ఎన్‌సీఆర్‌లో ఇళ్లకు భారీ గిరాకీ
Published Thu, Oct 24 2013 10:32 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఆవాసాలకు గిరాకీ పెరిగింది. తొలి ఆరు నెలల కాలంలో 18 శాతంమేర ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ ఆరు నెలల కాలంలో మొత్తం 35 వేల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం మెరుగుపడిందనేందుకు సంకేతంగా నిలిచిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. చౌక ధరల ఇళ్లకు మంచి గిరాకీ ఉందని, 2012లో కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఇక గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 14,300 ఇళ్లు అమ్ముడుపోయాయి.
గత ఏడాది ఇదే కాలంలో ఈ ప్రాంతంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 3,750 మాత్రమే. గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు కొంతమేర తగ్గిపోయాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే బిల్డర్లు దృష్టి సారించారని, కొత్తవాటి జోలికి వెళ్లడం లేదని, కొనుగోలుదార్ల సెంటిమెంట్ కూడా గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి కారణమైందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అయితే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా ఈ రెండుచోట్ల దాదాపు 49 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2012తో పోలిస్తే ఈ రెండు ప్రాంతాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 11 శాతం మేర పెరిగాయి. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఈ ఏడాది 5.4 లక్షల ఆవాసాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇందులో 1.32 లక్షల యూనిట్లు ఇంకా అమ్ముడుపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. డిమాండ్‌ను అందుకునే దిశగానే బిల్డర్లు అడుగులు వేస్తున్నారన్నారు. 2010తో పోలిస్తే గడచిన రెండు సంవ త్సరాల్లో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
Advertisement
Advertisement