న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ.
మరోవైపు 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘రియల్ ఎస్టేట్ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
డేటా ప్రకారం హైదరబాద్‌లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్‌కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment