కరోనా ప్రభావమే ఎక్కువ.. | Sakshi
Sakshi News home page

కరోనా ప్రభావమే ఎక్కువ..

Published Tue, May 26 2020 3:56 AM

CREDAI Seeks Urgent Support For Realty Sector in Letter to MODI - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలిపింది. కరోనా కంటే ముందు నుంచే ప్రతికూలంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మరింత ముంచేసిందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని రుణ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆదుకోవాలని ఈ మేరకు క్రెడాయ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

అర్ధంతరంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని లేఖలో కోరింది.‘‘వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించేది రియల్టీ రంగమేనని, స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లోనూ రియల్టీకి సింహ భాగం వాటా ఉందని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రియల్టీ మీద ఆధారపడి సిమెంట్, స్టీల్, రంగుల వంటి సుమారు 250 అనుబంధ రంగాలున్నాయని’’ లేఖలో సభ్యులు పేర్కొన్నారు. నగదు లభ్యత, ఇసుక, స్టీల్, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రి కొరత వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు.

లేఖలోని ప్రధానాంశాలివే..
► 2008లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎలాగైతే వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌ స్కీమ్‌ అమలు చేసిందో.. అలాగే ఇప్పుడు కూడా తీసుకురావాలని, అన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అమలు చేయాలి. 2019 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న అన్ని రియల్టీ రుణ ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించాలి.

► అన్ని బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనా న్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ఎలాంటి అదనపు సెక్యూరిటీ లేకుండా  ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్‌లలో 20 శాతానికి సమానమైన అదనపు రుణాన్ని అందించాలి. అలాగే సంబంధిత ప్రాజెక్ట్‌ను ఎన్‌పీఏగా పరిగణించకూడదు.

► కరోనా ప్రభావం తగ్గేవరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జరిమానాల మీద వసూలు చేసే వడ్డీలను ఏడాది పాటు నిలిపివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉన్న నివాస ఆస్తులకు మూలధన లాభాల పన్ను ఉండకూడదు.

► గృహ నిర్మాణ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి కొత్త గృహాల మీద వడ్డీ రేటును గరిష్టంగా 5%కి తగ్గించాలి. అలాగే నెలవారీ వాయిదా (ఈఎంఐ) వడ్డీ రాయితీని మరొక ఐదేళ్ల పాటు పొడిగించాలి. సెక్షన్‌–24 కింద గృహ రుణం మీద వడ్డీ మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలి.

► నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో కొనుగోలుదారుల తరుఫున డెవలపర్లు చెల్లించే ఈఎంఐ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌బీ, ఆర్‌బీఐలను కోరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement