సాక్షి, హైదరాబాద్: ‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. లైఫ్‌సైన్సెస్‌తోపాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. బేగంపేటలో మంగళవారం ఏర్పాటుచేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇటీవల బయో ఆసి యా సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నా యని కేటీఆర్ తెలిపారు. 2013తో పోలి స్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని, 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామ ని మంత్రి వివరించారు. ఉపాధి కల్పనకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందన్నారు.
ప్రపంచ టీకాల్లో సగం హైదరాబాద్‌లోనే తయారీ..
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, 900 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఉత్పత్తి 1,400 కోట్ల డోస్‌లకు పెరగవచ్చన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం తెలంగాణలోని డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని, ఇది దేశానికే మొబిలిటీ కేంద్రంగా మారుతుందని చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో మరిన్ని పారిశ్రామిక పార్కులు
గత ఎనిమిదేళ్లలో 28,500 ఎకరాల్లో 55 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. గత 40 ఏళ్లలో 26 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన 109 పారిశ్రామిక పార్కులకంటే ఇవి ఎక్కువన్నారు. ప్రస్తుతం మరో 72 ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబో యే ఐదేళ్లలో 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.
సాంకేతిక పురోగమనం..
నేడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ పరిణామం దేశవ్యాప్తంగా ప్రతి భావంతులను, మేధావులను ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత, సాంకేతిక పురోగమనం పెద్దవారికే కాకుండా చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు సహాయపడేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాపారాల కోసం ప్రారంభించిన ఇండియన్ బిజి నెస్ పోర్టల్ గ్లోబల్‌లింకర్ ప్రత్యేకంగా ఎగుమతుల ను ప్రోత్సహించడం కోసం రూపొందిందన్నారు.
విద్యుత్, టెక్స్‌టైల్ రంగాలకు ఊతం..
ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. టెక్స్‌టైల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందన్నా రు. భారీస్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్ సుచిత్ర ఎల్లా, సీఐఐ తెలంగాణ చైర్మన్ వాగీష్ దీక్షిత్, కిటెక్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం.జాకబ్, గ్లోబల్ లింకర్ డైరెక్టర్ మాళవిక జగ్గీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రీస్ అవార్డ్స్–2022’విజేతలను ప్రకటించింది. 28 మంది అవార్డు గ్రహీతలను ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ అభినందించారు.
హైదరాబాద్ అత్యుత్తమ వేదిక..
ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందని, ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాయని కేటీఆర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment