వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్‌  | Realty sector seeks interest rate cut to drive housing demand | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్‌ 

Published Fri, Feb 7 2025 6:17 AM | Last Updated on Fri, Feb 7 2025 6:17 AM

Realty sector seeks interest rate cut to drive housing demand

పావు శాతం అయినా తగ్గించాలి 

రియల్టర్ల మండలి నరెడ్కో వినతి 

న్యూఢిల్లీ: దేశంలో ఇళ్లకు (హౌసింగ్‌) డిమాండ్‌ను పెంచేందుకు ఆర్‌బీఐ రెపో రేటును కనీసం 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు అయినా తగ్గించాలని రియల్టర్ల మండలి నరెడ్కో డిమాండ్‌ చేసింది. ‘‘రియల్టీ రంగం బలమైన వృద్ధి, సానుకూల సెంటిమెంట్‌ను చూస్తోంది. రెపో రేటును కొంత మేర తగ్గించడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. 25–30 బేసిస్‌ పాయింట్లను తగ్గించాలి. 

ఇది రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా, అనుబంధ రంగాలైన నిర్మాణం, సిమెంట్, స్టీల్‌కు కూడా ప్రయోజనం కల్పించినట్టు అవుతుంది’’అని నరెడ్కో ప్రెసిడెంట్‌ జి.హరిబాబు తెలిపారు. ఆర్‌బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లపై తన నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్న నేపథ్యంలో నరెడ్కో ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘వడ్డీ రేట్ల తగ్గింపుతో టైర్‌–2, 3 పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది.

 సమ్మిళిత వృద్ధి, పట్టణాభివృద్ధి పట్ల ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతునిస్తుంది. రేట్ల తగ్గింపుతో డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులకు తోడ్పాటు, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది, లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాన్ని డెవలపర్లు వేగవంతం చేయడంతోపాటు కొత్తవి ప్రారంభించేందుకు ఉత్సాహం వస్తుంది’’అని హరిబాబు తెలిపారు. రెపో రేటు తగ్గింపుతో అన్ని ప్రాంతాల్లో స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుందన్నారు.  

కచ్చితంగా ప్రయోజనమే.. 
వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రయోజనం దక్కుతుందని, రుణాల ధరలు దిగొస్తాయని, దిగువ, మధ్యాదాయ వర్గాల్లో సానుకూల సెంటిమెంట్‌ ఏర్పడుతుందని నైట్‌ఫ్రాంక్‌ సీఎండీ శిశిర్‌ బైజాల్‌ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రేట్ల తగ్గింపుతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో డెవలపర్లు తమ ప్రాజెక్టుల కోసం రుణాలు సులభంగా పొందగలరు’’అని ఆయన చెప్పారు. వినియోగ వృద్ధికి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చేపట్టిన చర్యలకు మద్దతుగా, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గించాలని బీసీడీ గ్రూప్‌ సీఎండీ అంగద్‌ బేడి కోరారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement