
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని, దేశానికే దిక్సూచిగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రస్తుతం 80 బిలియ¯న్ డాలర్లుగా ఉన్న తెలంగాణ భాగస్వామ్యం... 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రా, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు ‘ఐ’లు భారత్‌కు నాలుగో కన్నుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. సాంకేతికతను ఉపయోగించి వైద్య పరికరాలు, లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను తీసుకురాగల అర్హతలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, వనరులు భారత్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక అసమానతల సరిహద్దులకు అతీతంగా దేశం ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.
రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సుకు 50 దేశాల నుంచి 215 మంది ప్రతినిధులు హాజరయ్యారని, 175 స్టార్టప్ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా వైస్ మినిస్టర్ కరోలిస్, ఈస్టోనియా రాయభారి కత్రిన్ కియి, ఒడిశా మంత్రి అశోక్‌చంద్ర పాండే, మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, రెడ్డి ల్యాబ్స్ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment