పెట్టుబడికి స్థలమే భేష్! | land is the best investment for real estate | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి స్థలమే భేష్!

Published Sat, Apr 30 2016 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

పెట్టుబడికి స్థలమే భేష్!

పెట్టుబడికి స్థలమే భేష్!

సాక్షి, హైదరాబాద్: రియల్టీ రంగంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అయితే స్థలం మీద పెట్టుబడి పెట్టడమే ఉత్తమమని నిపుణుల సలహా. దీర్ఘకాలం వేచి చూడగలిగితే అధిక రాబడిని అందుకోవచ్చు. దీర్ఘకాలిక పన్ను లాభాల కోసం నివాస సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం అందరికీ తెలిసిందే. నాణ్యమైన నిర్మాణాల్ని అందించాలని ఎలాగు ప్రభుత్వాలూ భావిస్తున్నాయి కాబట్టి.. గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. మీ వద్ద సొమ్ము ఉండి.. పెట్టుబడి పెట్టాలన్న దృక్పథం ఉంటే చాలు.. స్థలానికే ప్రథమ ప్రాధాన్యమివ్వండి.

 స్థలమెక్కడ?
ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక..  ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెట్టింపయ్యే అవకాశం గల ప్రాంతాన్ని ఎంచుకోండి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్‌ఎండీఏ తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయోమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం.

 దేని పరిధిలోకి వస్తుంది?
మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్‌ఎండీఏ బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్‌టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ  జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి. హెచ్‌ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి.

 ధర ఎంత?
మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు. బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు.

 రిజిస్ట్రేషన్ మీ పేరిటే ఉండాలి..
మీరు సొమ్మంతా కటేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ ఓ లే అవుట్‌లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement