సాధారణంగా ఓ ఇల్లు కట్టాలంటే బోలెడంత సమయం కావలి. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ఇలా.. చాలా ముడిపదార్ధాలు కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కేవలం వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇల్లు కట్టే 3డీ టెక్నాలజీ వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
3డీ ప్రింటెడ్ హౌస్ అనేది వాతావరణ పరిస్థితులను, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల బీఎమ్ పార్ట్‌నర్ COBOD BOD2 మోడల్‌లలో ఒకదాన్ని ఉపయోగించి కేవలం ఐదు రోజుల్లోనే ఓ ఇల్లు నిర్మించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ కనిపించే ఇల్లు ఇటుకలతో నిర్మించిన ఇంటి కంటే తక్కువ ధరలోనే నిర్మించారు. ఈ ఇల్లు కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఉన్నట్లు సమాచారం. దీనిని నిర్మించిన కంపెనీ ఇతర ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల మాదిరిగానే.. 3D ప్రింటర్ నాజిల్ నుంచి సిమెంట్ వంటి మిశ్రమాన్ని పొరలుగా పేర్చుతుంది. ఈ విధంగా గోడ నిర్మాణం జరిగింది. ఇది రిక్టర్ స్కెలు మీద 7.0 తీవ్రత నమోదు చేసే భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు.
బీఎమ్ పార్ట్‌నర్ ఈ ఇంటిని బలమైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించింది. ఇది సాధారణ ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఇంటికంటే కూడా గట్టిగా ఉంటుంది. ఇందులో కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ వంటి వాటిని కూడా బిల్డర్లు నిర్మించినట్లు సమాచారం.
3డీ ప్రింటెడ్ ఇంటిని ఐదు రోజుల్లో నిర్మించినప్పటికీ ప్రింటర్ సెటప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫర్నిచర్ ఇన్‌స్టాల్ చేయడం ముగించే వరకు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టిందని బిల్డర్స్ పేర్కొన్నారు. ఈ ఇంటిని నిమించడానికి సుమారు 21800 డాలర్స్ ఖర్చు అయినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 18 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.
మన దేశంలో 3డీ ప్రింటెడ్ హౌస్
భారతదేశంలో కూడా ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కేవలం 5 రోజుల్లో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హౌస్‌ను నిర్మించింది. దీనిని కేంద్ర మంత్రి సీతారామన్ ప్రారంభించారు. ఈ ఇంటిని కాంక్రీట్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేశారు. హబిటాట్ ఫర్ హ్యుమానిటీ యొక్క టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌తో కలిసి అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment