 –13 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ 11వ ఎడిషన్ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్‌ను క్రెడాయ్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), సేవల రంగాలలో స్థిరమైన ఉపాధి కారణంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. దీంతో యువతరంలో ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు దోహదమవుతుందని పేర్కొన్నారు. రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే కొనుగోలుదారుల సగటు వయస్సు 35 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొనుగోలుదారుల జనాభా తక్కువగా ఉందని వివరించారు. కరోనా తర్వాతి నుంచి హైబ్రిడ్ పని విధానంతో అపార్ట్మెంట్ సైజ్లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత భవనాల ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటించే విధంగా ప్రదర్శనలో స్టాల్స్, ఎగ్జిబిషన్ లేఅవుట్‌ను రూపొందించామన్నారు. నిర్మాణ సంస్థలతో పాటూ మెటీరియల్ వెండర్లు, తయారీ కంపెనీలు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జి. ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్ ఆదిత్యా గౌర, జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
క్యూ3లో చైనా వృద్ధి 4.9 శాతం
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెపె్టంబర్) 4.9 శాతంగా నమోదయ్యింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంతో పోలి్చతే (7.9 శాతం) వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. కరోనా సవాళ్లకుతోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని తాజా గణాంకాలు సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 18.3 శాతం పురోగమించిన సంగతి తెలిసిందే. మూడు త్రైమాసికాల్లో ఎకానమీ 9.8 శాతం వృద్ధి సాధించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. ఈ తొమ్మిది నెలల్లో వినియోగం వాటా మొత్తం జీడీపీలో 64.8 శాతంగా ఉందని ఎన్బీఎస్ ప్రతినిధి ఫు లింగ్హవా పేర్కొన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా గత ఏడాది మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. -
రియల్టీ పెట్టుబడులు అప్
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ3)లో 72.1 కోట్ల డాలర్ల(రూ. 5,430 కోట్లు)కు చేరాయి. హౌసింగ్ డేటా సెంటర్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులకు ప్రధానంగా నిధులు ప్రవహించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, పీఈ సంస్థలు తదితరాలున్నాయి. వీటితోపాటు ఆర్‌ఈఐటీలలో యాంకర్ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు నివేదికలో జేఎల్ఎల్ తెలియజేసింది. పబ్లిక్ డొమైన్లో ఉంచిన వివరాల ఆధారంగా గణాంకాలను రూపొందినట్లు వెల్లడించింది. టెర్మ్ షీట్‌పై సంతకాలు లేదా లావాదేవీల ప్రకటనల ఆధారంగా పెట్టుబడుల కాలాన్ని పరిగణించినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడుల బదిలీ ఆధారితంకానప్పటికీ డేటా సెంటర్ విభాగంలో మాత్రం వీటిని మదింపు చేసినట్లు వివరించింది. అనిశి్చతులు, అవాంతరాల నేపథ్యంలోనూ క్యూ3లో 17 శాతం పెట్టుబడులు లభించినట్లు ప్రస్తావించింది. అయితే త్రైమాసికవారీగా చూస్తే 47 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. వివరాలిలా రెసిడెన్షియల్ రంగంలో 21.1 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించగా.. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్ఎల్ పేర్కొంది. అయితే కార్యాలయ విభాగంలో పెట్టుబడులు 40.5 కోట్ల డాలర్ల నుంచి 10 కోట్ల డాలర్లకు భారీగా క్షీణించాయి. ఇక వేర్‌హౌసింగ్ విభాగంలో 9.4 కోట్ల డాలర్లు, భూములకు 1.8 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. -
అల్లూర్ ఇన్ఫ్రాకు అసెట్స్ అండ్ మోర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) అనే వినూత్న కాన్సెప్‌్టను తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ప్రాప్ టెక్ కంపెనీ అసెట్స్ అండ్ మోర్ ఖాతాలో మరో గ్రూప్ చేరింది. అల్లూర్ ఇన్ఫ్రా బెంగళూరు వద్ద ఏర్పాటు చేసే వాణిజ్య సముదాయాలకు నిధుల సమీకరణ, అమ్మకాలు, నిర్వహణ బాధ్యతలు కంపెనీ చేతికొచ్చాయి. రియలీ్టలో పెట్టుబడిని వ్యవస్థీకృతంగా మారుస్తూ ఇన్వెస్టర్లకు అద్దె రూపంలో ఖచి్చతమైన ఆదాయాన్ని అందించే విధంగా అసెట్స్ అండ్ మోర్ సేవలందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ గచి్చ»ౌలిలోని స్కై సిటీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకై 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీ నిర్వాహణ కోసం వాసవీ, శాంతా శ్రీరాం గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్ నిమ్జ్ సమీపంలో నిర్మించే స్పేస్ సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కంపె నీ నిర్వహిస్తోంది. అసెట్స్ అండ్ మోర్ మాతృ సంస్థ పైసా ఎక్స్ పైసా మూడేళ్లుగా రూ.250 కోట్ల లోన్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తోంది. -
రియల్టీకి ఆక్సిజన్ అందించాలి!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ కార్మికుల కొరత, ఆర్థిక పరిమితులు, అనుమతుల జారీలో జాప్యం, పెరిగిన నిర్మాణ వ్యయాలు, క్షీణించిన కస్టమర్ల డిమాండ్లతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం రియల్టీ రంగాన్ని కుంగదీసింది. ఈ రంగాన్ని 90 శాతం నష్టాల్లోకి నెట్టేసిందని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది. ఆదుకోవాలి కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం బెయిల్ఔట్ ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్ చైర్మన్ సతీష్ మాగర్ కోరారు. డెవలపర్లకు రుణ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు ఈ రంగంలో ద్రవ్యతను పెంచడం కోసం అన్ని రకాల రుణాల మొత్తం, వడ్డీల మీద 6 నెలల పాటు మారటోరియాన్ని విధించాలని సూచించారు. స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్ఎంఏ) వర్గీకరణను మరొక ఏడాది పాటు స్తంభింపచేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నిర్మాణ గడువు సమయాన్ని అదనంగా 6 నెలలు పొడిగించాలని, కొనుగోలుదారుల డిమాండ్‌ను ఏర్పరిచేందుకు స్టాంప్‌డ్యూటీని తగ్గింపు లేదా మాఫీ చేయాలని తెలిపారు. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా నిర్మాణ అనుమతుల వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాల పరిశ్రమ రియల్ ఎస్టేట్. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ వాటా 6–7 శాతం వరకు ఉంది. 10–20 శాతం ధరల వృద్ధి దేశంలో గత కొన్ని వారాలుగా స్టీల్ తయారీదారులు కుమ్మక్కు అయ్యి 40–50 శాతం మేర ధరలను పెంచారని.. దీంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ పటోడియా తెలిపారు. ఇందువల్ల దీర్ఘకాలంలో గృహాల ధరలు 10–20 శాతం మేర పెరుగుతాయని చెప్పారు. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను డెవలపర్లు భరించే స్థాయిలో లేరని.. అయితే ఈ ధరల వృద్ధి ప్రభావం ప్రస్తుతం ఉన్న కస్టమర్ల మీద పడదని, అయితే కొత్త విక్రయాలతో ప్రారంభమవుతుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బోమన్ ఇరానీ తెలిపారు. -
బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్ బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్’, ‘మోడల్ ఏజెంట్, బయ్యర్ అగ్రిమెంట్’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్ లాంచ్ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. -
కరోనా ప్రభావమే ఎక్కువ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది. కరోనా కంటే ముందు నుంచే ప్రతికూలంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మరింత ముంచేసిందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని రుణ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆదుకోవాలని ఈ మేరకు క్రెడాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అర్ధంతరంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని లేఖలో కోరింది.‘‘వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించేది రియల్టీ రంగమేనని, స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లోనూ రియల్టీకి సింహ భాగం వాటా ఉందని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రియల్టీ మీద ఆధారపడి సిమెంట్, స్టీల్, రంగుల వంటి సుమారు 250 అనుబంధ రంగాలున్నాయని’’ లేఖలో సభ్యులు పేర్కొన్నారు. నగదు లభ్యత, ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి కొరత వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు. లేఖలోని ప్రధానాంశాలివే.. ► 2008లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎలాగైతే వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అమలు చేసిందో.. అలాగే ఇప్పుడు కూడా తీసుకురావాలని, అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేయాలి. 