‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా... అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. ఇల్లుమీద ఇల్లు (అదేనండీ అపార్ట్‌మెంట్లు) కట్టాలన్నా లేక ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. పునాది మొదలు పైకప్పు దాకా కలల పొదరిల్లు సమకూర్చుకోవాలంటే ఎన్నో నెలల సమయం పడుతుంది.
ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. అయితే సాధారణ ఇల్లు నిర్మాణానికి అయ్యే వ్యయంలో కేవలం 20 శాతంతోనే అందమైన ఇల్లు తయారైతే..! అది కూడా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సిద్ధమైపోతేనో..!! దీనికి నిదర్శనంగా భారత సైన్యానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ తాజాగా గుజరాత్‌లోని గాంధీనగర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో రెండు ఇళ్లను నిర్మించింది.
వాయుసేనకు చెందిన సౌత్‌వెస్టర్న్ ఎయిర్ కమాండ్ కోసం కేవలం 35 రోజుల్లో ఈ ఇళ్లనుకట్టింది. అవే ఇళ్లను సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు కనీసం 6 నెలల సమయం పట్టేదని తెలిపింది. ఇంతకీ ఏమిటీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ? వాటితో ఇళ్లు ఎలా కడతారు?
ఏమిటీ పరిజ్ఞానం?
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్న 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. విదేశాల్లో ఈ ప్రక్రియ కొంత పుంజుకోగా మన దేశంలోనూ అక్కడక్కడా మొదలవుతోంది. సాధారణ పద్ధతుల్లో తయారు చేసే ఒక వస్తువు, పరికరం లేదా ఆకారాన్ని అత్యంత వేగంగా, అదే సమయంలో కారుచవకగా తయారు చేయగలడమే 3డీ పరిజ్ఞానంలోని ప్రత్యేకత.
ఎలా సాధ్యం?
3డీ ప్రింటింగ్ విధానంలో ముందు కంప్యూటర్ ద్వారా ఇంటి డిజైన్‌ను ఖరారు చేస్తారు. ఆపై 3డీ ప్రింటర్ ద్వారా ఆఫ్‌సైట్ లేదా ఆన్‌సైట్‌లో ఇంటిని పొరపొరలుగా నిర్మిస్తారు. అంటే ఇంటి డిజైన్‌ను అనుసరించి అన్నివైపులా కదిలే ఓ పరికరం సాయంతో కాంక్రీట్‌ను పోస్తారన్నమాట. ఇందుకోసం ప్రత్యేకమైన కాంక్రీట్‌ను వినియోగిస్తారు. ఇసుక, సిమెంట్, జియోపాలిమర్లు, ఫైబర్లతో దీన్ని తయారు చేస్తారు.
ఒక స్టాండర్డ్ 3డీ ప్రింటర్ ద్వారా నిర్మించే ఇల్లు ఎంతవేగంగా తయారవుతుందంటే... 2,000 చదరపు అడుగుల ఇంటిని కేవలం వారం రోజుల వ్యవధిలో సిద్ధం చేసేయొచ్చన్నమాట. అలాగే ఒక స్టాండర్డ్ డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే 3డీ ఇంటి నిర్మాణానికి కేవలం రూ. 5.5 లక్షల్లోపే ఖర్చు కానుండటం మరో విశేషం.
ఇంటి నిర్మాణ వ్యర్థాలు సైతం మామూలు ఇళ్లతో పోలిస్తే మూడో వంతుగానే ఉంటాయి. 3డీ ఇళ్లు 60 ఏళ్లపాటు చెక్కుచెదరవని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ ఇంక్యేబేటర్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ త్వస్తా గతేడాది 3డీ ప్రింటర్ పరిజ్ఞానంతో 600 గజాల సింగిల్ బెడ్రూం ఇంటిని కేవలం 21 రోజుల్లో నిర్మించింది. అమెరికా సైన్యం సైతం ఇటీవల టెక్సాస్‌లో 3,800 చదరపు అడుగుల బ్యారక్‌ను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేసింది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment