Housing demand
-
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్..
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్‌లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్లైన్లో ప్రాపర్టీల సెర్చ్‌లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. -
వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో ఇళ్లకు (హౌసింగ్) డిమాండ్‌ను పెంచేందుకు ఆర్బీఐ రెపో రేటును కనీసం 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు అయినా తగ్గించాలని రియల్టర్ల మండలి నరెడ్కో డిమాండ్ చేసింది. ‘‘రియల్టీ రంగం బలమైన వృద్ధి, సానుకూల సెంటిమెంట్‌ను చూస్తోంది. రెపో రేటును కొంత మేర తగ్గించడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. 25–30 బేసిస్ పాయింట్లను తగ్గించాలి. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా, అనుబంధ రంగాలైన నిర్మాణం, సిమెంట్, స్టీల్‌కు కూడా ప్రయోజనం కల్పించినట్టు అవుతుంది’’అని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లపై తన నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్న నేపథ్యంలో నరెడ్కో ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘వడ్డీ రేట్ల తగ్గింపుతో టైర్–2, 3 పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది. సమ్మిళిత వృద్ధి, పట్టణాభివృద్ధి పట్ల ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతునిస్తుంది. రేట్ల తగ్గింపుతో డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులకు తోడ్పాటు, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది, లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాన్ని డెవలపర్లు వేగవంతం చేయడంతోపాటు కొత్తవి ప్రారంభించేందుకు ఉత్సాహం వస్తుంది’’అని హరిబాబు తెలిపారు. రెపో రేటు తగ్గింపుతో అన్ని ప్రాంతాల్లో స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుందన్నారు. కచ్చితంగా ప్రయోజనమే.. వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజనం దక్కుతుందని, రుణాల ధరలు దిగొస్తాయని, దిగువ, మధ్యాదాయ వర్గాల్లో సానుకూల సెంటిమెంట్ ఏర్పడుతుందని నైట్‌ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రేట్ల తగ్గింపుతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో డెవలపర్లు తమ ప్రాజెక్టుల కోసం రుణాలు సులభంగా పొందగలరు’’అని ఆయన చెప్పారు. వినియోగ వృద్ధికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేపట్టిన చర్యలకు మద్దతుగా, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గించాలని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి కోరారు. -
రూ.అర కోటి లోపు ఇల్లు కావాలి..
భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాల భారం.. వంటి రకరకాల కారణాలతో సామాన్యులకు హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాలు అందుబాటు ధరల్లో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీపడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే గానీ సొంతింటి కల సాకారం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల నెరవేరడానికి దగ్గరి దారిని చూపించే ప్రాంతాలపై ‘సాక్షి రియల్టీ’ప్రత్యేక కథనం... –సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్రూమ్స్, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే అద్దెసొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి ఆలోచనగా ఉంటుంది. దీంతో రూ.50 లక్షలలోపు ధర ఉండే గృహాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే... మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.పీఎంఏవైను సవరించాలి.. లాభం ఉందంటే అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు కూడా ముందుకొస్తారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో డెవలపర్లలో విశ్వాసం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం నిబంధనలను సవరించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనల వర్తింపు సరికాదు. ఎందుకంటే... 700 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్. దానిని హైదరాబాద్‌లో బడ్జెట్ హోమ్‌గా పరిగణిస్తుంటారు. అందుకే పీఎంఏవై స్కీమ్ ప్రయోజనాలను గృహ కొనుగోలుదారుల ఆదాయాన్ని బట్టి కాకుండా అపార్ట్మెంట్ విస్తీర్ణాన్ని బట్టి వర్తింపజేయాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హత పొందుతారు. కొనే ముందు వీటిని పరిశీలించాలి.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందా లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది.వేగంగా అనుమతులివ్వాలిబడ్జెట్ హోమ్స్‌తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి. ఈ తరహా నిర్మాణాలకు అనుమతులు త్వరితగతిన జారీ చేయాలి. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. బ్యాంక్‌లు కూడా బడ్జెట్ గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా వడ్డీరేట్ల తగ్గింపు, రుణ నిబంధనల సడలింపులతో ప్రత్యేక పథ కాన్ని తీసుకురావాలి. – జక్కా వెంకట్‌రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్ -
హైదరాబాద్‌లో అలాంటి ఇళ్లకు పెరిగిన డిమాండ్!
హైదరాబాద్ నగరంలో రూ.1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. నగరంలోని రెసిడెన్షియల్ అమ్మకాలు, లాంచ్‌లలో దాదాపు సగం వాటాను ఈ హై-ఎండ్ హౌసింగ్ సెగ్మెంట్ కలిగి ఉందని సీబీఆర్ఈ, క్రెడాయ్ తెలంగాణ సంయుక్త నివేదిక పేర్కొంది.నివేదిక ప్రకారం.. 2021 వరకు 30% వాటాను కలిగి ఉన్న రూ.1-2 కోట్ల విభాగంలో అమ్మకాలు 2022 నుంచి 50 కంటే ఎక్కువ శాతానికి పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేటగిరీలో లాంచ్‌లు 2022 నుంచి 55-65% వాటాను కలిగి ఉన్నాయి. ఇవి కోవిడ్ మహమ్మారికి ముందు ప్రతి సంవత్సరం 20% కంటే తక్కువగా ఉండేవి.ఇదే క్రమంలో ప్రీమియం ( రూ. 2-4 కోట్లు), లగ్జరీ (రూ. 4 కోట్లకు పైగా) విభాగాలు గతంలో 2021 వరకు మొత్తం లాంచ్‌లలో 5% కంటే తక్కువగా ఉండగా 2023, 2024 ప్రథమార్థంలో నగరం మొత్తం లాంచ్‌లలో 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.మరోవైపు యాదృచ్ఛికంగా 2021 వరకు 50% వాటా ఉన్న మిడ్-సెగ్మెంట్ ( రూ.45 లక్షల నుంచి రూ.1 కోటి) అమ్మకాలు 2024 ప్రథమార్థంలో 25% కంటే తక్కువకు పడిపోయాయి. తత్ఫలితంగా ఈ సెగ్మెంట్లో లాంచ్‌ల వాటా కూడా పడిపోయింది. కోవిడ్‌కు ముందు కాలంలో దాదాపు 60-70%తో పోలిస్తే దాదాపు 25%కి క్షీణించిందని నివేదిక పేర్కొంది. -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్‌కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ జోరుగా హుషారుగా కొనసాగుతోంది. మార్చిలో నమోదైన రూ.3,352 కోట్ల విలువైన ఇళ్ల కొనుగోలు డీల్స్ ఈ జోష్‌కు అద్దం పడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) నివేదిక ప్రకారం హైదరాబాద్, మేడ్చెల్ మల్కజ్గిరీ, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలు ఎంతైనా సరే.. తగ్గేదేలే అన్నట్టు కొనుగోలుకు ఎగబడుతున్నారు జనం. క్క మార్చి నెలలోనే 6,414 అపార్ట్మెంట్లు బుకింగ్స్ జరిగాయంటేనే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రితం నెలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఆర్బీఐ (ఈసారి యథాతథమే) వడ్డీరేట్ల ప్రకారం గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు మార్చిలో బలంగా కొనసాగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి 2023లో నమోదైన మార్చి మొత్తం ఇళ్లలో 53 శాతం ధర రూ. 25 లక్షల-50 లక్షల మధ్య ఉండగా, నమోదైన మొత్తం విక్రయాల్లో 70 శాతం 1,000 చ.అ.ల నుంచి 2వేల మధ్య ఉన్న ఇళ్లకు సంబంధించినవి. రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు 29 శాతంగా ఉన్నాయి. మార్చి 2023లో రూ. 25 లక్షల కంటే తక్కువున్న ఇళ్ల డిమాండ్ వాటా 18 శాతంగా ఉంది. 'లార్జర్ టికెట్ సైజ్ హోమ్స్ కు డిమాండ్ మరింత పెరుగుతోందని రూ.1 కోటి, ఆపైన విలువ గల ఇళ్లకు డిమాండ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఏడాది మార్చిలో 6 శాతంగా ఉన్న డిమాండ్ 2023 నాటికి 10 శాతానికి పెరిగింది. మొత్తం విక్రయాలు జరిగిన ఇళ్లలో వీటి షేరు 70 శాతం ఎక్కువని శాంసన్ ఆర్థుర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వినియోగదారులు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులపై, ప్రయోజనాలపై బలమైన విశ్వాసంతో ఉన్నారని, నగరంలో అప్బీట్ అవుల్ లుక్‌ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) -
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు భేష్
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) ముగిసే నాటికి (2022 అక్టోబర్–డిసెంబర్) దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయంకాని హౌసింగ్ స్టాక్‌లు 10 శాతం తగ్గి 4,61,600 యూనిట్లకు పడిపోయాయని ప్రోప్‌ఈక్విటీ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2–జూలై–సెప్టెంబర్) ఈ సంఖ్య 5,12,526 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, దేశ సగటుతో సమానంగా (10 శాతం) విక్రయంకాని గృహాల సంఖ్య క్యూ2, క్యూ3ల్లో 93,473 యూనిట్ల నుంచి 84,545కు తగ్గింది. నివేదికలో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. ► తొమ్మిది నగరాల్లో హౌసింగ్ విక్రయాల సంఖ్య అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,20,275 యూనిట్లు. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య 8 శాతం అధికంకాగా, 2021 ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అధికం. ► రియల్ ఎస్టేట్ గణాంకాల విశ్లేషణ సంస్థ– ప్రోప్‌ఈక్విటీ తాజా డేటా కోసం పరిగణనలోకి తీసుకున్న గృహాల్లో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఫ్లోర్లు విల్లాలు/గృహాలు ఉన్నాయి. హోల్డ్‌లో (నిలిచిపోయిన) ఉన్న అమ్మకాలు, నిర్మాణాల నిలిపివేత, లాటరీ ప్రాజెక్ట్‌లను ఈ గణాంకాల నుంచి మినహాయించడం జరిగింది. సవాళ్లు ఉన్నా... పటిష్ట రికవరీ అనేక సవాళ్లు ఉన్నప్పటికీ...ఈ ఏడాది గృహాల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్, పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతుండటం గమనార్హం. వడ్డీరేట్లు స్థిరంగా పెరిగినప్పటికీ, కస్టమర్లు రుణాలు తీసుకోడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్తుల ధర మున్ముందు పెరుగుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. – సమీర్ జసుజా, ప్రోప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ మార్కెట్ సెంటిమెంట్ బాగుంది.. ఇంటి కొనుగోళ్లకు మార్కెట్ సెంటిమెంట్ భారీగా మెరుగుపడినందున భారతదేశం అంతటా అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో అలాగే 2022లో భారీ జంప్‌ను చూశాయి. కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటలో ఉన్న చాలా మంది కస్టమర్లు ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి వచ్చారు. దీనివల్లే చివరకు బ్లాక్‌బస్టర్ అమ్మకాలు జరిగాయి. – శివాంగ్ సూరజ్, ఇన్‌ఫ్రామంత్రా వ్యవస్థాపక డైరెక్టర్ సానుకూలం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగ సూచీ సానుకూల శ్రేణిలోనే ఉంది. వచ్చే ఆరు నెలలకు సంబంధించి సూచించే మా ఫ్యూచర్ సెంటిమెంట్ ఇండెక్స్ కొంత మెరుగుపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధి అవకాశాల దృష్ట్యా భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు 2022 డిసెంబర్ త్రైమాసికంలో 58కి పెరిగింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57గా ఉంది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
ఇల్లు.. డిమాండ్ ఫుల్లు!
ముంబై: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చక్రంలో ఉందని, ఇళ్లకు ఇక ముందూ డిమాండ్ బలంగానే ఉంటుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో ఇళ్ల మార్కెట్ వాస్తవికంగా ఉంటుందని, స్పెక్యులేషన్ శైలితో నడవదన్నారు. సీఐఐ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందస్తు స్థాయిని దాటిపోవడం బలమైన విశ్వాసానికి నిదర్శనంగా దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారితోపాటు, పెద్ద ఇళ్లకు మారేవారి నుంచి డిమాండ్ వస్తున్నట్టు చెప్పారు. ‘‘నా 50 ఏళ్ల వృత్తి జీవితంలో ఇళ్లు అందుబాటు ధరల్లో లభించడం ఇప్పుడున్న మాదిరిగా ఎప్పుడూ చూడలేదు. పుష్కలమైన నగదు లభ్యత, కనిష్ట వడ్డీ రేట్లు, ఇంటి యజమాని కావాలనే కోరికను గతంలో ఈ స్థాయిలో చూడలేదు. పాశ్చాత్య దేశాల్లో ఇళ్ల ధరలు కరోనా విపత్తు సమయంలో గణనీయంగా పెరగడం చూసే ఉంటారు. సరఫరా పెరగకపోవడానికితోడు, పెట్టుబడులు, స్పెక్యులేషన్ ధోరణి ధరలు పెరగడానికి కారణం. కానీ భారత్‌తో ఇళ్లకు డిమాండ్ నిజమైన కొనుగోలు దారుల నుంచే వస్తుంది. ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనిష్ట వడ్డీ రేట్లు మద్దతుగా నిలిచాయి. రియల్ ఎస్టేట్ పరిశ్రమ గత క్షీణత సైకిల్ నుంచి కోలుకుంది’’అని పరేఖ్ వివరించారు. ఆదాయాలు పెరిగాయి... జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి 11 శాతంగా ఉన్నట్టు దీపక్ పరేఖ్ తెలిపారు. ఐటీ, ఈ కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, ఆర్థిక సేవల రంగం, పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు, నూతన తరం పారిశ్రామికవేత్తలకు ఆదాయ స్థాయిలు పెరిగాయని చెప్పారు. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరిగితే చిన్న వయసులోనే ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాజెక్టుల ధరలు 15–20 శాతం వరకు పెరిగినట్టు చెప్పారు. కానీ, అందుబాటు ధరల ఇళ్లు ఇప్పటికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నట్టు తెలిపారు. వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగితే అది ఇళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపబోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) కాన్సెప్ట్‌కు ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లకు çపరేఖ్ సూచించారు. కరోనా కాలంలోనూ.. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించినా, పలు విడతలుగా మహమ్మారి విరుచుకుపడినా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి బలంగా నిలదొక్కుకుంది. అంతేకాదు వృద్ధి క్రమంలో ప్రయాణిస్తోంది. నివాస గృహాల మార్కెట్ వృద్ధి క్రమంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, కనిష్ట వడ్డీ రేట్లు ఉండడంతో 2022లోనూ రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు అదే పనిగా పెరిగిపోవడం 2021లో ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది. – ధ్రువ్ అగర్వాల్, ప్రాప్‌టైగర్.కామ్ గ్రూపు సీఈవో -
ఎన్సీఆర్లో ఇళ్లకు భారీ గిరాకీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఆవాసాలకు గిరాకీ పెరిగింది. తొలి ఆరు నెలల కాలంలో 18 శాతంమేర ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ ఆరు నెలల కాలంలో మొత్తం 35 వేల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం మెరుగుపడిందనేందుకు సంకేతంగా నిలిచిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. చౌక ధరల ఇళ్లకు మంచి గిరాకీ ఉందని, 2012లో కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఇక గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 14,300 ఇళ్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ప్రాంతంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 3,750 మాత్రమే. గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు కొంతమేర తగ్గిపోయాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే బిల్డర్లు దృష్టి సారించారని, కొత్తవాటి జోలికి వెళ్లడం లేదని, కొనుగోలుదార్ల సెంటిమెంట్ కూడా గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి కారణమైందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అయితే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా ఈ రెండుచోట్ల దాదాపు 49 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2012తో పోలిస్తే ఈ రెండు ప్రాంతాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 11 శాతం మేర పెరిగాయి. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఈ ఏడాది 5.4 లక్షల ఆవాసాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇందులో 1.32 లక్షల యూనిట్లు ఇంకా అమ్ముడుపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. డిమాండ్‌ను అందుకునే దిశగానే బిల్డర్లు అడుగులు వేస్తున్నారన్నారు. 2010తో పోలిస్తే గడచిన రెండు సంవ త్సరాల్లో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.