2019 డిసెంబర్ 31 నాటికి ఉన్న అన్ని రియల్టీ రుణ ఖాతాలను పునర్వ్యవస్థీకరించాలి. ► అన్ని బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనా న్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) ఎలాంటి అదనపు సెక్యూరిటీ లేకుండా ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్లలో 20 శాతానికి సమానమైన అదనపు రుణాన్ని అందించాలి. అలాగే సంబంధిత ప్రాజెక్ట్‌ను ఎన్పీఏగా పరిగణించకూడదు. ► కరోనా ప్రభావం తగ్గేవరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జరిమానాల మీద వసూలు చేసే వడ్డీలను ఏడాది పాటు నిలిపివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉన్న నివాస ఆస్తులకు మూలధన లాభాల పన్ను ఉండకూడదు. ► గృహ నిర్మాణ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి కొత్త గృహాల మీద వడ్డీ రేటును గరిష్టంగా 5%కి తగ్గించాలి. అలాగే నెలవారీ వాయిదా (ఈఎంఐ) వడ్డీ రాయితీని మరొక ఐదేళ్ల పాటు పొడిగించాలి. సెక్షన్–24 కింద గృహ రుణం మీద వడ్డీ మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలి. ► నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో కొనుగోలుదారుల తరుఫున డెవలపర్లు చెల్లించే ఈఎంఐ సబ్వెన్షన్ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌బీ, ఆర్బీఐలను కోరింది. -
ల్యాండ్ ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది. 2,084 ఎకరాలపైనే ఆశ.. హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్‌గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్‌మెట్ 161, అజీజ్‌నగర్ 126.29, కొత్వాల్‌గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్‌నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది. బుద్వేల్ భూములు కూడా... ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని టూరిజం, హెచ్ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది. -
ధర, వాస్తు, నీళ్లకే ప్రాధాన్యం
అందుబాటు ధర, వాస్తు, మెరుగైన నీటి సరఫరా.. ఇవే గృహాల కొనుగోళ్లలో కస్టమర్ల ప్రధాన ఎజెండాలు. ఆ తర్వాతే రవాణా సౌకర్యాలు, ఆధునిక వసతులను కోరుకుంటున్నారని రియల్టీ పోర్టల్ నోబ్రోకర్.కామ్ తెలిపింది. రూ.60 లక్షల లోపు దర, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు. భద్రత, స్కూల్స్, ఆసుపత్రుల వంటి సోషల్ ఇన్ఫ్రా కస్టమర్లూ ఉన్నారండోయ్! సాక్షి, హైదరాబాద్: నోబ్రోకర్.కామ్ ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని 70 లక్షల రిజిస్టర్ యూజర్లతో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీటిలో 84 శాతం మంది అందుబాటు ధర, 83 శాతం మంది నీటి సరఫరా, 73 శాతం మంది గృహ వాస్తు, 59 శాతం మంది మెరుగైన రవాణా సౌకర్యాలున్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. 53 శాతం మంది కార్ పార్కింగ్, 42 శాతం మంది భద్రత, 24 శాతం మంది లిఫ్ట్, 19 శాతం స్కూల్స్, 13 శాతం మంది ఆసుపత్రులు, 9 శాతం మంది జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉండాలని కోరుకున్నారు. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, ఉప్పల్, నిజాంపేట ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారు. 2020 గృహ విభాగానిదే.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడం, ప్రభుత్వం అందుబాటు గృహాలకు రాయితీలు అందిస్తుండటం వంటి కారణాలతో 2020లో గృహ విక్రయాలు జోరందుకుంటాయి. మెట్రో నగరాల్లోనూ మూలధన వృద్ధి స్థిరంగా ఉండటం, ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండటం వంటివి కూడా విక్రయాల వృద్ధికి కారణాలే. ఈ ఏడాది 64 శాతం మంది అద్దెదారులు సొంతిల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వే తెలిపింది. గతేడాది ఇది 54 శాతంగా ఉంది. ఇందులోనూ 64 శాతం మంది 35 ఏళ్లలోపే సొంతింటి కలను తీర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 35–45 ఏళ్ల మధ్య 26 శాతం, 45 ఏళ్ల పైన 10 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. గృహ కొనుగోళ్లలో అత్యంత ఆసక్తిగా హైదరాబాదీలే ఉన్నారు. ఇక్కడ 69 శాతం సొంతింటి ఎంపికలో నిమగ్నమై ఉంటే.. బెంగళూరులో 65 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం, పుణేలో 56 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 58 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో రూ.54 కోట్లు నో బ్రోకర్.కామ్‌తో 2019లో మెట్రో నగరాల్లో రూ.1,154 కోట్ల బ్రోకరేజ్ తగ్గిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ.372 కోట్లు, ముంబైలో రూ.342 కోట్లు, పుణేలో రూ.206 కోట్లు, చెన్నైలో రూ.180 కోట్లు, హైదరాబాద్‌లో రూ.54 కోట్ల బ్రోకరేజ్ ఆదా అయింది. బ్రోకర్లు తగ్గుతున్నారు రియల్టీ రంగంలో బ్రోకర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2018లో గృహ కొనుగోళ్లలో 14 శాతంగా ఉన్న మధ్యవర్తులు.. 2019లో 11 శాతానికి తగ్గింది. బ్రోకర్ల క్షీణత కొనుగోలుదారులకే లాభం. ఇళ్ల కొనుగోళ్లలో 35 శాతం స్నేహితులు, బంధువుల ద్వారా, 28 శాతం రియల్టీ వెబ్‌సైట్స్, 26 శాతం టులెట్ బోర్డ్స్ ద్వారా సంప్రదిస్తున్నారు. – సౌరభ్ గార్గ్, కో–ఫౌండర్, నోబ్రోకర్.కామ్ -
