సదస్సులో ఏర్పాటు చేసిన త్రీడీ ప్రింటింగ్ ఇంప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: మెడికల్ ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య సేవలు మరింత మెరుగుపర్చవచ్చని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ టెక్నాలజీలో భారత్ కీలకమైన పాత్ర పోషించనుందని, ఈ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. కేటీఆర్ శుక్రవారమిక్కడ హెచ్‌ఐసీసీలో ‘వైద్య పరికరాలు, ఇంప్లాంట్స్–3డీ ప్రింటింగ్’పై జరిగిన జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ‘ఇప్పటికే టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం.
సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంలో భాగంగా 3డీ ప్రింటింగ్‌పై దృష్టి సారించాం. టీ వర్క్స్ ద్వారా అనేక నమూనాలను రూపొందిస్తున్నాం. 3డీ ప్రింటింగ్ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్య సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఏర్పడుతుంది’ అని చెప్పారు. ఆర్థికంగా హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ మార్కెట్ విలువ 2020లో 1.7 బిలియన్ డాలర్లుగా ఉందని, 2027 నాటికిది 7.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు.
ఆర్థోపెడిక్, డెంటల్‌తోపాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్ పెరగడం ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణం అని చెప్పారు. అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతోందన్నారు. ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి.
3డీ ప్రింటింగ్ వాడకం పెరగాలి
వైద్య పరికరాల్లో 3డీ ప్రింటింగ్‌ను గత దశాబ్దకాలంగా వాడుతున్నారని, 100కు పైగా వైద్య పరికరాల్లో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ‘3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పు. వైద్యంలోనే కాకుండా ఇతరత్రా రంగాల్లోనూ 3డీ ప్రింటింగ్ సాంకేతికతను వినియోగించాలి. దేశంలో ఇటువంటి సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలకు అభినందనలు’ అని కేటీఆర్ చెప్పారు. ‘రాష్ట్రంలో అనేక స్టార్టప్ కంపెనీలు, అకాడమీలు వచ్చాయి. విహబ్‌తోపాటు టీహబ్‌ను తెలంగాణ ప్రారంభించింది. రాష్ట్రంలో ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటివాటితో కలిపి 1,500కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. ఇవి ఐదేళ్లలో దాదాపు రూ.1,800 కోట్లు ఫండింగ్ చేశాయి’ అని పేర్కొన్నారు.
ప్రొటోటైప్‌కు సంబంధించిన టీ వర్క్స్.. కరోనా కాలంలో మెకానికల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. సదస్సులో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డాక్టర్ రాజేంద్రకుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment