affordable homes
-
హైదరాబాద్‌లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్‌లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.హైదరాబాద్‌లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి. -
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
సాధారణంగా ఓ ఇల్లు కట్టాలంటే బోలెడంత సమయం కావలి. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ఇలా.. చాలా ముడిపదార్ధాలు కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కేవలం వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇల్లు కట్టే 3డీ టెక్నాలజీ వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..3డీ ప్రింటెడ్ హౌస్ అనేది వాతావరణ పరిస్థితులను, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల బీఎమ్ పార్ట్నర్ COBOD BOD2 మోడల్‌లలో ఒకదాన్ని ఉపయోగించి కేవలం ఐదు రోజుల్లోనే ఓ ఇల్లు నిర్మించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక్కడ కనిపించే ఇల్లు ఇటుకలతో నిర్మించిన ఇంటి కంటే తక్కువ ధరలోనే నిర్మించారు. ఈ ఇల్లు కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఉన్నట్లు సమాచారం. దీనిని నిర్మించిన కంపెనీ ఇతర ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల మాదిరిగానే.. 3D ప్రింటర్ నాజిల్ నుంచి సిమెంట్ వంటి మిశ్రమాన్ని పొరలుగా పేర్చుతుంది. ఈ విధంగా గోడ నిర్మాణం జరిగింది. ఇది రిక్టర్ స్కెలు మీద 7.0 తీవ్రత నమోదు చేసే భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు.బీఎమ్ పార్ట్నర్ ఈ ఇంటిని బలమైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించింది. ఇది సాధారణ ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఇంటికంటే కూడా గట్టిగా ఉంటుంది. ఇందులో కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ వంటి వాటిని కూడా బిల్డర్లు నిర్మించినట్లు సమాచారం.3డీ ప్రింటెడ్ ఇంటిని ఐదు రోజుల్లో నిర్మించినప్పటికీ ప్రింటర్ సెటప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫర్నిచర్ ఇన్స్టాల్ చేయడం ముగించే వరకు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టిందని బిల్డర్స్ పేర్కొన్నారు. ఈ ఇంటిని నిమించడానికి సుమారు 21800 డాలర్స్ ఖర్చు అయినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 18 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.మన దేశంలో 3డీ ప్రింటెడ్ హౌస్‌భారతదేశంలో కూడా ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కేవలం 5 రోజుల్లో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హౌస్‌ను నిర్మించింది. దీనిని కేంద్ర మంత్రి సీతారామన్ ప్రారంభించారు. ఈ ఇంటిని కాంక్రీట్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేశారు. హబిటాట్ ఫర్ హ్యుమానిటీ యొక్క టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌తో కలిసి అభివృద్ధి చేశారు. -
తగ్గిపోయిన కొత్త అఫోర్డబుల్ ఇళ్లు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. మరోవైపు 2023 క్యాలెండర్ ఇయర్లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘రియల్ ఎస్టేట్ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా ప్రకారం హైదరబాద్‌లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్‌కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గింది. -
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!
న్యూఢిల్లీ: అఫర్డబుల్ ఇళ్లు (రూ. 40 లక్షల లోపు గృహాలు) సరఫరా గణనీయంగా తగ్గుతోంది. 2018 నుంచి గతేడాది వరకూ నాలుగేళ్ల వ్యవధిలో ఏడు ప్రధాన నగరాల్లో ఇది 20 శాతానికి పడిపోయింది. 2018లో ఇది 40 శాతంగా ఉండేది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఆవిష్కరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థలం ఖరీదుగా మారడం, లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, తక్కువ వడ్డీ రేటుతో అవసరమై నంతగా రుణలభ్యత లేకపోవడం తదితర అంశాలు తాజా అఫర్డబుల్ ఇళ్ల సరఫరా పడిపోవడానికి కారణమని అనరాక్ పేర్కొంది. 2018లో ఏడు నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో 40 శాతం అఫోర్డబుల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30 శాతానికి, 2021లో 26 శాతానికి, గతేడాది 20 శాతానికి తగ్గిపోయింది. ‘అఫర్డబుల్ ఇళ్ల విభాగం పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణాల్లో ఒకటి స్థలమే. మధ్య స్థాయి, ప్రీమియం ఇళ్లతో డెవలపర్లు సులభంగానే స్థలం ఖర్చులు రాబట్టుకోగలరు. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్ ) కానీ అఫర్డబుల్ ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇక ఈ ప్రాజెట్లకు లాభాల మార్జిన్లు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. ముడి వనరుల ఖర్చులు (సిమెంటు, ఉక్కు, లేబర్ మొదలైనవి) పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్ ఇళ్ల నిర్మాణం మరింత కష్టంగా మారుతోంది‘ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. డిమాండు రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు అపార్ట్మెంట్లకు డిమాండు ఉంటోందని ఆయన పేర్కొన్నారు. (7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
గృహ రంగానికి గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఇక గృహ రుణాలు చౌకగా లభ్యం కానున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది. దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్‌ను కల్పించారు. -
అందుబాటు గృహాలకే డిమాండ్
కానీ, సరఫరా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు • మార్చికల్లా మంచిర్యాలలో బ్రాంచ్ ప్రారంభం • మా రుణాల్లో ఏపీ–తెలంగాణ వాటా 22 శాతం • వచ్చే ఏడాదికల్లా 30 శాతానికి చేరుస్తాం • డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘దేశంలో రోజురోజుకూ అందుబాటు ధరల్లో ఉండే గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. 87 శాతం ప్రజలు ఈ గృహాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, సరఫరా మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. అందుబాటు గృహాల డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం 7 కోట్లుగా అంచనా వేస్తున్నాం’’ అని డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా వివరించారు. సులభంగా బ్యాంకు రుణాలు మంజూరవుతుండటం, నగరాలకు ఎక్కువ మంది వస్తుండటం వంటి కారణాల వల్ల ఎగువ మధ్యతరగతి, లగ్జరీ గృహాల నిర్మాణాలే ఎక్కువగా నిర్మిస్తున్నారని, దీంతో అందుబాటు ఇళ్లకు కొరత ఏర్పడుతోందని ఆయన వివరించారు. బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో మొత్తం గృహ రుణాల విపణి సుమారు రూ.1.20 లక్షల కోట్లుగా ఉంటే.. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా 20–30 శాతంగా ఉందని ఆయన తెలియజేశారు. ఏటా పరిశ్రమ 15–17 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందన్నారు. ‘‘గడిచిన రెండు నెలలుగా బ్యాంకుల్లో పేరుకుపోయిన డబ్బు క్రమంగా ఇప్పుడు మార్కెట్లోకి వస్తోంది. అందుకే ఆర్బీఐ కూడా విత్‌డ్రా పరిమితిని క్రమంగా పెంచుతోంది. ఇలాగే వచ్చే రెండు మూడు నెలల్లో గృహ రుణ వడ్డీ రేట్లను కూడా తగ్గించే అవకాశముంది’’ అని మెహతా అంచనా వేశారు. ఈ తగ్గింపు పావుశాతం ఉండవచ్చని చెప్పారాయన. గృహ రుణాల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) చాలా తక్కువగా ఉంటాయంటూ... డీహెచ్ఎఫ్ఎల్కు 0.95 శాతం ఎన్‌పీఏలున్నాయని, విలువ పరంగా చూస్తే గతేడాది డిసెంబర్ 31 నాటికి ఇవి రూ.65.6 కోట్లు అని తెలియజేశారు. 30 శాతం వృద్ధి లక్ష్యం.. దేశంలోని మొత్తం గృహ రుణాల విపణిలో డీహెచ్ఎఫ్ఎల్ వాటా 12–14 శాతం వరకూ ఉన్నట్లు మెహతా చెప్పారు. ‘‘గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.6,525 కోట్ల గృహ రుణాలను పంపిణీ చేశాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రూ.1,296 కోట్లు, హైదరాబాద్‌లో రూ.221 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. మొత్తం వ్యాపారంలో 22 శాతంగా ఉన్న ఏపీ, తెలంగాణ వాటాను వచ్చే 9 నెలల్లో 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్ఎల్కు 350 బ్రాంచీలున్నాయి. తెలంగాణలో 30 ప్రాంతాల్లో 14 బ్రాంచీలు, ఏపీలో 70 ప్రాంతాల్లో 18 బ్రాంచీలున్నాయి. మార్చి నాటికి మంచిర్యాలలో బ్రాంచీని ప్రారంభించనున్నాం. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 వేల కుటుంబాలకు రుణాలందించాం’’ అని వివరించారాయన.