రియల్టీ రంగానికి 2019లో నిరాశే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించ డం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వం టి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగం లో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం 4 శాతం వృద్ధితో 2,58,410 యూనిట్లకు చేరాయి. ఇందులోనూ అందుబాటు గృహాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. అఫడబు ల్ హౌసింగ్లకు పలు పన్ను రాయితీలను కల్పించ డమే ఇందుకు కారణం. తొలిసారి గృహ కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల పన్ను రాయితీని అందిస్తుంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అందుబాటులో ఉంటుంది. రెడీ టు మూవ్ గృహాలకే డిమాండ్.. రియల్ ఎస్టేట్ రంగం పనితీరు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల క్రితం నాటికి క్షీణించి 4.5 శాతానికి చేరింది. ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో డిమాండ్ కనిపించింది.. కానీ, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ తిరోగమన బాట పట్టిందని చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా 6 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్ల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. లిస్టెడ్, బ్రాండెడ్ నిర్మాణ సంస్థలు మాత్రం గృహ విక్రయాల్లో కాసింత ఉపశమనంలో ఉన్నాయి. ఈ ఏడాది గృహ విభాగానికి కలిసొచ్చిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)ను ఏర్పాటు చేయడమే. -
కొనసాగిన ‘రికార్డ్’ లాభాలు
సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం సంస్కరణలను ప్రకటించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడం సానుకూల ప్రభావం చూపించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ దాదాపు ఐదు నెలల తర్వాత 12,000 పాయింట్లపైకి ఎగబాకింది. ఇక సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,688 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 184 పాయింట్ల లాభంతో 40,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,012 పాయింట్ల వద్దకు చేరింది. జీవిత కాల గరిష్ట స్థాయి, 12,103 పాయింట్లకు 91 పాయింట్ల దూరంలోనే ఉంది. వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం స్వల్పంగా పెరిగింది. లోహ, ఇంధన, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. వాహన, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రూ.25,000 కోట్ల రియల్టీ నిధి... రియల్టీ రంగంలో ఆగిపోయిన 1,600 ప్రాజెక్ట్‌ల కోసం రూ.25,000 కోట్ల నిధిని కేంద్రం ప్రకటించింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, పరస్పరం విధించుకున్న సుంకాలను దశలవారీగా తొలగించుకోవడానికి అమెరికా–చైనాలు అంగీకారానికి రావడం.... ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. -
రియల్టీ రంగానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: రియల్టీ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు పలు కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం ఎన్పీఏ ఎన్సీఎల్టీ ప్రకటించని సంస్థలకు మాత్రమే అనే నిబంధనను తాజాగా తొలగించారు. తద్వారా మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. తద్వారా సంబంధిత ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సాయపడుతుంది. ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో కేంద్ర 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధులను సమకూర్చనుంది. గృహ ప్రాజెక్టుల కోసం రూ.25,000 కోట్ల నిధి నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది. దీని ద్వారా అందుబాటు ధరలు, మధ్య ఆదాయ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలు కలగనుంది. అంతేకాకుండా నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారనీ, ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులను అందించే నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎన్పీఏ, ఎన్సీఎల్టీకి వెళ్లిన హౌసింగ్ ప్రాజెక్టులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఈ వివరాలను కేబినెట్ సమావేశం తరువాత ఆమె మీడియాకు వివరించారు.1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతోభారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు చిక్కుకున్నాయని అంతర్గత సర్వేలో తేలిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. -
