భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాల భారం.. వంటి రకరకాల కారణాలతో సామాన్యులకు హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాలు అందుబాటు ధరల్లో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, ఆధునిక వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీపడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే గానీ సొంతింటి కల సాకారం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల నెరవేరడానికి దగ్గరి దారిని చూపించే ప్రాంతాలపై ‘సాక్షి రియల్టీ’ప్రత్యేక కథనం... –సాక్షి, సిటీబ్యూరో
రెండు బెడ్‌రూమ్స్, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే అద్దెసొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి ఆలోచనగా ఉంటుంది. దీంతో రూ.50 లక్షలలోపు ధర ఉండే గృహాలకు డిమాండ్ బాగా పెరిగింది.
ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే...
మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
పీఎంఏవైను సవరించాలి..
లాభం ఉందంటే అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు కూడా ముందుకొస్తారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో డెవలపర్లలో విశ్వాసం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం నిబంధనలను సవరించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనల వర్తింపు సరికాదు. ఎందుకంటే... 700 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్. దానిని హైదరాబాద్‌లో బడ్జెట్ హోమ్‌గా పరిగణిస్తుంటారు. అందుకే పీఎంఏవై స్కీమ్ ప్రయోజనాలను గృహ కొనుగోలుదారుల ఆదాయాన్ని బట్టి కాకుండా అపార్ట్‌మెంట్ విస్తీర్ణాన్ని బట్టి వర్తింపజేయాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హత పొందుతారు.
కొనే ముందు వీటిని పరిశీలించాలి..
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందా లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది.
వేగంగా అనుమతులివ్వాలి
బడ్జెట్ హోమ్స్‌తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి. ఈ తరహా నిర్మాణాలకు అనుమతులు త్వరితగతిన జారీ చేయాలి. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. బ్యాంక్‌లు కూడా బడ్జెట్ గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా వడ్డీరేట్ల తగ్గింపు, రుణ నిబంధనల సడలింపులతో ప్రత్యేక పథ కాన్ని తీసుకురావాలి.
– జక్కా వెంకట్‌రెడ్డి, ఏవీ కన్‌స్ట్రక్షన్స్
Comments
Please login to add a commentAdd a comment