ఆతిథ్య రంగంలోకి ఇన్క్రెడిబుల్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఉన్న ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్... అతిథ్య రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఉన్న హాంప్‌షైర్ ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.42 కోట్లు. ఈ ఏడాదే గోవాలోనూ ఓ హోటల్‌ను టేకోవర్ చేయనున్నట్టు ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సీవోవో ప్రవీణ్ కుమార్ నెడుగండి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఆతిథ్య రంగంలో మరిన్ని ప్రాజెక్టులను చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా చెప్పారాయన. ‘2008లో రియల్టీ రంగంలోకి ప్రవేశించాం. 2,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇతర కంపెనీల కంటే 50 శాతం తక్కువ ధరకే ప్లాట్లను విక్రయిస్తున్నాం. ఇప్పటిదాకా 29,000 ప్లాట్లు విక్రయించాం. నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశిస్తున్నాం’’ అని తెలియజేశారు. బిస్కెట్ ఫ్యాక్టరీ.. చౌటుప్పల్ సమీపంలో కంపెనీ 3 ఎకరాల్లో బిస్కెట్ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 2,000 టన్నుల బిస్కెట్లు, 500 టన్నుల కేక్ తయారు చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు. దీనిద్వారా ప్రత్యక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. 2019లో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయి. దీనికి సంబంధించి పార్లే కంపెనీతో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ చేతులు కలిపింది. తొలుత ఇక్కడ పార్లే కోసం ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇతర కంపెనీలతోనూ థర్డ్ పార్టీ డీల్ కోసం చర్చిస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బిస్కెట్లు, కేక్స్‌ను సొంత బ్రాండ్‌లో విదేశాల్లో విక్రయించనున్నట్టు చెప్పారు. 2017–18లో కంపెనీ రూ.100 కోట్ల టర్నోవర్ సాధించింది. -
కన్సల్టెన్సీ సేవల్లో హనీ గ్రూప్!
సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ ధర.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది ఒక్క రియల్టీ రంగంలోనే! నిజమే, కొనుగోలుదారులెవరికైనా కావాల్సిందిదే. కస్టమర్ల అభిరుచికి తగ్గ ట్టుగా మార్కెట్ రేటు కంటే 3–5% తక్కువకు ప్రాపర్టీలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది హనీ గ్రూప్. మరిన్ని వివరాలు హనీ గ్రూప్ సీఎండీ ముక్కా ఓబుల్ రెడ్డి మాటల్లోనే.. ♦ రెండేళ్ల క్రితం 9 మంది ఉద్యోగులతో విశాఖపట్నం కేంద్రంగా హనీ గ్రూప్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో వైజాగ్‌తో పాటూ హైదరాబాద్, బెంగళూరు, గాజువాక ప్రాంతాల్లో 5 బ్రాంచీలకు విస్తరించాం. నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకు మధ్య కన్సల్టెన్సీ సేవలందించడమే హనీగ్రూప్ పని. ప్రాపర్టీ కొనుగోలు చేసే కస్టమర్లకు ఎక్కడ కొంటే బెటర్, ధర ఎంత పెట్టొచ్చు, లోన్ వంటి అన్ని రకాల సేవలను అందిస్తాం. పైగా బిల్డర్‌కు ఇతరత్రా సర్వీస్లుంటాయి కాబట్టి మా ద్వారా వెళ్లిన కొనుగోలుదారులకు మార్కెట్ రేటు కంటే 3–5 శాతం ధర తక్కువుంటుంది. మరి, నిర్మాణ సంస్థలకేం లాభమంటే.. మార్కెటింగ్, సైట్ విజిట్, కస్టమర్లను ఒప్పించడం వంటి వాటి కోసం ప్రత్యేక సిబ్బంది అవసరముండదన్నమాట. ఒకే చోట 360 ప్రాజెక్ట్‌లు.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి పలు నగరాల్లో 203 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో 360కి పైగా ప్రాజెక్ట్‌లున్నాయి. పూర్వాంకర, ప్రెస్టీజ్, శోభ, బ్రిగేడ్, ఎంబసి, అంబిక, ఎంవీవీ, జైన్, వైజాగ్ ప్రొఫైల్, ఫ్లోరా వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నారు. గత రెండేళ్లలో 1,200కు పైగా ప్రాపర్టీలను విక్రయించాం. రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు.. పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలా రియల్టీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే హనీగ్రూప్ మాత్రం ఏకంగా 200 మంది ఉద్యోగులను నియమించుకుంది. పైగా 4 కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది కాలంలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, భువనేశ్వర్, చెన్నై ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభించాలని నిర్ణయించాం. రెండేళ్లలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచాం. -
5.6 కోట్ల చ.అ.లకు చేరిన ఆఫీసు స్థలం!
సాక్షి, హైదరాబాద్ : దేశీయ రియల్టీ రంగంలో హైదరాబాద్ కీలకంగా మారింది. నివాస సముదాయాల్లోనే కాదు వాణిజ్య, ఆఫీసు విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోందని ప్రముఖ రియల్టీ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ధ కాలంలో హైదరాబాద్ ఆఫీసు స్టాక్ రెండితలు వృద్ధితో 5.6 కోట్ల చ.అ.కు చేరిందని నివేదిక పేర్కొంది. మరిన్ని వివరాలివే.. ♦ రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మెరుగైన మౌలిక వస తులు, నాణ్యమైన విద్యా సం స్థలు, ప్రోత్సాహకరమైన ప్రభుత్వ విధానాలు, టెక్నా లజీ హబ్, నైపుణ్యమున్న యువత వంటివి హైదరాబాద్ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని నివేదిక పేర్కొంది. ♦ ప్రస్తుతం హైదరాబాద్‌లో సంఘటిత రిటైల్ స్టాక్ 29 లక్షల చ.అ.కు చేరింది. పశ్చిమ, సెంట్రల్ హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి హైస్ట్రీట్ ప్రాంతాల్లో పరిమిత సప్లయి కారణంగా అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. 2011–2017 నాటికి అద్దెలు ఏటా 4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. సమీప భవిష్యత్తులో మరో 3.7 మిలియన్ చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. ♦ 2017లో నగరంలో 68 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లీజుకుపోయింది. ఏడాది కాలంలో నగరంలో ఆఫీసు డిమాండ్ 102 శాతం, రిటైల్ 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది నగరంలో 12.3 లక్షల చ.అ. లాజిస్టిక్ స్థలం లీజుకుపోయింది. ఈ విభాగం ఏడాదిలో 93 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ అందుబాటు గృహాలతో పాటూ, ప్రీమియం నివాస సముదాయలకూ నగరంలో డిమాండ్ ఉంది. పశ్చిమ ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, గచ్చిబౌలిలకు పోటీగా తూర్పు ప్రాంతాలైన ఎల్బీనగర్, నాచారాం, మలక్‌పేట ప్రాంతాలు వృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ హాట్‌స్పాట్ దేశంలోని రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారింది. స్థానిక పెట్టుబడిదారులతో పాటూ బహుళ జాతి కంపెనీల ఇన్వెస్టర్లూ నగరం వైపు దృష్టిసారించారు. ప్రధానంగా కొత్త నివాస ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మణికొండ, కూకట్పల్లి, నానక్‌రాంగూడ, కొండాపూర్ వంటి ప్రాంతాలోని ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్నారు. ప్రధాన నగరంలో ప్రీమియం/లగ్జరీ ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు పరిమితంగా ఉన్నాయి. – అన్షుమన్ మ్యాగజైన్,సీబీఆర్ ఇండియా చైర్మన్ -
శ్రీశైలం రహదారి సొంతింటికి సరైన దారి!
హైదరాబాద్ రియల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చే దమ్మున్న ప్రాజెక్ట్.. ఫార్మా సిటీ! ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో ఇప్పటికే జోరుమీదున్న శ్రీశైలం జాతీయ రహదారిలో ఫార్మా సిటీతో మరింత హుషారొచ్చింది. ఓఆర్ఆర్ మీదుగా తక్కువ సమయంలో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ సెజ్‌లకు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వీలుండటంతో కొనుగోలుదారులే కాదండోయ్.. పెట్టుబడిదారులూ శ్రీశైలం రహదారి వైపు దృష్టిసారించారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ లే అవుట్లు, వెంచర్లతో పాటూ ప్రీమియం విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలూ వెలుస్తున్నాయి. భవిష్యత్తు అభివృద్ధికి, పెట్టుబడికి ఢోకాలేని ప్రాంతం శ్రీశైలం రహదారే! సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ఉన్న ప్రాంతమేందయ్యా అంటే.. ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే! ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మా సిటీ, రీజినల్ రింగ్ రోడ్డులతో సమీప భవిష్యత్తులో శ్రీశైలం రహదారిలో రియల్ పరుగులు పెట్టడం ఖాయమని రియల్టీ నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముందని’’ మాతృభూమి ఫామ్ ల్యాండ్స్ సీఎండీ కొత్త మనోహర్ రెడ్డి తెలిపారు. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం ర హదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. మొత్తంగా స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు శ్రీశైలం రహదారి సరైన ప్రాంతమని నిపుణులు సూచిస్తున్నారు. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మాతృభూమి, రాంకీ, మ్యాక్, ఫార్చ్యూన్, ప్రజయ్, వీడియోకాన్, విశాల్ వంటి నిర్మాణ సంస్థలు ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర బిందువుగా మారనున్న తలకొండపల్లిలో ప్రస్తుతం ఎకరం రూ.20 లక్షల లోపు ఉన్నది కాస్త సమీప భవిష్యత్తులో కోటి దాటుతుందని అంచనా. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రూ.5 వేల నుంచి 8 వేల వరకున్నాయి. విల్లాల ధరలు రూ.కోటి పైమాటే. 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల ధరలు రూ.30 లక్షల నుంచి ఉన్నాయి. ప్రధాన నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హైదరాబాద్ రియల్టీలోకి రూ.940 కోట్ల పీఈ పెట్టుబడులు!
2004 తర్వాత దేశీయ రియల్టీ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు రికార్డు స్థాయిలోకి చేరాయి. 2017లో స్థిరాస్తి రంగంలోకి రూ.42,800 కోట్ల పీఈ నిధులొచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, జీఎస్టీ అమలు, రీట్స్ నిబంధనల రూపకల్పన వంటివే ఇందుకు కారణమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. 2016తో పోలిస్తే 17 శాతం, 2008తో పోలిస్తే 52 శాతం వృద్ధి. సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమలుతో దేశంలో నివాస విభాగం ఒక్కసారిగా కుదేలైంది. దీని ప్రభావం పీఈ నిధులపైన కూడా పడింది. అందుకే 2016లో రూ.21,870 కోట్ల పీఈ నిధులను ఆకర్షించిన నివాస విభాగం 2017 నాటికి 29 శాతం క్షీణతతో 15,600 కోట్లకు పడిపోయింది. ఆఫీసు విభాగం మాత్రం ఏడాది కాలంలో మూడింతల వృద్ధిని నమోదు చేసింది. 2017లో ఆఫీసు విభాగంలోకి రూ.13,200 కోట్ల పెట్టుబడులొచ్చాయి. 2016లో ఇది రూ.3,980 కోట్లుగా ఉంది. ఏడాదిలో రికార్డు స్థాయికి పారిశ్రామిక విభాగం.. 2016లో ఒక్క పీఈ డీల్ కూడా జరగని పారిశ్రామిక రంగంలో 2017లో ఏకంగా 6,540 కోట్ల పీఈ నిధులొచ్చాయి. మిక్స్డ్ యూజ్ విభాగం 320 కోట్ల నుంచి 4,240 కోట్ల వృద్ధిని సాధించింది. ఆతిథ్య రంగం 1,240 కోట్ల నుంచి 380 కోట్లకు, రిటైల్ 6,300 కోట్ల నుంచి 2,860 కోట్లకు పడిపోయాయి. హైదరాబాద్‌లో తగ్గిన పీఈ.. నగరాల వారీగా పీఈ నిధుల జాబితాను పరిశీలిస్తే.. ముంబై, చెన్నై మినహా అన్ని నగరాలూ క్షీణతలో ఉన్నాయి. 2016లో రూ.1,340 కోట్ల పీఈ నిధులను ఆకర్షించిన హైదరాబాద్.. 2017 నాటికి 30 శాతం క్షీణతతో రూ.940 కోట్లకు పడిపోయింది. పుణె రూ.1,860 కోట్ల నుంచి రూ.1,450 కోట్లకు తగ్గింది. అత్యధికంగా ముంబై పీఈ నిధులను ఆకర్షించింది. 2016లో రూ.10,590 కోట్ల పెట్టుబడులు రాగా.. 2017 నాటికివి 41 శాతం వృద్ధితో రూ.15,000 కోట్లకు పెరిగాయి. చెన్నైలో 149 శాతం వృద్ధితో రూ.120 కోట్ల నుంచి 2,970 కోట్లకు చేరాయి. ఇక ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.9,390 కోట్ల నుంచి రూ.4,380 కోట్లకు, బెంగళూరు రూ.6,340 కోట్ల నుంచి రూ.5,170 కోట్లకు తగ్గాయి. అయితే 2017లో పీఈ నిధులను సమీకరించిన నగరాల వారీగా చూస్తే మాత్రం ముంబై తర్వాత ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులే నిలిచాయి. 2018లోనూ ఆఫీసు, పారిశ్రామిక రంగమే! లాజిస్టిక్ రంగానికి మౌలిక రంగ హోదా దక్కడంతో ఇన్వెస్టర్లు గిడ్డంగులు, పారిశ్రామిక రంగం మీద దృష్టిసారించారు. నిలకడైన రిటర్న్స్, రీట్స్ అందుబాటులోకి రానుండడంతో సంస్థాగత పెట్టుబడిదారులు ఆఫీసు విభాగంపై ఫోకస్ పెట్టారు. 2018లోనూ ఆఫీసు, పారిశ్రామిక రంగాల్లో దేశీయ పెట్టుబడిదారులతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్ల డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. – అన్షుల్ జైన్, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ఎండీ -
రెరా చట్టం.. స్థిరాస్థి కొనుగోలుదారులకు వరం
సాక్షి, నెల్లూరు: ఏదైనా వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్తగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది. నియంత్రణ అధికారుల వద్ద నమోదు ఈ చట్ట ప్రకారం చేపడుతున్న ప్రాజెక్టులను, ఇప్పటికీ కంప్లీషన్ సర్టిఫికెట్(సీసీ)అందుకోని ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను నియంత్రణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. దీంతో నిర్మాణ రంగంలోని బిల్డర్లు చేసే మోసాల నుంచి కొగుగోలుదార్లను రక్షించవచ్చు. ఇంతకు ముందు కోర్టు కేసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి మాత్రమే వినియోగదారులు తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకునేందుకు వీలుండేది. ఇకపై ఈ ప్రయాసలకు కాస్త విముక్తి కలుగుతుంది. రెరా చట్టంలోని కీలక ప్రతిపాదనలు బిల్డర్లు తాము చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక(ఎస్క్రో) ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతం అదే ఖాతాలో ఉండాల్సిందే. ఈ సొమ్మంతా ప్రాజెక్టు నిర్మాణానికి, భూమి కొనుగోలుకు వెచ్చించాల్సిఉంటుంది. ఒక్క ప్లాట్ అమ్మిన తర్వాత దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే తప్పనిసరిగా బిల్డర్ కొనుగోలుదారు నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీంతో మధ్యలోనే మళ్లీ ధరలు పెంచే అవకాశం ఉండదు. ప్రతి దశా ప్రాజెక్ట్ కిందే ఈ చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. ప్రతి దశకూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారం అందుబాటులో.. ప్రతి బిల్డర్ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు, ప్రస్తుత స్థితిగతులు, ప్రాజెక్టు ఉప కాంట్రాక్టర్ల వివరాలు, ఎప్పటి లోపు పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ప్లాట్ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థ«ల నుంచి ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది. నిర్మాణదారులకు జైలు, జరిమానా రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాలి. లేనిపక్షంలో 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాలి. అక్కడ కేసు తీవ్రతను బట్టి జరిమానా సైతం ఉండొచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్ చేతికందిన ఏడాది సమయం వరకూ తలెత్తే నిర్మాణలోపాలను సరిదిద్దే బాధ్యత బిల్డర్ తీసుకోవాల్సిఉంటుంది. బుకింగ్ సొమ్ము ఇలా.. కొంత మంది బిల్డర్లు పూర్తి నిర్మాణ ఖర్చులో 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును బుకింగ్ కోసం అడుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకపు ఒప్పందం తర్వాత జరుగుతోంది. కానీ రెరా చట్టం ప్రకారం ప్రమోటర్లు 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును డిమాండ్ చేయకూడదు. మొదట సేల్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోవాల్సిందే. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే బ్యాంకు రుణం మీద వడ్డీ కట్టాల్సిన బాధ్యత నిర్మాణదారుపై పడుతుంది. దీంతో వినియోగదారునికి వడ్డీ భారం తగ్గుతుంది.